Chintamaneni Prabhakar : చింతమనేని పట్ల పోలీసులు దురుసు ప్రవర్తన, అరెస్టు చేసే క్రమంలో చిరిగిన చొక్కా!
Chintamaneni Prabhakar : ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఉద్రిక్తత నెలకొంది. హరిరామజోగయ్యను పరామర్శించేందుకు వచ్చిన చింతమనేనిని పోలీసులు అరెస్టు చేశారు.

Chintamaneni Prabhakar : టీడీపీ మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పట్ల పోలీసులు అరెస్టు చేశారు. కాపు రిజర్వేషన్ల సాధన కోసం నిరాహార దీక్షకు దిగిన మాజీ ఎంపీ హరిరామజోగయ్యను ఏలూరు ఆసుపత్రికి తరలించారు. హరిరామజోగయ్యను పరామర్శించేందుకు ఏలూరు ఆసుపత్రికి వచ్చారు చింతమనేని ప్రభాకర్. దీంతో ఆయనను పోలీసులు అరెస్టు చేశారు. చింతమనేని పట్ల పోలీసులు దురుసుగా ప్రవర్తించారు. చింతమనేనిని బలవంతంగా పోలీసు వాహనంలోకి ఎక్కించి అక్కడి నుంచి తరలించారు. ఈ క్రమంలో చింతమనేని చొక్కా చిరిగిపోయింది. దీంతో ఆస్పత్రి వద్ద టీడీపీ నాయకులు ధర్నాకు దిగారు. హరిరామజోగయ్యను పరామర్శించేందుకు వచ్చిన కాపు సంక్షేమ సమితి నేతలను కూడా పోలీసులు అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు. హరిరామజోగయ్య దీక్షతో ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఆసుపత్రి వద్ద జనసేన, టీడీపీ నేతలు ఆందోళనకు చేపట్టారు. హరిరామజోగయ్య ఆరోగ్యంపై హెల్త్ బులెటిన్ విడుదల చేయాలని టీడీపీ, జనసేన నేతలు డిమాండ్ చేస్తున్నారు.
చింతమనేని అరెస్టు
రేపు తన పుట్టిన రోజు కారణంగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేసేందుకు ఏలూరు ఆసుపత్రి వచ్చానని చింతమనేని తెలిపారు. అయితే హరిరామజోగయ్యను పరామర్శించేందుకే ఆస్పత్రికి వచ్చారన్న అనుమానంతో పోలీసులు ఆయనను అడ్డుకున్నారు. ఆసుపత్రి లోపలకు వెళ్లకుండా గేటు దగ్గరే నిలువరించి దురుసుగా ప్రవర్తించారు. దీంతో చింతమనేని ప్రభాకర్ పోలీసులతో వాగ్వాదానికి దిగారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో చింతమనేనిని పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. అనంతరం విడిచిపెట్టారు. ఈ ఘటనపై చింతమనేని తీవ్ర విమర్శలు చేశారు. పోలీసుల తీరును నిరసిస్తూ మంగళగిరిలోని టీడీపీ కేంద్ర పార్టీ కార్యాలయానికి చేరుకొని నిరసన తెలియజేశారు.
వైసీపీకి నూకలు చెల్లాయ్
చింతమనేని ప్రభాకర్ ను అరెస్టు చేసే క్రమంలో పోలీసులు దురుసుగా ప్రవర్తించారు. ఆయనను అరెస్టు చేసే క్రమంలో చొక్కా చిరిగిపోయింది. విడుదల అనంతరం చిరిగిన చొక్కాతో మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయానికి వచ్చారు చింతమనేని. అక్కడ మీడియాతో మాట్లాడిన చింతమనేని వైసీపీ ప్రభుత్వంపై మండిపడ్డారు. తన పట్ల పోలీసులు అమానుషంగా ప్రవర్తించారని మండిపడ్డారు. ఇవాళ ప్రజాస్వామ్య గుడ్డలు చించారన్నారు. వైసీపీ ప్రభుత్వానికి నూకలు చెల్లాయని చింతమనేని ప్రభాకర్ తీవ్రస్థాయిలో విమర్శించారు. అత్యుత్సాహం చూపించిన పోలీసులకు రిటర్న్ గిఫ్ట్ ఉంటుందని హెచ్చరించారు. వైసీపీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే చింతమనేనికి పట్టిన గతి పడుతుందని తనను ఉదాహరణగా చూపాలని చూస్తున్నారని ఆరోపించారు. డీఎస్పీ సత్యనారాయణ తన పట్ల దురుసుగా ప్రవర్తించారని చింతమనేని విమర్శించారు.
పరామర్శిస్తే తప్పా?
రేపు తన పుట్టిన రోజు సందర్భంగా ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రి వద్ద రక్తదాన శిబిరం ఏర్పాటు చేయటం కోసం ఏర్పాట్లు చేయడానికి వచ్చిన తనతో పోలీసులు దురుసుగా ప్రవర్తించారని చింతమనేని ఆరోపించారు. తన బట్టలు చించిన పోలీసులకు రేపు బట్టలుంటాయా? అని హెచ్చరించారు. ఆశ్రమ కళాశాలలో పిల్లల ఫీజులు ఎలా కట్టారో తెలీదా? అని నిలదీశారు. అన్ని వివరలు త్వరలోనే బయటపెడతామన్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో హరిరామ జోగయ్య ఉన్నారనే వంకతో తన కార్యక్రమo అడ్డుకున్నారని ఆరోపించారు. హరిరామ జోగయ్యను పరామర్శిస్తే తప్పంటేన్నారు. ఇప్పటికే తనపై 31 కేసులు పెట్టారని ఆరోపించారు. తాను అన్నింటికీ తెగించే ఉన్నానన్నారు. సీఎం జగన్ తాత దిగొచ్చినా తెలుగుదేశం పార్టీని ఏం చేయలేరని చింతమనేని ప్రభాకర్ స్పష్టం చేశారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

