KTR On Investments : 8 ఏళ్లలో 22 లక్షల మందికి ఉద్యోగాలు - ప్రైవేటు పెట్టుబడుల్లో తెలంగాణ ప్రగతి అద్భుతమన్న కేటీఆర్ !
ఎనిమిదేళ్లలో తెలంగాణకు లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని కేటీఆర్ తెలిపారు. 22.5 లక్షల మందికి ఉపాధి దొరికిందన్నారు.
KTR On Investments : 8 సంవత్సరాలనుంచి తెలంగాణ రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు తీసుకురావడంలో తమ ప్రభుత్వం ఘన విజయాన్ని సాధించిందనిి ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కే. తారకరామారావు సంతోషం వ్యక్తం చేశారు. టీఎస్ ఐపాస్ తో రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు వచ్చాయన్నారు. ఎనిమిది సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడులతో పాటు భవిష్యత్‌లో రానున్న పెట్టుబడులపై పరిశ్రమలు-ఐటీ శాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు కేటీఆర్.
టీఎస్ఐపాస్ ద్వారా 8 ఏళ్లలో 3 లక్షల 30 వేల కోట్ల రూపాయల విలువైన పెట్టుబడులు
2014 నుంచి గత నెల నవంబర్ వరకు దాదాపు 3 లక్షల 30 వేల కోట్ల రూపాయల విలువైన పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చినట్లు మంత్రి తెలిపారు. ఈ వివరాలు కేవలం టిఎస్ ఐపాస్, ఐటీ-ఐటీ అనుబంధ రంగాల్లో వచ్చిన పెట్టుబడుల వివరాలు మాత్రమేనన్న కేటీఆర్, మైనింగ్, రియల్ ఎస్టేట్, లాజిస్టిక్స్, ఆతిథ్య రంగంతో పాటు ఇతర రంగాలలోకి వచ్చిన పెట్టుబడులన్నింటిని కలిపితే ఈ విలువ మరింత పెరిగే అవకాశం ఉందన్నారు. త్వరలోనే ఆయా రంగాల్లోకి వచ్చిన పెట్టుబడుల వివరాలను కూడా అందిస్తామని కేటీఆర్ ప్రకటించారు. ఈ మేరకు వివిధ శాఖలతో సమన్వయం చేసుకొని తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటిదాకా వచ్చిన పూర్తి వివరాలతో కూడిన నివేదికను తయారు చేయాలని అధికారులను కేటీఆర్ ఆదేశించారు.
22.5 లక్షల మందికి తెలంగాణలో ఎనిమిదేళ్లలో ఉపాధి
ఎనిమిదేళ్లలో తెలంగాణకు వచ్చిన పెట్టుబడులతో ఇరవై రెండున్నర లక్షల మందికి ప్రత్యక్షంగా ఉపాధి కలిగిందన్నారు కేటీఆర్. కేవలం ఒకటి రెండు రంగాలనే కాకుండా దాదాపు 14 రంగాలను ప్రాధాన్యత రంగాలుగా తమ ప్రభుత్వం గుర్తించి పక్కా ప్రణాళికను రూపొందించి భారీ పెట్టుబడులను సాధించిందని కేటీఆర్ తెలిపారు. ఒక్కో రంగానికి ప్రత్యేకంగా అధికారిని నియమించడంతో పాటు ఆయా రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు సంసిద్ధంగా ఉన్న కంపెనీలతో నిరంతరం సంప్రదింపులు నిర్వహించామన్నారు. తెలంగాణ ప్రభుత్వ విధానాలు, ఇక్కడి మౌలిక వసతుల గురించి వివరించడంతోనే అనేక రంగాల్లో భారీగా పెట్టుబడులు వచ్చాయన్నారు. పెట్టుబడులను ఆకర్షించే విధంగా ప్రభుత్వ పాలసీలను రూపొందించడంతో పాటు అవసరమైన పారిశ్రామిక పార్కులు, మౌలిక వసతుల కల్పనను తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతగా భావించిందన్నారు. ఫలితంగానే తెలంగాణ రాష్ట్రంలోకి భారీ ఎత్తున పెట్టుబడులు వచ్చాయన్నారు .
భవిష్యత్‌లో తెలంగాణకు మరిన్ని పెట్టుబడులు
భవిష్యత్తులోనూ తెలంగాణ రాష్ట్రానికి మరిన్ని పెట్టుబడులు వస్తాయన్న ఆశాభావాన్ని వ్యక్తం చేసిన కేటీఆర్, ఆ దిశగా ముందుకు పోవాలని అధికారులకు ఈరోజు జరిగిన సమీక్ష సమావేశంలో దిశా నిర్దేశం చేశారు. దీంతోపాటు ఐటీ మరియు పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో రానున్న సంవత్సర కాలానికి చేపట్టనున్న వివిధ కార్యక్రమాలు, ప్రాజెక్టుల ప్రారంభోత్సవాలు తదితర అంశాల పైన సుదీర్ఘంగా చర్చించారు. తెలంగాణ భవిష్యత్‌లో పెట్టుబడుకు కేంద్రం అవుతుందన్నారు.
చింతమనేని పట్ల పోలీసులు దురుసు ప్రవర్తన, అరెస్టు చేసే క్రమంలో చిరిగిన చొక్కా!