KTR : కేంద్రంలో ఉన్నది మోడీ కాదు ఏడీ ప్రభుత్వం - ఏడీ అంటే కేటీఆర్ చెప్పిన అర్థం ఏమిటంటే ?
మోడీ ప్రభుత్వంపై కేటీఆర్ సెటైర్లు వేశారు. కేంద్రంలో ఉన్న ఏడీ ప్రభుత్వమన్నారు.
KTR : కేంద్ర ప్రభుత్వం, ప్రధానమంత్రి నరేంద్రమోడీపై ఇటీవలి కాలంలో కేసీఆర్‌తో పాటు కేటీఆర్ కూడా విమర్శలు గుప్పిస్తున్నారు. కేసీఆర్ నేరుగా బహిరంగసభల్లో ఆగ్రహం వ్యక్తం చేస్తూంటే్... కేటీఆర్ మాత్రం లేఖలు రాయడం ద్వారా..సోషల్ మీడియా పోస్టుల ద్వారా విమర్శలు చేస్తున్నారు. బుధవారం కూడా మోదీ ప్రభుత్వంపై కేటీఆర్ సెటైరిక్ ట్వీట్లు చేశారు. మోదీ ప్రభుత్వం కాదని.. ఇది అటెన్షన్ డైవర్షన్ ప్రభుత్వమని విమర్శించారు. అసలు దేశ సమస్యల నుంచి ప్రజల దృష్టి మరల్చే కుట్ర జరుగుతోందన్నారు.
మోడీ ప్రభుత్వం కాదు, ఇది A-D ప్రభుత్వం; Attention Diversion
— KTR (@KTRTRS) August 24, 2022
అసలు దేశ సమస్యల నుంచి ప్రజల దృష్టి మరల్చే కుట్ర
మండిపోతున్న పెట్రో ధరల నుంచి ప్రజల దృష్టి మరల్చే కుట్ర
భారమవుతున్న నిత్యవసరాల నుంచి ప్రజల దృష్టి మరల్చే కుట్ర
ఊడిపోతున్న ఉద్యోగాల నుంచి ప్రజల దృష్టి మరల్చే కుట్ర
దేశ ప్రజల మనసుల్లో విషం నింపే కుట్ర
మండిపోతున్న పెట్రో ధరల నుంచి ప్రజల దృష్టి మరల్చే కుట్రేనని కేటీఆర్ ఆరోపించారు. భారమవుతున్న నిత్యవసరాల నుంచి ప్రజల దృష్టి మరల్చే కుట్ర అని, ఊడిపోతున్న ఉద్యోగాల నుంచి ప్రజల దృష్టి మరల్చే కుట్ర అన్నారు. ఈ కుట్రను కనిపెట్టకపోతే.. దేశానికే, భవిష్యత్ తరాలకు కోలుకోలేని నష్టమన్నారు.దేశం కోసం.. ధర్మం కోసం.. అనేది బీజేపీ అందమైన నినాదమని, విద్వేషం కోసం.. అధర్మం కోసం.. అనేది అసలు రాజకీయ విధానమని ఆరోపించారు. హర్ ఘర్ జల్ అన్నారు కానీ.. హర్ ఘర్ జహర్ (విషం) అనీ.. ప్రతి మనసులో విషయాన్ని నింపే కుట్ర చేస్తున్నారని విమర్శించారు.
పచ్చగా ఉన్నతెలంగాణలో చిచ్చు
పచ్చగా ఉన్న తెలంగాణాలో చిచ్చు పెట్టె చిల్లర ప్రయత్నం జరుగుతోందని, విష ప్రచారాలతో మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారన్నారు. సోషల్ మీడియా ద్వారా దేశంలోని.. సోషల్ ఫ్యాబ్రిక్‌ను దెబ్బతీసే కుతంత్రం జరుగుతోందన్నారు. ద్వేషం కాదు.. దేశం ముఖ్యమని, ఉద్వేగాల భారతం కాదు.. ఉద్యోగాల భారతం ముఖ్యమని గుర్తుంచుకోవాలని కేటీఆర్ ట్వీట్ చేశారు. సోషల్ మీడియాలో కేటీఆర్ ట్వీట్ వైరల్ అవుతోంది. క్యాచీగా ఉండటంతో టీఆర్ఎస్ నేతలతో పాటు ఇతరులు కూడా షేర్ చేస్తున్నారు.
గుజరాత్ మోడల్ అభివృద్ది అంటూ.. అక్కడి రోడ్ల దుస్థితిని.. కూడా తరచూ సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటూ ఉంటారు.
This is BJP’s ‘Gujarat Model’ of Development 👇 pic.twitter.com/ejMn05oyTo
— YSR (@ysathishreddy) August 23, 2022
కేటీఆర్ ఇలా నేరుగా మోదీని టార్గెట్ చేయడం.. బీజేపీ సోషల్ మీడియా కార్యకర్తలకు ఆగ్రహాన్ని తెప్పిస్తోంది. వారు ఆయనకు నెగెటివ్ కామెంట్స్ పెడుతూంటారు. అయితే వారికి టీఆర్ఎస్ సోషల్ మీడియా కార్యకర్తలు ఘాటు కౌంటర్లు ఇస్తూ ఉంటారు.