Rajagopal Reddy Comments: టీఆర్ఎస్ ప్రభుత్వంపై యుద్ధం మొదలైంది, ఆ మంత్రులు ఉద్యమంలో పాల్గొన్నారా ?: రాజగోపాల్ రెడ్డి
Komatireddy Rajagopal Reddy: తెలంగాణలో సీఎం కేసీఆర్ కుటుంబం అరాచక పాలన కొనసాగిస్తోందని కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆరోపించారు. టీఆర్ఎస్ తెలంగాణ ద్రోహుల పార్టీ అయిందని విమర్శించారు.
![Rajagopal Reddy Comments: టీఆర్ఎస్ ప్రభుత్వంపై యుద్ధం మొదలైంది, ఆ మంత్రులు ఉద్యమంలో పాల్గొన్నారా ?: రాజగోపాల్ రెడ్డి Komati Reddy Rajagopal Reddy Shocking Comments on CM KCR Rajagopal Reddy Comments: టీఆర్ఎస్ ప్రభుత్వంపై యుద్ధం మొదలైంది, ఆ మంత్రులు ఉద్యమంలో పాల్గొన్నారా ?: రాజగోపాల్ రెడ్డి](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/08/08/06453633c029de6b72dce84a65485d3d1659951016_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Komatireddy Rajagopal Reddy: సీఎం కేసీఆర్ తెలంగాణలో అరాచక పాలను కొనసాగిస్తున్నారని మునుగోడు కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆరోపించారు. చాలా మంది ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ పార్టీని వీడాలనుకుంటున్నట్లు వెల్లడించారు. అలాగే టీఆర్ఎస్ లోని చాలా మందితో తాను మాట్లాడుతున్నట్లు వివరించారు. అయితే ఇటీవలే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పదవికి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేశారు. నేటి ఉదయం కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తన రాజీనామా లేఖను స్పీకర్ పోచారం శ్రీనివాస రెడ్డికి అందజేశారు. ఆయన తన రాజీనామాను సభాపతి ఆమోదించినట్లు రాజగోపాల్ రెడ్డి తెలిపారు. అంతకు ముందు ఆయన గన్ పార్కులో అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పించి మీడియాతో మాట్లాడారు.
అరాచక పాలనకు వ్యతిరేకంగానే రాజీనామా..!
టీఆర్ఎస్ ప్రభుత్వంపై ధర్మయుద్ధం ప్రకటించానని కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. ఈ ధర్మ యుద్ధంలో తెలంగాణ, మునుగోడు ప్రజలు గెలుస్తారని అన్నారు. టీఆర్ఎస్ అరాచక పాలనకు వ్యతిరేకంగా రాజీనామా చేస్తున్నట్లు వివరించారు. సబ్బండ వర్గాలు పోరాటం చేస్తేనే తెలంగాణ వచ్చిందన్నారు. ప్రజలు ఆత్మగౌరవం కోరుకున్నారని.. కానీ సీఎం కేసీఆర్ అరాచక పాలన కొనసాగిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తాను రాజీనామా అంటే కేసీఆర్ దిగొస్తున్నారని వివరించారు. తన రాజీనామాతో జరిగే ఉప ఎన్నికల్లో మునుగోడు ప్రజలు చరిత్రాత్మక తీర్పు ఇస్తారన్నారు. తెలంగాణకు కేసీఆర్ నుంచి విముక్తి కల్పిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.
కావాలనే సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం..
నియోజకవర్గ ప్రజలకు తన మీద ప్రేమ, అభిమానం ఉన్నాయని.. తనకు ఆ నమ్మకం ఉండటం వల్లే రాజీనామా చేసినట్లు వివరించారు. మీరే తీర్పు చెప్పాలని నియోజకవర్గ ప్రజలను కోరారు. కావాలనే కొంతమంది తనపై సోషల్ మీడియా వేదికగా తప్పుడు ప్రచారం చేస్తున్నారని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిన బాధ్యత ప్రజలపైనే ఉందన్నారు. నిరుద్యోగులు, ప్రజలకు వైద్యం, పేదలకు ఇళ్లు, పింఛన్ల కోసమే తాను రాజీనామా చేసినట్లు వెల్లడించారు. తాను రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించగానే గట్టుప్పల్ మండలం ఏర్పాటు చేస్తున్నారని వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రికి సిరిసిల్ల, సిద్దిపేట, గజ్వేల్ తప్ప ఇతర నేతల నియోజకవర్గాలు కనిపించడం లేదని అన్నారు.
ప్రజలు ఇవన్నీ గ్రహించాలి..
ప్రాజెక్టులు కట్టొద్దని మేం చెప్పలేదని ఆయన వివరించారు. రైతులకు లక్ష రూపాయల రుణమాఫీ ఏమైందని ప్రశ్నించారు. మిషన్ భగీరథలో 20 వేల కోట్లు దోచుకున్నది నిజం కాదా అని అన్నారు. జీతాలు ఇవ్వాలంటే అప్పుల చేయాల్సిన పరిస్థితి వచ్చిందని విమర్శించారు. టీఆర్ఎస్ తెలంగాణ ద్రోహుల పార్టీగా మారిందన్నారు. మంత్రులు గంగుల కమలాకర్, ఎర్రబెల్లి దయాకర్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, పువ్వాడ అజయ్ ఉద్యమ కారులా అని ప్రశ్నించారు. తెలంగాణలో ప్రజాస్వామ్యం లేదన్నారు. చండూరులో రేవంత్ రెడ్డి మాట్లాడిన భాష చాలా దారుణంగా ఉందని.. డబ్బులిచ్చి పదవులు తెచ్చుకున్న వాళ్లు, జైలుకెళ్లిన వాళ్లు ఇలాగే మాట్లాడతారంటూ మండిపడ్డారు. ప్రజలు ఇవన్నీ గమనించాలని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కోరారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)