Ponguleti Meets CM Jagan : ఏపీ సీఎం జగన్‌తో బీఆర్ఎస్ నేత పొంగులేటి భేటీ - వైఎస్ఆర్‌టీపీలో చేరే చాన్స్ !
ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిని ఖమ్మం బీఆర్ఎస్ నేత పొంగులేటి శ్రీనివాసరెడ్డి కలిశారు.
Ponguleti Meets CM Jagan : ఖమ్మం జిల్లాకు చెందిన మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి తాడేపల్లిలోని ఏపీ సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో సమావేశం అయ్యారు. రాజకీయ అంశాలపైనే చర్చించడానికి సమావేశం అయ్యారని తెలుస్తోంది. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గతంలో వైఎస్ఆర్‌సీపీ నుంచి ఎంపీగా గెలిచారు. ఆయన వైఎస్ జగన్ కు అత్యంత సన్నిహితులు. వైఎస్ఆర్‌సీపీ నుంచి ఎంపీగా గెలిచినప్పటికీ ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీలో చేరారు. కానీ గత ఎన్నికల్లో ఆయనకు పోటీ చేయడానికి టిక్కెట్ లభించలేదు. అయినప్పటికీ బీఆర్ఎస్ లోనే కొనసాగారు. వచ్చే ఎన్నికల్లోనూ ఆయనకు టిక్కెట్ లబించే అవకాశాలు లేవని భావించడంతో ఇటీవల ఆ పార్టీకి దూరంగా ఉంటున్నారు.
ఏ పార్టీలో చేరాలన్న దానిపై పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఆయన బీజేపీ పెద్దలతో సమావేశం అయ్యారని గతంలో ప్రచారం జరగింది. కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా ఆయనకు ఆహ్వానం పంపారని చెబుతున్నారు. అయితే పొంగులేటి మాత్రం వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిలతో పాటు .. వైఎస్ విజయలక్ష్మితోనూ రెండు సార్లు సమావేశం అయ్యారు. ఈ విషయాన్ని ఆయన ధృవీకరించారు. అయితే్ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీలో చేరుతారా లేదా అన్న విషయంపై ఎలాంటి ప్రకటన చేయలేదు. రాజకీయంగా ఎలాంటి నిర్ణయం తీసుకోవాలన్న అంశంపై ముఖ్యమంత్రి జగన్ తో చర్చించేందుకే తాడేపల్లికి వచ్చారని భావిస్తున్నారు.
ఇప్పటికే పొంగులే్టి శ్రీనివాసరెడ్డి ఏ పార్టీలో చేరినా తన అనుచరులు ఖమ్మం జిల్లాలో పోటీ చేస్తారని చెబుతున్నారు. వైరా అభ్యర్థిగా బానోత్ విజయను ఇప్పటికే ప్రకటించిన పొంగులేటి.. అశ్వారావుపేట అసెంబ్లీ స్థానానికి జారే ఆది నారాయణ పేరును ప్రకటించారు. తాను ఏ పార్టీలోకి వెళ్లినా ఇప్పుడు ప్రకటించిన అభ్యర్థులే ఉంటారని స్పష్టం చేశారు. అయితే కాంగ్రెస్ లో ఆయా అభ్యర్థులకు టిక్కెట్లు ఇవ్వడం సాధ్యం కాదు. దీంతో ఆయన కాంగ్రెస్ ను పక్కన పెట్టినట్లేనని చెబుతున్నారు. ఖమ్మం జిల్లాలో బీజేపీకి పెద్దగా బలం లేదు. ఈ కారణంగా పొంగులేటితో పాటు ఎవరు వచ్చినా సీట్లు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. అలాగే వైఎస్ఆర్‌టీపీలో చేరినప్పటికీ ఆయనకు ఆ వెసులుబాటు ఉంటుంది.
వైఎస్ఆర్‌టీపీలో చేరాలని నిర్ణయించుకున్నందునే సీఎం జగన్ తో సమావేశం అయ్యారని భావిస్తున్నారు. అయితే వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు షర్మిలకు, సీఎం జగన్ కు మధ్య సంబంధాలు అంత గొప్పగా లేవన్న ప్రచారం ఉంది. ఇప్పటికీ బీఆర్ఎస్లోనే ఉన్న పొంగులేటిపై చర్యలు తీసుకునేందుకు హైకమాండ్ వెనుకంజ వేస్తోంది. రాజీనామా చేయాలని బీఆర్ఎస్ నేతలు సవాల్ చేస్తున్నారు. వైరా నియోజకవర్గంలో పొంగులేటి వెంట తిరుగుతున్నారనే కారణంతో పార్టీ వ్యతిరేక కార్యక్రమాల్లో పాల్గొంటున్నారని రెండ్రోజుల క్రితం దాదాపు 20 మంది లీడర్లను సస్పెండ్ చేశారు. ఇందులో మార్క్ ఫెడ్ వైస్ చైర్మన్ బొర్రా రాజశేఖర్, వైరా మున్సిపల్ చైర్మన్ సూతకాని జైపాల్ వంటి వారితో పాటు పలువురు నాయకులున్నారు. ‘నా వాళ్లను కాదు, ధైర్యముంటే నన్ను సస్పెండ్ చేయండి.. అదీ మీ ఖలేజా’ అంటూ బీఆర్ఎస్ లీడర్లకు మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సవాల్ విసిరుతున్నారు. మొత్తానికి పొంగులే్టి ..ఏపీ సీఎంతో భేటీ తర్వాత ఏం నిర్ణయించుకున్నారన్నది వెల్లడించే అవకాశం ఉంది.