(Source: ECI/ABP News/ABP Majha)
KTR On TDP : 16 సీట్లతో టీడీపీ సాధించింది - కేటీఆర్ కీలక వ్యాఖ్యలు
Andhra News : స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను టీడీపీ అడ్డుకుందని కేటీఆర్ ప్రకటించారు. పదహారు లోక్ సభ సీట్లతోనే ఇది సాధ్యమయిందన్నారు.
BRS News : బీఆర్ఎస్‌కు పదహారు సీట్లు వస్తే ఏం చేసుకుంటారని సీఎం రేవంత్ రెడ్డి లోక్ సభ ఎన్నికల సమయంలో మాట్లాడారని ఇప్పుడు ఏపీలో టీడీపీ పార్టీకి 16ఎంపీ సీట్లు వచ్చాయని.. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగకుండా ఆపగలిగిందని అన్నారు. తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడిన కేటీఆర్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ, సింగరేణి పై కీలక వ్యాఖ్యలు చేశారు.
తెలంగాణ రాష్ట్రానికి బీఆర్ఎస్ పార్టీ ఒక రక్షణ కవచం, శ్రీరామరక్ష అని కేసీఆర్ ఈ 25 ఏండ్లలో ఒక్కసారి కాదు వేల సార్లు చెప్పారని గుర్తు చేశారు. కానీ ఇవాళ ఏం జరిగిందని ప్రశ్నించారు. కేసీఆర్ 16 పార్లమెంట్ సీట్లు ఇవ్వండి అని మొత్తుకున్నారు ..కేంద్రంలో నిర్ణయాత్మక పాత్రలో ఉంటామని చెప్పారు. 16 ఎంపీలతో ఏం చేస్తారని సీఎం రేవంత్ రెడ్డితో సహా చాలా మంది చాలా మాట్లాడారన్నారు. కానీ ఇవాళ ఏపీలో 16 ఎంపీ సీట్లు గెలిచిన తెలుగు దేశం పార్టీ నిర్ణయాత్మక పాత్రలో ఉంది. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణ ఆగిపోయింది.
ఇప్పుడు కాంగ్రెస్, బీజేపీ కలిసి సింగరేణిని ఖతం చేసే ప్రయత్నం చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.8 స్థానాలు గెలిచిన బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు సింగరేణి బొగ్గు గనులను ప్రైవేట్ పరం చేస్తున్నాయని మండిపడ్డారు. ఉద్దేశ పూర్వకంగా సింగరేణికి కోల్ బ్లాక్స్ కేటాయించడం లేదని చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డి బొగ్గు గనుల యాక్షన్‌ను ఎందుకు అడ్డుకోవడం లేదని ప్రశ్నించారు. 16ఎంపీల పవర్ ఏంటో ఏపీని చూస్తే తెలుస్తుందని ఉద్ఘాటించారు. రేవంత్ ఎందుకు ఆపడం లేదు. కేసుల భయమా? అని ఎద్దేవా చేశారు. సింగరేణి మెడ మీద కేంద్రం కత్తి పెడితే సీఎం రేవంత్ ఆ కత్తికి సాన పడుతున్నారని ఎద్దేవా చేశారు.
సింగరేణికి ప్రమాదం వస్తే కాపాడేది బీఆర్ఎస్ మాత్రమేనని స్పష్టం చేశారు. సింగరేణిని కార్పొరేట్ గద్దలకు అప్పగించడాన్ని వ్యతిరేకిస్తున్నామన్నారు. తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ నిర్ణయాన్ని అడ్డుకుంటామన్నారు. వేలంలో పాల్గొనే వారు ఆలోచించాలని కోరారు. ఈ నిర్ణయాన్ని కేంద్రం ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఒరిస్సా, గుజరాత్‌లో ప్రభుత్వ సంస్థలకు ఇచ్చి ఇక్కడ సింగరేణికి బొగ్గు బ్లాక్స్ ఎందుకు ఇవ్వరని ప్రశ్నించారు. సింగరేణి వేలంలో ఎందుకు పాల్గొనాలని నిలదీశారు. ఇక్కడ ఉన్న ఎంపీలు చేత కానివారా అని కేటీఆర్ మండిపడ్డారు.
సింగరేణికి బొగ్గు గనులు కేటాయించకుండా ఉద్దేశపూర్వకంగా చేస్తున్న కుట్ర ఇది. రేవంత్ రెడ్డి వ్యతిరేకత ఎందుకు మాయమైంది. ముఖ్యమంత్రిగా వేలం పాటలో పొల్గొంటామని చెబుతున్నారు. ఇది దారుణం అని కేటీఆర్ మండిపడ్డారు. కేంద్రం మా మెడ మీద కత్తి పెట్టినా బొగ్గు గనులను వేలం వేయకుండా చూశాం. తొమ్మిదిన్నరేండ్లు సింగరేణిని కాపాడుకున్నాం. సింగరేణి లాభపడితే మన రాష్ట్రానికి లాభం జరుగుతుంది. కార్మికులు లాభపడుతారు. సింగరేణి కార్మికులు జంగ్ సైరన్ ఊదితే దక్షిణ భారతదేశం అంధకారంలోకి వెళ్తుందన్నారు.