Rajagopal Reddy Congress: నేాపాల్ తరహాలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని యువత కూల్చేస్తారు - ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి తిరుగుబాటు
Komatireddy Rajagopal Reddy: తెలంగాణలోని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, సొంత పార్టీ అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. యువతను ఉద్యోగాల పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందన్నారు

Komatireddy Rajagopal Reddy criticized Congress government: కాంగ్రెస్ ను మరోసారి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి టార్గెట్ చేశారు. యువతను ఉద్యోగాల పేరుతో మోసం చేసిందన్నారన్నారు. తెలంగాణ లిబరేషన్ డే సందర్భంగా హైదరాబాద్‌లోని గన్ పార్క్ అమరవీరుల స్థూపానికి నిరుద్యోగ యువతతో కలిసి నివాళులు అర్పించిన తర్వాత మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన 2 లక్షల ఉద్యోగాల హామీని నిలబెట్టుకోలేదని, యువతను మోసం చేసిందని ఆరోపించారు. ఈ వ్యాఖ్యలు సంచలనాత్మకంగా మారాయి.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని, గ్రూప్-1, గ్రూప్-2 తదితర పోటీ పరీక్షల ద్వారా యువతకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చిందని తెలిపారు. కానీ, మొదటి సంవత్సరంలోనే రెండు లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని చెప్పి, కేవలం 50 వేల నియామకాలు మాత్రమే చేపట్టారని అన్నారు. "కాంగ్రెస్ ప్రభుత్వం 2 లక్షల ఉద్యోగాలు ఇస్తానని మోసం చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2 లక్షల ఉద్యోగాలు వచ్చి మాకు న్యాయం జరుగుతుందని నిరుద్యోగులు భావించారు.. కానీ అనుకున్న స్థాయిలో 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వలేదు" అని ఆయన స్పష్టం చేశారు.
ఇప్పుడు తెలంగాణలో 30 లక్షల మంది ఉద్యోగాల కోసం కోరుకుంటున్నారని రాజగోపాల్ రెడ్డి తెలిపారు. నిరుద్యోగ యువతకు "నేను మీతో ఉంటాను, మీ కలలు, ఆశల కోసం మద్దతుగా నిలుస్తాను. మీరు నిరాశ పడకండి" అని హామీ ఇచ్చారు. "నిరుద్యోగులకు ఓ అన్నలాగా అండగా ఉంటాను" అని భరోసా ఇచ్చారు. టీజీపీఎస్సీ గ్రూప్-1 పరీక్షల్లో అవకతవకలు జరిగాయని.. చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ అవకతవకలు సరి చేయకపోతే యువత తిరుగుబాటు చేస్తారని హెచ్చరించారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి హెచ్చరిక జారీ చేశారు. "యువత తలుచుకుంటే సాధ్యం కానిది ఏదీ లేదు. నేపాల్‌లో యువత తిరుగుబాటు చేసి ప్రభుత్వాన్ని కూల్చేసిన విషయాన్ని గుర్తు చేస్తున్నాను. యువతతో పెట్టుకున్న ప్రభుత్వాలేవీ మనుగడ సాధించలేదు. నేపాల్ తరహాలో యువత తిరగబడి మన ప్రభుత్వాన్ని కూల్చేయడం ఖాయం" అని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వం జాగ్రత్తగా ఉండాలని, ఉద్యోగాల భర్తీలో హామీలు నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు.
🤣🤣🤣 సారి నవ్వు ఆగట్లేదు.. 🤭🤭🤭
— Radha Parvathareddy (@radhachinnulu) September 17, 2025
నేపాల్ తరహాలో యువత తిరగబడి మన ప్రభుత్వాన్ని కూల్చేయడం ఖాయం
మరోసారి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరించిన సొంత పార్టీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
నిరుద్యోగులతో పెట్టుకున్న ప్రభుత్వం మనుగడ సాధించలేదు
నిరుద్యోగులను గాలికి… pic.twitter.com/4EQvBjjhcB
మంత్రి పదవి ఇవ్వలేదని రాజగోపాల్ రెడ్డి తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. ప్రభుత్వానికి, రేవంత్ కు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. ఇప్పుడు నేరుగా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం వివాదాస్పదమయింది. కాంగ్రెస్ ప్రభుత్వం నుండి ఈ ఆరోపణలపై ఇప్పటివరకు అధికారిక స్పందన రాలేదు. రాజగోపాల్ రెడ్డిపై తనకు ఎలాంటి ఫిర్యాదు రాలేదని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. క్రమశిక్షణా కమిటీ సుమోటోగా తీసుకుంటుందేమోననన్నారు.





















