First GBS Case in Hyderabad: తెలంగాణలో తొలి గులియన్ బారే సిండ్రోమ్ కేసు నమోదు, ఓ మహిళకు జీబీఎస్ పాజిటివ్
Guillain Barre Syndrome case | మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో కలకలం రేపుతోన్న గులియన్ బారే సిండ్రోమ్ కేసు తెలంగాణలో నమోదైంది. హైదరాబాద్‌లో ఓ మహిళకు జీబీఎస్ పాజిటివ్‌గా తేలింది.

Guillain Barre Syndrome Cases in Hyderabad | హైదరాబాద్: గత కొన్ని రోజులుగా మహారాష్ట్రలో కలకలం రేపిన గులియన్ బారే సిండ్రోమ్ కేసులు తెలంగాణలో నమోదవుతున్నాయి. హైదరాబాద్‌లో గులియన్ బారే సిండ్రోమ్ (Guillain Barre Syndrome) కేసు నమోదైంది. సిద్దిపేట మండలానికి చెందిన మహిళకు జీబీఎస్ పాజిటివ్ అని డాక్టర్లు నిర్ధారించారు. ప్రస్తుతం ఆ మహిళా పేషెంట్ ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఆమెకు వెంటిలేటర్‌పై చికిత్స చేస్తున్నట్లు సమాచారం. పొరుగురాష్ట్రం మహారాష్ట్రలో ఇదివరకే దాదాపు 120 మేర గులియన్ బారే సిండ్రోమ్ కేసులు నమోదు కావడం తెలిసిందే. ఈ జీబీఎస్ పాజిటివ్ గా తేలిన ముగ్గురు వ్యక్తులు పశ్చిమ బెంగాల్ లో ఇటీవల చనిపోవడంతో వైద్య నిపుణులు అలర్ట్ అయ్యారు.
ఇదివరకే మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో భారీగా గులియన్ బారే సిండ్రోమ్ కేసులు (Guillain-Barre Syndrome) నమోదయ్యాయి. ఆ రాష్ట్రాల్లో జీబీఎస్ కేసులపై అప్రమత్తమై హాస్పిటల్స్ లో బెడ్స్ సిద్ధం చేస్తున్నారు. తీవ్రత అధికంగా ఉండదని డాక్టర్లు చెబుతున్నా.. పశ్చిమ బెంగాల్ లో రెండు రోజుల కిందట ముగ్గురు చనిపోవడం ఆందోళనకు గురిచేస్తోంది. రోగనిరోధక శక్తి తక్కువ ఉన్న వారికి బ్యాక్టీరియా, వైరల్ ఇన్ఫెక్షన్ కారణంగా జీబీఎస్ బారినపడే అవకాశాలు అధికంగా ఉంటాయని డాక్టర్లు తెలిపారు. జీబీఎస్ శరీరంలోకి చేరాక రోగనిరోధక శక్తిపై ప్రతికూల ప్రభావం చూపుతూ నరాలపై దాడి చేసే అవకాశం ఉందని చెబుతున్నారు.
గులియన్ బారే సిండ్రోమ్ లక్షణాలు..
జీబీఎస్ సోకిన వారిలో ఒళ్లంతా తిమ్మిరిగా అనిపిస్తుంది. జ్వరం, వాంతులు వంటి లక్షణాలు కనిపిస్తాయి. వీటితో పాటు డయేరియా, పొత్తికడుపు నొప్పి, ఒక్కసారిగా నీరసంగా అనిపించడం, కండరాలు బలహీనంగా మారడం లాంటివి గులియన్ బారే సిండ్రోమ్ లక్షణాలుగా చెప్పవచ్చు. ఇది నీటి ద్వారా, కలుషిత ఆహారం తీసుకోవడం ద్వారా బ్యాక్టీరియా సోకుతుంది. అయితే, ఇది అంటువ్యాధి కాదని, ప్రజలు ఆందోళకు గురికావొద్దని.. చికిత్సతో బాధితులకు నయం చేయొచ్చని వైద్య నిపుణులు, అధికారులు చెబుతున్నారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

