KTR: ప్రేమోన్మాది చేతిలో గాయపడిన కుటుంబానికి అండగా నిలిచిన కేటీఆర్, రూ.5 లక్షల ఆర్థిక సాయం
Warangal: ప్రేమోన్మాది నాగరాజు దాడి చేసిన కుటుంబానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అండగా నిలిచారు. బీఆర్ఎస్ పార్టీ తరఫున రూ.5 లక్షలతో పాటు పిల్లలిద్దరి చదువు బాధ్యత తనదేనని ప్రకటించారు.
KTR Extends Financial Assistance: వరంగల్ జిల్లాలోని నర్సంపేట నియోజకవర్గం 16 చింతలతండా గ్రామంలో వారం రోజుల కిందట ప్రేమోన్మాది దాడిలో దారుణ హత్యకు గురైన గిరిజన కుటుంబాన్ని ఆదుకునేందుకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముందుకు వచ్చారు. గాయపడిన గిరిజన కుటుంబానికి ఆయన అండగా నిలిచారు. మాజీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి సుదర్శన్ రెడ్డితో కలిసి బాధిత కుటుంబాన్ని కేటీఆర్ మంగళవారం నాడు పరామర్శించారు. ప్రేమోన్మాది దాడిలో తల్లిదండ్రులు ఇద్దరూ చనిపోవడంతో ఆ కుటుంబంలోని ఇద్దరు పిల్లలు అనాథలుగా మారారు. ఈ దాడిలో ఇద్దరు పిల్లలు కూడా తీవ్రంగా గాయపడి చికిత్స అనంతరం కోలుకున్నారు. దీంతో బీఆర్ఎస్ పార్టీ తరఫున రూ.5 లక్షలతో పాటు పిల్లలిద్దరి చదువు బాధ్యత తనదేనంటూ ప్రకటించారు. పిల్లలిద్దరూ చాలా కాలం పాటు చికిత్స తీసుకోవాల్సిన అవసరం ఉన్నందున బాధిత కుటుంబానికి భరోసా ఇచ్చేలా ప్రభుత్వం రూ.50 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు.
వాళ్ల చదువు బాధ్యత నాదే..
చింతలతండాకు చెందిన దీపిక, గుండెంగ గ్రామానికి చెందిన నాగరాజు అలియాస్ బన్నీ గతేడాది నవంబర్‌లో ప్రేమ పెళ్లి చేసుకున్నారు. జనవరిలో దీపిక తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. దీంతో ఇరువర్గాలకు కౌన్సిలింగ్ ఇచ్చిన పోలీసులు ఆమెను తన తల్లిదండ్రులతో పంపించారు. అప్పటి నుంచి దీపిక ఇంటి వద్దే ఉంటూ హన్మకొండలో డిగ్రీ చదువుకుంటుంది. తల్లిదండ్రులు ఆమెకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారన్న సమాచారం తెలుసుకున్న బన్నీ ఉన్మాదిగా మారిపోయారు. కక్షతో ఈ నెల 11న ఇంటి ముందు నిద్రిస్తున్న యువతి తల్లిదండ్రులపై దాడి చేశాడు. బన్నీ చేసిన దాడిలో తల్లితండ్రులిద్దరూ శ్రీనివాస్, సుగుణ చనిపోయారు. దీంతో ఇద్దరు పిల్లలు దీపిక, మదన్ లు అనాథలయ్యారు. దాడి ఘటనలో ఇద్దరు పిల్లలు కూడా తీవ్రంగా గాయపడి చికిత్స అనంతరం కోలుకున్నారు.
చనిపోయిన దంపతుల పిల్లలను మాజీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి సుదర్శన్ రెడ్డి నేడు కేటీఆర్ వద్దకు తీసుకొచ్చారు. పిల్లలద్దరినీ చూసిన కేటీఆర్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. వారి ఆరోగ్యం గురించి వాకబు చేశారు. ఏం పర్వాలేదు నేను మీకు అండగా ఉంటాను.. ధైర్యంగా ఉండాలని సూచించారు. ఈ సందర్భంగా దీపికా, మదన్ ల చదువు బాధ్యత తానే స్వయంగా తీసుకుంటానని ఆయన హామీ ఇచ్చారు. హత్యకు గురైన పిల్లల తల్లి సుగుణ బీఆర్ఎస్ పార్టీకి క్రియాశీల కార్యకర్త. గ్రామ పంచాయతీ వార్డు మెంబర్ కూడా. పార్టీ తరఫున కుటుంబాన్ని ఆదుకునేందుకు రూ. 5 లక్షలు ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నట్లు కేటీఆర్ ప్రకటించారు.
❇️ వరంగల్ జిల్లాలోని 16 చింతల తాండ గ్రామంలో ప్రేమోన్మాది దాడిలో గాయపడిన గిరిజన కుటుంబానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS అండ
— BRS Party (@BRSparty) July 16, 2024
❇️ పార్టీ తరఫున రూ. 5 లక్షలతో పాటు పిల్లలిద్దరి చదువు బాధ్యత తనదేనని ప్రకటన
❇️ బాధిత కుటుంబానికి మానవతా దృక్పథంతో ప్రభుత్వం రూ. 50 లక్షలు… pic.twitter.com/FPg7Ib1kFf
రూ.50 లక్షలు ఇవ్వాలి
అత్యంత దారుణమైన ఈ సంఘటనలో తల్లిదండ్రులను కోల్పోవటమే కాకుండా.. దాడికి గురైన పిల్లలు చాలా కాలం పాటు చికిత్స తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ నేపథ్యంలో కుటుంబానికి భరోసా ఇచ్చేలా తెలంగాణ ప్రభుత్వం రూ.50 లక్షలు వారికి ఆర్థిక సాయంగా అందించాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనలో నిందితుడు నాగరాజు అలియాస్ బన్నీకి కఠిన శిక్ష పడేలా తగిన చర్యలు తీసుకునేలా డీజీపీకి ఆదేశాలు ఇవ్వాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కోరారు.