Telangana BJP Chief: బండిని జరిపింది ఎవరు! ఈటల, రఘునందన్ లు హ్యాపీయేనా!
Telangana BJP Chief Kishan Reddy: బీఆర్ఎస్ పార్టీని దీటుగా ఎదుర్కోనే ఎంపీ బండి సంజయ్ పదవి నుంచి దిగిపోయారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా పార్టీ హైకమాండ్ నియమించింది.
Telangana BJP Chief Kishan Reddy: తెలంగాణలో మరో నాలుగు నెలల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ సమయంలో బీజేపీ అధిష్టానం కీలక నిర్ణయం తీసుకుంది. అధికార బీఆర్ఎస్ పార్టీని దీటుగా ఎదుర్కోనే కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ పదవి నుంచి దిగిపోయారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా పార్టీ హైకమాండ్ నియమించింది. అయితే, అంతా సరిగ్గా ఉన్న టైంలో అసలేందుకు ఈ మార్పు..? దీనివల్ల తెలంగాణ బీజేపీకి నష్టమా..?లాభమా..? ఆ వివరాలపై ఓ లుక్కేయండి.
బండి సంజయ్ విషయానికొస్తే..
2019 లోక్ సభ ఎన్నికలు అయ్యాక బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బండి సంజయ్ నియమితులయ్యారు. కరీంనగర్ ఎంపీగా విజయం సాధించిన అప్పటి నుంచి ఆయనది ఒకటే మంత్రం. సీఎం కేసీఆర్ పై దూకుడు. కేసీఆర్ మాటలకు.. మాటలతోనే తిప్పికొట్టాలనే ఫార్ములానా బాగా ఒంట పట్టించుకున్నారు. ఈయన హయాంలోనే దుబ్బాక, హుజురాబాద్, మునుగోడు వంటి ఎన్నికల్లో బీజేపీ సత్తా చాటింది. మునుగోడులో ఓడిపోయినప్పటికీ బీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం బీజేపీ అన్న ఫీలింగ్ తెప్పించింది.
ఇక హైదరాబాద్ GHMC ఎన్నికల్లోనూ బీజేపీ సత్తా చాటింది. పాదయాత్రతో బండి సంజయ్ బీజేపీని గ్రామాల్లోకి తీసుకెళ్లారు. అయితే మెుత్తం ఫేమ్ ఆయనకే వస్తుంది. పార్టీలో చేరిన తమకు ప్రాధాన్యత దక్కట్లేదు అన్నది మిగతా లీడర్ల ఆరోపణలు. అందుకే.. పార్టీ ప్రెసిడెంట్ గా కొత్త వాళ్లను పెట్టాలని కొందరు నేతలు డిమాండ్ చేశారని తెలుస్తోంది. బండి సంజయ్ సారథ్యంలో బీజేపీ మంచి ఫలితాలు సాధించింది. ఆయనను మార్చడం ఎందుకున్నది ఢిల్లీ పెద్దల ఆలోచన. కానీ, బీజేపీలోకి వలస వచ్చిన నేతలు మాత్రం తమకు ప్రాధాన్యత కోసం బండి సంజయ్ ను దింపాల్సిందేనని పట్టుపట్టారు. దీంతో ఏం చేయాలో తోచక బీజేపీ అగ్రనాయకత్వం పార్టీ అధ్యక్షుడు మార్పునకు ఒకే చెప్పింది
కానీ ఇక్కడే అసలు సమస్య వచ్చి పడింది. బండి సంజయ్ ప్లేస్ లో ఎవరిని ఎంపిక చేయాలి..? ఎందుకంటే ఆ పదవి కోసం చాలా మంది పోటీపడుతున్నారు. ప్రధానంగా టీఆర్ఎస్ నుంచి వచ్చిన నేత, మాజీ మంత్రి ఈటల రాజేందర్, దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావుల మధ్య పోటీ ఉంది. ఈ సమయంలో ఒకరికి పదవి ఇస్తే.. ఇంకోకరి హర్ట్ అవుతారని భావించిన దిల్లీ పెద్దలు అడక్కపోయినప్పటికీ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి రాష్ట్ర అధ్యక్ష పదవికి కట్టబెట్టారు. ఎందుకంటే ఆయన పార్టీలో సీనియర్, అందరితో సన్నిహత సంబంధాలు ఉన్నాయి. ఎన్నికల సమయంలో లీడర్లను సమన్వయ పరచుకోవడంలో ఆయన దిట్ట. అందుకే పదవి కోసం పోటీ పడిన వాళ్లను పక్కన పెట్టి.. పార్టీలో అందరివాడుగా కలుపుగోలుగా ఉండే కిషన్ రెడ్డికి అవకాశం ఇచ్చారు.
అదే సమయంలో ఈటల రాజేందర్ అసంతృప్తిని చల్లార్చేందుకు.. ఎన్నికల నిర్వహణ కమిటీ ఛైర్మన్ ఇచ్చారు. ఇక ఎన్నికల బాధ్యత ఈటల రాజేందర్ ని అన్న కోణంలో ఆయనకు ఈ పదవి ఇచ్చారు. దీంతో ఆయనతో పాటు ఆయన అనుచరులు కూల్ అవుతారని బీజేపీ పెద్దలు భావిస్తున్నారు. కానీ, రాష్ట్ర అధ్యక్ష పదవిపై ఆశలు పెట్టుకున్న రఘునందన్ రావుకు ఎలాంటి పదవి ఇవ్వలేదు. సో.. ఇప్పుడు రఘునందన్ రావు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది.
ఓ వైపు కాంగ్రెస్ జోరు పెరుగుతున్న సమయంలో బీజేపీలో అంతర్గత కుమ్ములాటలకు చెక్ పెట్టేందుకు ఢిల్లీ పెద్దలు ఈ ప్రయత్నం చేశారు. మరి రాష్ట్ర అధ్యక్షుడి మార్పుతోనైనా బీజేపీలో ముసలం చల్లబడుతుందా..? లేదా సరికొత్త చిక్కులు వస్తాయా..? అన్నది రాజకీయ వర్గాల్లో ఉత్కంఠగా మారింది.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial