KTR Comments : ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తున్న టీఆర్ఎస్ కు యువతే అండగా ఉండాలి : కేటీఆర్
KTR Comments: ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తున్న టీఆర్ఎస్ సర్కారుకు యువత అండగా నిలబడాలని కేటీఆర్ కోరారు. మునుగోడు యువత కోసం ఆసియాలోనే అతిపెద్ద ఇండస్ట్రీయల్ పార్కు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
KTR Comments: ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెద్ద ఎత్తున కల్పిస్తున్నట్లు ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె. తారకరామ రావు పేర్కొన్నారు. అలాంటి టీఆర్ఎస్ ప్రభుత్వానికి యువతే అండగా నిలబడాలని కోరారు. ప్రభుత్వ రంగంలో శరవేగంగా ఉద్యోగాల భర్తీ జరుగుతున్నట్లు పేర్కొన్నారు. గ్రామీణ రంగంలో వ్యవసాయం, అనుబంధ రంగాల్లో ఉపాధి అవకాశాలు పెద్ద ఎత్తున కల్పిస్తున్నామని వివరించారు. అలాగే ప్రైవేటు రంగంలోనూ ఉద్యోగాల సృష్టి జోరుగా జరుగుతోందని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో వేలాది పరిశ్రమల స్థాపన ద్వారా స్థానిక యువతకు ఉద్యోగాలు వచ్చేలా టీఆర్ఎస్ ప్రభుత్వం కృషి చేస్తోందని వెల్లడించారు.
శరవేగంగా ఉద్యోగాలు భర్తీ
ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు, తెలంగాణ పారిశ్రామిక వేత్తల సమాఖ్య భాగస్వామ్యంతో ఆసియాలోనే అతి పెద్ద ఇండస్ట్రీయల్ పార్కును దండు మల్కాపూర్ లో 2019 వ సంవత్సరంలోనే టీఆర్ఎస్ సర్కారు నెలకొల్పిందని అన్నారు. దీని వల్ల మునుగోడు నియోజకవర్గంలో యువతకు ఎక్కువగా ఉపాధి దొరుకుతోందని చెప్పారు. సుమారు 35 వేల మంది స్థానిక యువతకు ఉపాధి అందించే గ్రీన్ పారిశ్రామిక వాడంలో ఫుడ్ ప్రాసెసింగ్, టాయ్ పార్కు కూడా రాబోతున్నట్లు మంత్రి కేటీఆర్ వెల్లడించారు. ఈ ఇండస్ట్రీయల్ పార్కు పూర్తిగా పర్యావరణ అనుకూలంగా ఉంటుంది. హరిత హారం స్ఫూర్తితో దీనిని గ్రీన్ ఇండస్ట్రీయల్ పార్కుగా తీర్చిదిద్దుతున్నట్లు పేర్కొన్నారు. అలాగే స్థానిక యువతలో స్కిల్స్ కల్పించేందుకు స్కిల్ డెవలప్మెంట్ కేంద్రం వేగంగా రూపుదిద్దుకుంటోందని పరిశ్రమల శాఖ మంత్రి కె. తారకరామా రావు తెలిపారు. ప్రభుత్వ రంగంలో శరవేగంగా ఉద్యోగాల భర్తీ, గ్రామీణ రంగంలో వ్యవసాయం, అనుబంధ రంగాల్లో ఉపాధి కల్పన చేస్తూ, మరో వైపు ప్రైవేటు రంగంలోనూ వేలాది పరిశ్రమల స్థాపన ద్వారా లక్షలాది మంది యువతకు ఉద్యోగాలు వచ్చేలా కృషి చేస్తున్న టీఆర్ఎస్ సర్కారుకు యువతే అండగా నిలవాలని కేటీఆర్ పిలుపునిచ్చారు.
వాడివేడిగా సాగుతున్న మునుగోడు రాజకీయం
ప్రస్తుతం మునుగోడ ఉపఎన్నిక రాష్ట్రంలోనే కాకుండా దేశవ్యాప్తంగా రాజకీయ పార్టీల దృష్టిని ఆకర్షిస్తోంది. అటు టీఆర్ఎస్, ఇటు బీజేపీ పార్టీలకు ప్రతిష్టాత్మకమైన ఎన్నిక కావడంతో.. అందరి దృష్టి మునుగోడు పైనే ఉంది. బీజేపీ తమ పార్టీ చెందిన ముఖ్యమంత్రులను, కేంద్ర మంత్రులను మునుగోడుకు తీసుకువస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహించడం ఎలక్షన్ అధికారులకు, పోలీసులకు కత్తిమీద సాముగా తయారు అయింది. మునుగోడు ఉప ఎన్నికను ప్రశాంతంగా నిర్వహించేందుకు యాదాద్రి భువనగిరి జిల్లా, నల్గొండ జిల్లా పోలీసులు పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. ఊరికి ఒక ఎస్సై, మండలానికి ఒక డీసీపీ మునుగోడు నియోజకవర్గంలో పరిస్థితులను పర్యవేక్షిస్తున్నారు. ఒక్క చౌటుప్పల్ మండలానికి ఒక డీసీపీ, ఇద్దరు ఏసీపీలు, 12 మంది సీఐలు, ఎస్సైలు, ఏఎస్సైలు, కేంద్ర బలగాలు, రాష్ట్ర పోలీసులు కలిపి 400 మంది విధులు నిర్వర్తిస్తున్నారు. మునుగోడు ఉప ఎన్నికల ఎలాంటి ఘర్షణలు, దాడులు లేకుండా ప్రశాంతంగా సాగేందుకు అధికారులు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నారు.