KTR: 'రైతన్నా నీకు ఏది కావాలి? ఆలోచించుకో!' - మంత్రి కేటీఆర్ ఆసక్తికర ట్వీట్
KTR Tweet on Telangana Agriculture: తెలంగాణలో వ్యవసాయాన్ని పండుగలా మార్చిన సీఎం కేసీఆర్ కావాలో, 3 గంటల కరెంట్ చాలు అన్న కాంగ్రెస్ కావాలో రైతులు తేల్చుకోవాలని కేటీఆర్ ట్వీట్ చేశారు.
తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో ప్రచారాలు ఊపందుకున్నాయి. బహిరంగ సభలు, ప్రచారాలు సైతమే కాకుండా కీలక పార్టీల నేతలు సోషల్ మీడియాను సైతం తమ ప్రచారానికి విస్తృతంగా వాడుకుంటున్నారు. నిత్యం నెట్టింట యాక్టివ్ గా ఉంటూ అందరితోనూ మమేకమవుతారు మంత్రి కేటీఆర్. ఆయన తాజాగా, తెలంగాణ రైతులను ఉద్దేశించి ట్వీట్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తోన్న సంక్షేమ పథకాలను వివరిస్తూ, కర్ణాటక కాంగ్రెస్ అమలు చేస్తోన్న కార్యక్రమాలను బేరీజు వేస్తూ ఏది కావాలో ఎంచుకోవాలని సూచించారు.
కేటీఆర్ ఏమన్నారంటే.?
'తెలంగాణ రైతన్నా.. ఏది కావాలి మనకు?. ఆలోచించు. కేసీఆర్ కడుపు నిండా ఇస్తున్న 24 గంటల ఉచిత కరెంట్ కావాలా? లేక కర్ణాటకలో కాంగ్రెస్ ఇస్తున్న 5 గంటల కరెంట్ కావాలా?లేకుంటే టీపీసీసీ చీఫ్ చెప్పిన 3 గంటల కరెంట్ కావాలా?' అని ప్రశ్నించారు.
అలాగే, 'ఆరు దశాబ్దాలు ఆగం చేసిన వాళ్లు కావాల్నా? కాలిపోయే మోటార్లు, పేలిపోయే ట్రాన్స్ ఫార్మర్లు, మళ్లీ ఆ రోజులు కావాల్నా? లేదా రైతుబంధు, రైతుబీమా తెచ్చి, చెరువులు బాగు చేసి, ప్రాజెక్టులు కట్టి, నెర్రెలు బారిన నేలను సస్యశ్యామలం చేసిన కేసీఆర్ కావాల్నా?' అంటూ ట్విట్టర్ వేదికగా అన్నారు.
ఏది కావాలి మనకు? ఆలోచించు తెలంగాణ రైతన్నా
— KTR (@KTRBRS) October 27, 2023
కెసిఆర్ గారు కడుపునిండా ఇస్తున్న 24 గంటల ఉచిత కరెంటు కావాల్నా ?
లేక కర్ణాటకలో కాంగ్రెస్ ఇస్తున్న 5 గంటల కరెంటు కావాల్నా ?
లేకపోతె తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు చెప్పిన 3 గంటల కరెంటు కావాల్నా ?
ఆలోచించు తెలంగాణ రైతన్నా
ఆరు దశాబ్దాలు… pic.twitter.com/cpfUe3N7yV
ఊపందుకున్న ప్రచారం
మరోవైపు, తెలంగాణలో పొలిటికల్ హీట్ కొనసాగుతోంది. ఇప్పటికే పార్టీలన్నీ ప్రచారం ముమ్మరం చేశాయి. సీఎం కేసీఆర్ విస్తృత పర్యటనతో బీఆర్ఎస్ శ్రేణులు, అభిమానులు, కార్యకర్తల్లో ఉత్సాహం నింపుతున్నారు. ప్రతిరోజూ 3 నియోజకవర్గాల్లో ప్రజా ఆశీర్వాద సభలు నిర్వహిస్తూ, తనదైన ప్రసంగంతో ప్రజలను ఆకట్టుకుంటున్నారు.
నేడు కేసీఆర్ పాల్గొనే సభలివే
ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం మరో 3 నియోజకవర్గాల్లో సీఎం కేసీఆర్ పాల్గొననున్నారు. ఖమ్మం జిల్లాలోని పాలేరు, ఉమ్మడి వరంగల్ జిల్లాలోని మహబూబాబాద్, వర్దన్నపేటల్లో ప్రజా ఆశీర్వాద సభలకు హాజరు కానున్నారు. మధ్యాహ్నం ఒంటిగంటకు బేగంపేట ఎయిర్ పోర్ట్ నుంచి బయలుదేరి 1:40 గంటలకు ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం జీళ్లచెర్వు హెలీప్యాడ్ చేరుకుంటారు. 1:50 గంటలకు సభా ప్రాంగణానికి చేరుకుని ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు. అనంతరం మధ్యాహ్నం 3:10 గంటలకు మహబూబాబాద్ చేరుకుని సభలో పాల్గొంటారు. అనంతరం సాయంత్రం 4 గంటలకు వర్దన్నపేట సభలో ప్రసంగిస్తారు.