Khammam: ఖమ్మం కాంగ్రెస్‌లో అసలేంటి ఈ పరిస్థితి! తర్జనభర్జనలు పడుతున్న రాష్ట్ర నాయకత్వం
కాంగ్రెస్ పార్టీని ప్రజలు ఆదరిస్తున్నారని నాయకులు పదేపదే చెబుతునప్పటికీ గులాబీ గూటికి చేరుతున్న నాయకులతో పార్టీ ప్రతిష్ఠ మాత్రం ఎప్పటికప్పుడు పడిపోతూనే ఉంది.
మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా ఉన్న ఉమ్మడి ఖమ్మం జిల్లాలో వలసలు మాత్రం ఆగడం లేదు. ఓ వైపు ప్రజాసమస్యలపై నిరంతర పోరాటం చేస్తున్నామని, ప్రజల్లో కాంగ్రెస్ పార్టీని ప్రజలు ఆదరిస్తున్నారని నాయకులు పదేపదే చెబుతునప్పటికీ గులాబీ గూటికి చేరుతున్న నాయకులతో పార్టీ ప్రతిష్ఠ మాత్రం ఎప్పటికప్పుడు పడిపోతూనే ఉంది. ఎంత మంది నాయకులు వెళ్లినా ప్రజలు కాంగ్రెస్ వైపే ఉంటారని జిల్లాకు చెందిన నాయకులు చెబుతునప్పటికీ అసంతృప్తులు, వర్గ విబేదాలతో పార్టీకి మాత్రం నష్టం జరుగుతూనే ఉంది. ఇందుకు కారణం ఇక్కడున్న నాయకులు వ్యవహరిస్తున్న తీరుపైనే అని కాంగ్రెస్ పార్టీకి చెందిన కార్యకర్తలే పేర్కొనడం గమనార్హం. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి చెందిన ఇద్దరు కార్పోరేటర్లు, ఓ సర్పంచ్ పార్టీని వీడి గులాబీ గూటికి చేరడంతో కాంగ్రెస్‌లో వలసలు ఆపే నాయకులే లేరని ఆ పార్టీకి చెందిన నాయకులు చెబుతున్నారు.
వర్గ విబేదాలకు పెట్టింది పేరు..
కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా ఉన్న ఖమ్మం జిల్లాలో ఆది నుంచి వర్గ పోరు మాత్రం తప్పడం లేదు. పాత తరం నాయకుల నుంచి ఇప్పటి తరం నాయకులు కూడా అదే వ్యవహరశైలితో ఉండటంతో కాంగ్రెస్ పార్టీ స్థానికంగా బలహీనపడాల్సిన పరిస్థితి నెలకొంది. 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత జరిగిన మొదటి ఎన్నికల్లో గులాబీ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా తన హవా కొనసాగించినప్పటికీ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మొత్తం పది స్థానాల్లో ఐదు స్థానాలకు గెలుచుకుంది. అయితే కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయింపులకు పాల్పడినప్పటికీ 2018 ఎన్నికల్లో సైతం అదే స్థాయిలో జనం ఆదరించారు. ఈ దఫా ఆరు స్థానాలు కాంగ్రెస్ పార్టీ ఖాతాలోకి వెళ్లాయి. అయితే అనంతరం జరిగిన పరిణామాల నేపథ్యంలో నలుగురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీని వీడారు. అయితే ఇటీవల జరిగిన ఖమ్మం కార్పోరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సత్తా చాటే అవకాశం ఉనప్పటికీ నాయకులు వ్యవహరించిన తీరుతో 10 డివిజన్లకే పరిమితం కావడం గమనార్హం.
ఎవరికి వారే..
జిల్లాలో బలమైన నాయకత్వం లేకపోవడం వల్లే వలసలు మాత్రం ఆగడం లేదని కాంగ్రెస్ కార్యకర్తలు పేర్కొంటున్నారు. రెండుసార్లు ఎంపీగా గెలిచిన మాజీ మంత్రి రేణుకా చౌదరి ఇటీవల కాలంలో జిల్లాను పట్టించుకోకపోవడంతో సీఎల్పీ నాయకులు భట్టి విక్రమార్క ఖమ్మం జిల్లా పార్టీకి పెద్ద దిక్కుగా వ్యవహరిస్తున్నారు. అయితే, నియోజకవర్గాల్లో మాత్రం మూడు, నాలుగు గ్రూపులుగా కార్యకర్తలు ఏర్పాటు కావడంతో పార్టీ బలహీనపడాల్సిన పరిస్థితి నెలకొంది. క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ బలంగా ఉనప్పటికీ, కాంగ్రెస్ పార్టీకి జిల్లాలో బలమైన ఓటు బ్యాంకు ఉనప్పటికీ కిందిస్థాయిలో నాయకత్వానికి దిశానిర్దేశం చేసే వారు లేకపోవడంతో కాంగ్రెస్ పార్టీలో వలసలు మాత్రం ఆగడం లేదని ఆ పార్టీలో చర్చ సాగుతుంది. భట్టి విక్రమార్క తన సొంత నియోజకవర్గమైన మధిరతోపాటు ఖమ్మం నియోజకవర్గ వ్యవహారాలను ఎక్కువగా చూస్తునప్పటికీ ఖమ్మం నియోజకవర్గం నుంచే ఇటీవల ప్రజాప్రతినిధులు గులాబీ గూటికి చేరడం ఇప్పుడు జిల్లాలో రాజకీయపరంగా చర్చ సాగుతుంది.
పదవుల పందేరంలో హస్తినపై దృష్టి సారించడం తప్ప సొంత జిల్లాలో పార్టీని పటిష్ఠ పరిచేందుకు దృష్టి సారించకపోవడంతో ఈ పరిస్థితులు నెలకొంటున్నాయని కార్యకర్తలు పేర్కొంటున్నారు. ఏది ఏమైనా రెండు ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజలు జై కొట్టినప్పటికీ జిల్లా నాయకత్వం వ్యవహార శైలితో పార్టీలో వలసలు పెరిగిపోయి నష్టం జరుగుతుందనే చెప్పవచ్చు.
Also Read: Karimnagar: పెద్దోళ్లను ఎదిరించి లవర్‌ను దక్కించుకున్న ప్రియుడు.. యువతి కోరిక నచ్చక ఘాతుకం
Also Read: వనమా రాఘవ ఆగడాలకు అడ్డేలేదా?... ఆది నుంచి ఆరోపణల పర్వమే...!