Komatireddy Rajagopal Reddy: తండ్రికి విలువ ఇవ్వని కవిత ప్రజలకేం మేలు చేస్తారు - కొత్తపార్టీపై రాజగోపాల్ రెడ్డి విమర్శలు
Kavitha Party: మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కవిత కొత్త పార్టీపై విమర్శలు గుప్పించారు. ఆమె తండ్రిని గౌరవించడం లేదని..ప్రజలకేం సేవ చేస్తారని ప్రశ్నించారు.

rajagopal Reddy criticized Kavitha Party: మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బుధవారం మీడియా సమావేశంలో మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై తీవ్ర విమర్శలు చేశారు. డబ్బులు ఉన్నాయని పార్టీ పెట్టడం అంటే పాన్ షాప్ పెట్టినంత సులువు అయిపోయింది అంటూ ఆయన ఎద్దేవా చేశారు. కవిత నూతనంగా ప్రారంభించిన పార్టీ వల్ల ఎటువంటి ఉపయోగం ఉండదని, ఆమెతో ఊదు కాలదు.. పీరు లేవదు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాజకీయాల్లో రాణించాలంటే ప్రజాబలం ఉండాలి కానీ, కేవలం ఆర్థిక బలం సరిపోదని ఆయన హితవు పలికారు.
కేసీఆర్ ను విమర్శించడాన్ని తప్పు పట్టిన కోమటిరెడ్డి
కవిత తన మొదటి సమావేశంలోనే సొంత తండ్రి, మాజీ సీఎం కేసీఆర్‌ను విమర్శించడాన్ని రాజగోపాల్ రెడ్డి తీవ్రంగా తప్పుపట్టారు. ఉద్యమకారుడిగా పేరున్న కేసీఆర్‌ను ఆయన బిడ్డ విమర్శించడం తనను బాధించిందని, తండ్రికి విలువ ఇవ్వని వ్యక్తి ప్రజలకు ఏ విధంగా సేవ చేస్తుందని ఆయన ప్రశ్నించారు. తన అన్న కేటీఆర్ మీద ఉన్న వ్యక్తిగత కోపాన్ని తండ్రి మీద చూపించడం సరైన పద్ధతి కాదని, టీఆర్ఎస్ పేరుతో పార్టీ పెట్టి కేసీఆర్‌ను విమర్శించడం హాస్యాస్పదమని పేర్కొన్నారు.
ఉద్యమకారుడి బిడ్డగానే కవితకు గుర్తింపు
కవితకు కేవలం ఉద్యమకారుడి బిడ్డగానే గుర్తింపు ఉందని, అంతకు మించి ఆమెకు వ్యక్తిగత ఛరిష్మా లేదని రాజగోపాల్ రెడ్డి విమర్శించారు. ఆమె పార్టీ పెట్టడం పక్కన పెడితే, రాబోయే ఎన్నికల్లో పోటీ చేస్తే కనీసం డిపాజిట్ కూడా రాదని జోస్యం చెప్పారు. అలాగే ఢిల్లీ మద్యం కుంభకోణం కేసును ప్రస్తావిస్తూ.. ఆ కేసులో ఆమెకు ఇంకా క్లీన్ చిట్ రాలేదని, చట్టం తన పని తాను చేసుకుపోతుందని ఆయన గుర్తు చేశారు.
ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, కవిత పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పార్టీ స్థాపనను ఎగతాళి చేస్తూ,కేసీఆర్ లేకపోతే కవిత ఎక్కడ ఉంటుందని ప్రశ్నించారు. తండ్రిని గౌరవించలేనివారు ప్రజలను ఎలా నడిపిస్తారని విమర్శించారు.#Kavitha #KCR #KomatireddyRajGopalReddy #TelanganaPolitics pic.twitter.com/h3Kok1JeLq
— Telangana Nestham (@TNestham) April 29, 2026
మంత్రి పదవి ఇస్తే న్యాయం చేస్తా !
మంత్రి పదవి పై పార్టీ అధిష్టానం తనకు ముందే హామీ ఇచ్చిందని వెల్లడించారు. ఒకవేళ తనకు మంత్రి పదవి దక్కితే, ఆ బాధ్యతకు పూర్తి స్థాయిలో న్యాయం చేస్తానని ఆశాభావం వ్యక్తం చేశారు. నియోజకవర్గ అభివృద్ధికి, పార్టీ బలోపేతానికి నిరంతరం శ్రమిస్తానని, పదవులు ఉన్నా లేకున్నా తాను ప్రజల మనిషినేనని రాజగోపాల్ రెడ్డి ఈ సందర్భంగా స్పష్టం చేశారు.
ట్రెండింగ్ వార్తలు





















