Kottagudem: దంపతుల సజీవదహనంతో సంబంధం లేదు... వీడియో విడుదల చేసిన ఎమ్మెల్యే కుమారుడు
దంపతుల సజీవదహనం ఘటనతో తనకు సంబంధంలేదని కొత్తగూడెం ఎమ్మెల్యే కుమారుడు రాఘవేందర్ తాజాగా ఓ వీడియో విడుదల చేశారు. తన పేరు ఎందుకు రాశారో అర్థం కావడంలేదన్నారు.
తెలంగాణ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో దంపతుల సజీవదహనం సంచలనంగా మారింది. ఈ ఘటనను ముందు ప్రమాదంగా భావించినా తర్వాత సూసైడ్ లేఖ దొరకడంతో ఆత్మహత్యగా పోలీసులు గుర్తించారు. పాత పాల్వంచ తూర్పు బజారులో కుమార్తె సహా దంపతుల సజీవదహనం అయ్యారు. ఈ ఘటనకు సంబంధించి కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు కుమారుడు రాఘవేందర్‌పై పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. ఈ ఘటన జరిగినప్పటి నుంచి రాఘవేందర్ పరారీలో ఉన్నాడు. తాజాగా కుటుంబం సూసైడ్ పై వనమా రాఘవేందర్ ఓ వీడియో విడుదల చేశారు. రామకృష్ణ కుటుంబం ఆత్మహత్యతో తనకు ఎలాంటి సంబంధం లేదని ఈ వీడియో రాఘవేందర్ వెల్లడించారు. ఈ ఘటనలో సంబంధం లేకున్నా తన పేరు ఎందుకు రాశారో అర్థం కావడం లేదన్నారు.
అసలేం జరిగిందంటే...
ఉమ్మడి ఖమ్మం జిల్లా పాల్వంచలో గ్యాస్ లీక్ చేసుకుని ఆత్మహత్య చేసుకున్న కుటుంబం విషాదం వెనుక ఓ ప్రజాప్రతినిధి కుమారుడి పేరు బయటపడింది. పాత పాల్వంచ తూర్పు బజారులో నివాసం ఉండే రామకృష్ణ, ఆయన భార్య శ్రీలక్ష్మి దంపతులతో పాటు కవలలు సాహిత్య, సాహితిలు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఈ ఘటనలో రామకృష్ణ , శ్రీలక్ష్మి, సాహిత్య మరణించారు. సాహితి చావు బతుకుల్లో కొట్టుమిట్టాడుతోంది. ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్య చేసుకున్నారని అందరూ అనుకున్నారు. అది నిజమే కానీ ఆ ఇబ్బందులన్నీ కొత్త గూడెం ఎమ్మెల్యే కొడుకు వనమా రాఘవేందర్ వల్లే వచ్చాయని సూసైడ్‌నోట్‌తో బయట పడింది.
సూసైడ్ నోట్ లభ్యం
రామకృష్ణ దంపతులు రాసిన సూసైడ్ నోట్ పోలీసులకు లభించింది. అందులో వివరాల ఆధారంగా రామకృష్ణ తల్లి, సోదరితో పాటు ఎమ్మెల్యే కుమారుడు వనమా రాఘవేందర్ పై కేసు నమోదు చేశారు. ఎమ్మెల్యే తనయుడు రాఘవేందర్ వేధింపుల కారణంగానే చనిపోతున్నట్టుగా రామకృష్ణ ఆ లేఖలో పేర్కొనడంతో అతన్ని అరెస్ట్ చేసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఓ కేసులో ముందస్తు బెయిల్ తో రాఘవేందర్ బయటకు వచ్చాడు. ఇప్పుడు రాఘవేంద్ర పరారీలో ఉన్నట్లుగా భావిస్తున్నారు. పాల్వంచలో గతంలో రామకృష్ణ మీ సేవా కేంద్రం నిర్వహించేవారు. ఆర్థిక సమస్యలు ఎక్కువ కావడంతో మీ సేవా కేంద్రాన్ని రామకృష్ణ అమ్మేశాడు. ఆ తర్వాత ఆయన రాజమండ్రికి నివాసాన్ని మార్చాడు. అక్కడే కుటుంబంతో కలిసి ఉంటున్నాడు. అయితే అప్పులు తీర్చుకునేందుకు తనకు వారసత్వపు ఆస్తిగా వచ్చిన ఇంటిని అమ్ముకునేందుకు ప్రయత్నించారు. కానీ తల్లి, సోదరి అడ్డు చెప్పారు. పెద్ద మనుషుల పంచాయతీ పేరుతో వనమా కొడుకు దగ్గర పంచాయతీ పెట్టడంతో ఆయన తీవ్రంగా అవమానించినట్లుగా తెలుస్తోంది.
Also Read: పాల్వంచలో కుటుంబం ఆత్మహత్యకు కారణం ఆ ఎమ్మెల్యే కొడుకు ! వెదుకుతున్నపోలీసులు...