Quantum valley Designs: కొత్త సంవత్సరానికి క్వాంటమ్ వ్యాలీ సిద్ధం.. నాలుగునెలల్లో 3D ప్రింటింగ్‌తో నిర్మించనున్న భవనాలు... డిజైన్లు విడుదల
Amaravati Quantum Capital: అమరావతి నగరం, 2035 నాటికి ఇండియా క్వాంటమ్ కాపిటల్‌గా మారాలనే లక్ష్యంతో ముందుకు వెళుతోంది. మరో నాలుగు నెలల్లోనే అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ కార్యకలాపాలు ప్రారంభం కాబోతున్నాయి.

Amaravati Quantum Valley: ఆంధ్ర రాజధాని అమరావతి మరో ముఖ్యమైన మైలురాయిని చేరుకోబోతోంది. అమరావతిలో క్వాంటమ్ వ్యాలీకి ఇంతకు ముందే పచ్చజెండా ఊపేసిన ప్రభుత్వం... 2026 జనవరి నాటికే.. కార్యకాలాపాలు ప్రారంభించాలన్న లక్ష్యంతో ముందుకు వెళుతోంది. ఇంకా కేవలం కొన్ని నెలలు మాత్రమే ఉన్న సమయంలో... కొత్త భవనాలు ఎలా సమకూరుస్తారు అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నా... నాలుగు నెలల్లోనే పనులు పూర్తి చేస్తామని ప్రభుత్వం చెబుతోంది. అంత తక్కువ టైమ్ లో బిల్డింగ్లు ఎలా పూర్తి చేస్తారన్నదానికి సమాధానం..3D ప్రింటింగ్. అవును క్వాంటమ్ వ్యాలీ భవనాన్ని 3D ప్రింటింగ్ టెక్నాలజీతో నిర్మించబోతున్నట్లు ప్రభుత్వ వర్గాల సమాచారం.
టెక్నాలజీ విషయంలో ఎప్పుడూ ఒకడుగు ముందే ఉండే చంద్రబాబు దేశంలోనే తొలి క్వాంటమ్ వ్యాలీని ఆవిష్కరించనున్నారు. నేషనల్ క్వాంటమ్ మిషన్కు అనుసంధానంగా ఇండియాలోని మొదటి క్వాంటమ్ కంప్యూటర్ అమరావతిలో రాబోతోంది. దీనికోసం ఇప్పటికే అమరావతిలో ఇప్పటికే 50 ఎకరాల స్థలాన్ని కూడా కేటాయించారు.సిలికాన్ వ్యాలీ తరహాలో ఈ క్వాంటమ్ వ్యాలీని అభివృద్ధి చేస్తారు.IBM, TCS, IIT Madras, L&T వంటి సంస్థలు ఈ ప్రాజెక్టులో భాగం కాబోతున్నాయి. అమరావతిలో జరుగుతున్న కలెక్టర్ల సదస్సులో క్వాంటమ్ వ్యాలీ డిజైన్లను విడుదల చేశారు చంద్రబాబు. IIT మద్రాస్ రూపొందించిన ఈ డిజైన్లకు ఆమోదం తెలిపారు. అయితే ప్రాథమికంగా కార్యకలాపాలు ప్రారంభించడానికి ఓ భవనాన్ని కేవలం 120 రోజుల్లో సిద్ధం చేయించనున్నట్లు సమాచారం.

క్వాంటమ్ వ్యాలీ రోడ్‌మ్యాప్.. (2025-230)
- మొదటి దశ (2025-27): ఈ కాలంలో మౌలిక సదుపాయాల కల్పనపై ప్రధానంగా దృష్టి పెడతారు. అమరావతిని క్వాంటమ్ టెక్నాలజీకి అనువైన కేంద్రంగా తీర్చిదిద్దడానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తారు.
- రెండవ దశ (2027–30):ఈ దశలో, అమరావతిని క్వాంటమ్ రంగంలో ప్రపంచ అగ్రగామిగా, ఎగుమతుల కేంద్రంగా తీర్చిదిద్దడం లక్ష్యం.
- అమరావతి క్వాంటమ్ క్యాపిటల్ కౌన్సిల్ (AQCC) ఏర్పాటు చేశారు.
- క్వాంటమ్ ప్రాజెక్టుల కోసం 50 ఎకరాల భూమి కేటాయించారు.
- IBM, TCS, L&T వంటి అంతర్జాతీయ సంస్థలతో అవగాహన ఒప్పందాలు (MoUs) కుదుర్చుకున్నారు.
అమరావతి క్వాంటమ్ డిక్లరేషన్
అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ ప్రారంభించాలని నిర్ణయించిన తర్వాత..IBM, TCSవంటి భాగస్వామ్య సంస్థలతో కలిపి విజయవాడలో జాతీయ సదస్సు నిర్వహించారు. అందులో కొన్ని తీర్మానాలు చేశారు.
- 12 నెలల్లో భారతదేశంలోనే అతిపెద్ద క్వాంటమ్ టెస్ట్‌బెడ్‌ను ఏర్పాటు చేయడం.
- జనవరి 2026 నాటికి IBM క్వాంటమ్ సిస్టమ్ 2ను, *జనవరి 2027 నాటికి క్వాంటమ్ సిస్టమ్ ౩+ ను అందుబాటులోకి తీసుకురావడం
- ₹1000 కోట్ల స్టార్టప్ నిధిని ఏర్పాటు చేసి, 2030 నాటికి 100 స్టార్టప్‌లను ప్రోత్సహించడం.
- అమరావతి క్వాంటమ్ అకాడమీ ద్వారా ప్రతి సంవత్సరం 5,000 మంది యువతకు శిక్షణ ఇవ్వడం
క్వాంటమ్ లిటరసీ పెంపుపై దృష్టి
ఐటీ గురించి అందరికీ ఐడియా ఉంది కానీ.. క్వాంటమ్ టెక్నాలజీపై చాలా మంది టెక్ విద్యార్థులకు కూడా అవగాహన లేదు.క్వాంటమ్ కంప్యూటింగ్ వ్యాలీ అనేది క్వాంటమ్ టెక్నాలజీ పరిశోధన- అభివృద్ధికి కేంద్రంగా ఏర్పడే హబ్. క్వాంటమ్ కంప్యూటర్లు క్విబిట్స్ (qubits) అనే ప్రత్యేకమైన డేటా యూనిట్లను ఉపయోగించి సాధారణ కంప్యూటర్ల కంటే వేగంగా సంక్లిష్టమైన సమస్యలను పరిష్కరించగలుగుతాయి.. ఇది డ్రగ్ డిస్కవరీ, క్లైమేట్ మోడలింగ్, సైబర్ సెక్యూరిటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి అనేక రంగాల్లో విప్లవాత్మక మార్పులను తీసుకురావచ్చు.
కాబట్టి ముందుగా క్వాంటమ్ లిటరసీపై దృష్టి పెట్టాలనుకుంటున్నారు. విద్యారంగంలో క్వాంటమ్ టెక్నాలజీపై అవగాహన పెంచడం ఈ ప్రాజెక్టులో అత్యంత కీలకం. పాఠశాలలు, కళాశాలల్లో క్వాంటమ్ గురించి అవగాహన కల్పించాలి. విశ్వవిద్యాలయాలు క్వాంటమ్ టెక్నాలజీపై ప్రత్యేక కోర్సులను ప్రారంభించాలని నిర్ణయించారు.





















