Ponguleti on BRS : అసెంబ్లీని సామ్రాజ్యంగా చేసుకుని దోపిడీ, సీఎం కేసీఆర్ పై పొంగులేటి హాట్ కామెంట్స్
Ponguleti on BRS : పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పేరు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. బీజేపీలోకి వెళ్తారనే ప్రచారం జోరుగా సాగుతుండగా ఏకంగా సీఎం కేసీఆర్ పైనే పొంగులేటి హాట్ కామెంట్లు చేశారు.
Ponguleti on BRS : ఖమ్మంలో రాజకీయాలు కాక పుట్టిస్తున్నాయి. మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గులాబీగూటిని వీడుతున్నారనే వార్తలు గుప్పుమంటుండగానే... ఆయన రోజుకో కామెంట్ చేస్తూ సెగలు రేపుతున్నారు. ఈసారి కాస్త డోస్ ఎక్కువే పెంచిన పొంగులేటి ఏకంగా గులాబీబాస్ పై గురిపెట్టారు. ఎవరైతే నాకేంటీ తగ్గేదేలే అంటున్నారు. ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బీజేపీ వెళ్లడం దాదాపు కన్ఫామ్ అయ్యింది. ఇప్పటికే ఆయన ఆత్మీయ సమావేశాల్లో పాల్గొంటున్నారు. బీఆర్ఎస్ ను ఎందుకు వీడాల్సి వస్తుుందో అనుచరులకు వివరించే ప్రయత్నం చేస్తున్నారు. పనిలోపనిగా తనకు జరిగిన అన్యాయంపై గళమెత్తుతున్నారు.
సీఎం కేసీఆర్ నే టార్గెట్ చేసిన పొంగులేటి
మంగళవారం ఖమ్మంలో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశంలో ఏర్పాటు చేసి ఫ్లెక్సీల్లో సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ఫొటోలు కనబడలేదు. ఇప్పటికే పార్టీ మారుతున్నానని ఇన్ డైరెక్టు సిగ్నల్స్ ఇచ్చినా ఆయన ఈసారి ఇంకాస్త డోస్ పెంచారు. ఏకంగా గులాబీ దళపతి కేసీఆర్ నే టార్గెట్ చేశారు పొంగులేటి. ఒకరోజు భయపడతాం..రెండ్రోజులు భయపడతాం. కానీ గౌరవం ఇచ్చిపుచ్చుకుంటేనే బంధం ఉంటుంది. ప్రేమ అనేది రెండువైపులా ఉండాలన్నారు. ఇన్నాళ్లు తండ్రీకొడుకుల బంధంగా నడిచా. నాకేం ప్రేమదక్కింది, నాకేం గౌరవం దక్కింది. గౌరవం అంటే ఇద్దరు గన్ మెన్లను ఇవ్వడం కాదన్నారాయన. గొంతెత్తకుండా ఉండలేనని నర్భగర్భంగా మాట్లాడారు.
నాకు ప్రజలే గాడ్ ఫాదర్
పినపాకలో నీకేం పని ఉందని కొందరు అడుగుతున్నారు. ప్రజల కష్టాలు తెలుసుకోవడానికే వచ్చా. కేసీఆర్ నాయకత్వంలో కేటీఆర్ మాట మీద నమ్మకంతో అప్పుడు టీఆర్ఎస్‌లో చేరాను. ఎన్ని అవమానాలు జరిగినా కేటీఆర్‌తో ఉన్న చనువుతో కంటిన్యూ అయ్యాను. నాలుగేళ్లుగా పదవి లేకపోవడానికి కారణం ఏంటో మీకు తెలుసు. నేను భూదందాలు చేయలేదు. ఇద్దరు గన్ మెన్లను తొలగించినా బాధపడలేదు. నాకు సెక్యూరిటీ అవసరం లేదు. నాకు తెలంగాణ ప్రజలే గాడ్ ఫాదర్. నాలుగున్నరేళ్లుగా తనకేం జరిగిందే బీజేపీ చేరిన తర్వాత చెబుతానని అన్నారు.
అసెంబ్లీ సామ్రాజ్యంగా
పదవులు ఇచ్చినా, ఇవ్వకపోయినా మనిషిని మనిషిలా చూడాలని హితవు పలికారు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. అధికారం ఉందని అసెంబ్లీని సామ్రాజ్యంగా చేసుకుని దోచుకుంటున్నారు. ఎమ్మెల్యేలు రాజుల్లా అరాచకాలు చేస్తున్నారు. వడ్డీతో సహా తిరిగి చెల్లించాల్పి వస్తుంది' అని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో అందరం కలిసి పోటీ చేస్తామని..శీసన్న మీతో ఉంటాడని..మీతోనే నడుస్తాడని పొంగులేటి తన కార్యకర్తలకు భరోసా కల్పించారు. మొత్తానికి రోజుకింత డోస్ పెంచుతూ పొంగులేటి వార్తల్లో నిలుస్తున్నారు.
సమయం వచ్చినప్పుడు చెబుతా?
బీఆర్ఎస్ అధిష్టానంపై మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి పరోక్షంగా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పదవులు ఇవ్వక పోయినా మనిషిని మనిషిలా చూడాలన్నారు. పొంగులేటి తీవ్ర ఆవేదనతో ఘాటు వ్యాఖ్యలు చేశారు. అధికార మదంతో కొందరు రెచ్చిపోతున్నారని, ప్రజలు తీర్పు ఇచ్చే రోజు ఎంతో దూరంలో లేదని వ్యాఖ్యానించారు. కష్టాలు చెప్పుకుంటేనే ఉలిక్కిపడుతున్నారన్నారు. కేవలం కేటీఆర్‌తో ఉన్న చనువుతోనే ఇంతకాలంలో బీఆర్ఎస్‌లో కొనసాగినట్లు పొంగులేటి అన్నారు. పార్టీ మారిన తర్వాత ఎలాంటి కష్టాలొచ్చినా సమయం వచ్చినప్పుడు సమాధానం చెబుతానని పొంగులేటి అన్నారు.