KCR By Elections: స్టేషన్ ఘన్‌పూర్‌లో ఉపఎన్నిక వస్తుంది, కడియం ఓడిపోతారు - మరోసారి కేసీఆర్ కీలక వ్యాఖ్యలు
Telangana: తెలంగాణలో ఉపఎన్నికలు వస్తాయని కేసీఆర్ అన్నారు. స్టేషన్ ఘన్ పూర్ నుంచి వచ్చిన కార్యకర్తలతో ఆయన సమావేశం అయ్యారు.

By elections in Telangana: తెలంగాణలో ఉపఎన్నికలు వస్తాయని ఇప్పటి వరకూ కేటీఆర్ చెబుతూ వస్తున్నారు. ఇప్పుడు కేసీఆర్ కూడా అదే మాట చెబుతున్నారు. స్టేషన్ ఘన్ పూర్ నుంచి వచ్చిన కార్యకర్తలతో కేసీఆర్ మాట్లాడారు. ఈ సందర్భంగా తెలంగాణలో ఉపఎన్నికలు వస్తాయన్నారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలకు ప్రజలు బుద్ది చెబుతారని కేసీఆర్ స్పష్టం చేశారు. ఉపఎన్నికల్లో అక్కడి నుంచి రాజయ్య గెలుస్తారని.. కడియం ఓడిపోతారని జోస్యం చెప్పారు. తాటికొండ రాజయ్య నేతృత్వంలో కార్యకర్తలు వెళ్లారు. ఈ సారి అక్కడ ఉప ఎన్నికలు జరిగితే రాజయ్యకే టిక్కెట్ ఖరారు చేసినట్లుగా కేసీఆర్ భరోసా ఇవ్వడంతో రాజయ్యకు గ్యారంటీ వచ్చినట్లయింది.
గత ఎన్నికల్లో రాజయ్యకు బదులు కడియంకు స్టేషన్ ఘన్ పూర్ టిక్కెట్ ఇచ్చిన కేసీఆర్
గత ఎన్నికల్లో రాజయ్యకు టిక్కెట్ నిరాకరించి.. కడియం శ్రీహరికి టిక్కెట్ ఇచ్చారు. అయితే రాజయ్య ఇతర పార్టీల్లో చేరకుండా బీఆర్ఎస్ కోసమే పని చేశారు. అయితే ఆయన ఎన్నికలు అయిపోయిన తర్వాత బీఆర్ఎస్ కు రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేరే ప్రయత్నం చేశారు. కానీ ఆయనను చేర్చుకునేందుకు కాంగ్రెస్ సిద్ధపడలేదు. కడియం శ్రీహరి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఆయన చేరిపోయారు . దీంతో రాజయ్య మళ్లీ బీఆర్ఎస్ పార్టీలో చేరిపోయారు. స్టేషన్ ఘన్ పూర్ లో కడియం శ్రీహరిపై తీవ్ర విమర్శలు చేస్తూ రాజకీయం చేస్తున్నారు. గతంలో రాజయ్య కేసీఆర్ ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంగా చేశారు. అయితే ఆయనపై ఆరోపణలు రావడంతో అనూహ్యంగా బర్తరఫ్ చేశారు. అయినా తర్వాత ఎన్నికల్లో టిక్కెట్ ఇచ్చారు. 2023లో మాత్రమే టిక్కెట్ నిరాకరించారు.
పార్టీ మారిన ఎమ్మెల్యేలకు అనర్హతా వేటుపై సుప్రీంకోర్టులో పోరాడుతున్న బీఆర్ఎస్
పది మంది ఎమ్మెల్యేలు పార్టీ మారడంతో వారిపై అనర్హతా వేటు వేయాలని బీఆర్ఎస్ పార్టీ సుప్రీంకోర్టుకు వెళ్లింది. సుప్రీంకోర్టు..అసెంబ్లీ కార్యదర్శిని ఎప్పటి లోపు నిర్ణయం తీసుకుంటారో చెప్పాలని ఆదేశించింది. సరైన సమయంలో అని చెబుతున్న దాన్ని సుప్రీంకోర్టు అంగీకరించడం లేదు. తదుపరి విచారణలో ఎప్పటిలోపు నిర్ణయం తీసుకుంటారో చెప్పకపోతే.. తామే ఫలానా తేదీలోపు నిర్ణయం తీసుకోవాలని ఆదేశాలు జారీ చేస్తామని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. దీంతో పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హతా వేటు పడుతుందన్న నమ్కకం బీఆర్ఎస్ నేతలు వ్యక్తం చేస్తున్నారు.
ఖచ్చితంగా ఉపఎన్నికలు వస్తాయంటున్న బీఆర్ఎస్
అయితే కాంగ్రెస్ నేతలు మాత్రం.. స్పీకర్ నిర్ణయాన్ని సుప్రీంకోర్టు కూడా తిరస్కరించలేదని.. స్పీకర్ ను సుప్రీంకోర్టు ఆదేశించే అదికారం రాజ్యాంగం ఇవ్వలేదని అంటున్నారు. చట్టం ప్రకారం ఎమ్మెల్యేల అనర్హతపై నిర్ణయం తీసుకునే సర్వహక్కులు స్పీకర్ కే ఉన్నాయని అంటున్నారు. అయితే ఉపఎన్నికలపై మాత్రం బీఆర్ఎస్ ఆశలు పెంచుకుంటూ పోతోంది.
Also Read: ఈ ఏడాది వరుస ఎన్‌కౌంటర్లు - 37 రోజుల్లో 81 మంది మావోయిస్టుల మృతి




















