Talasani To Welcome Modi : హైదరాబాద్‌లో మోదీకి స్వాగతం చెప్పేది కేసీఆర్ కాదు.. ఆ మంత్రికి చాన్స్ !
ప్రధాని మోదీకి స్వాగతం చెప్పేందుకు కేసీఆర్ బేగంపేట ఎయిర్ పోర్టుకు వెళ్లడం లేదు. ప్రోటోకాల్ ప్రకారం ఆ బాధ్యతను తలసాని శ్రీనివాస్ యాదవ్‌కు ఇచ్చారు.
Talasani To Welcome Modi : తెలంగాణ పర్యటనకు వస్తున్న ప్రధానమంత్రి నరేంద్రమోదీకి సీనియర్ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్వాగతం పలకనున్నారు. ఆయనే వీడ్కోలు చెప్పనున్నారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఒక ప్రకటన విడుదల చేశారు. శనివారం నగరానికి చేరుకోనున్న ప్రధాని మోదీకి మంత్రి తలసాని ఎయిర్ పోర్ట్ లో స్వాగతం పలకనున్నారు. ప్రోటోకాల్ ప్రకారం ప్రధాని ఏ రాష్ట్రానికి వెళ్లినా ముఖ్యమంత్రి వెళ్లి స్వాగతం పలకడం సంప్రదాయం. కానీ శనివారం నగరానికి వస్తున్న ప్రధాని మోదీకి స్వాగతం పలకడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ వెళ్లకుండా మంత్రి తలసానిని పంపడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుత రాజకీయ పరిస్ధితుల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రధాన మంత్రి మోదీని కలిసేందుకు ఇష్టపడడం లేదని చెబుతున్నారు. గతంలోనూ ప్రధాని వచ్చినప్పుడు తలసానికే స్వాగతం.. వీడ్కోలు పలికే అవకాశం కల్పించారు.
మోదీ పర్యటనలో ప్రోటోకాల్ పాటించలేదని టీఆర్ఎస్ ఆరోపణ
ప్రధాని నరేంద్ర మోదీ నవంబర్ 12న తెలంగాణలో పర్యటించనున్నారు. ప్రధాని మోదీ హాజరయ్యే ఈ ఈవెంట్ కోసం పంపిన ఆహ్వానంలో కేంద్ర ప్రభుత్వం కనీస ప్రొటోకాల్‌ను పాటించలేదని టీఆర్ఎస్ ఆరోపించింది. రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ పునరుద్ధరణలో అధికారిక భాగస్వామిగా ఉన్న తెలంగాణ ప్రభుత్వాన్ని, రాష్ట్ర ప్రజలను కేంద్రం అవమానించిందని తమ అధికారిక ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. ప్రొటోకాల్ ప్రకారం ప్రధాని నరేంద్ర మోదీ పేరు తర్వాత అతిథిగా తెలంగాణ సీఎం కేసీఆర్ పేరును చేర్చలేదని టీఆర్ఎస్ నేతలు మండిపడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం భాగస్వామిగా ఉన్న ఫ్యాక్టరీ ఈవెంట్లో సీఎంకు నామమాత్రంగా ఆహ్వానం పంపి కేంద్ర ప్రభుత్వం చేతులు దులిపేసుకుందని ఆరోపించింది.
పద్దతి ప్రకారమే పిలిచామని కేంద్రం కౌంటర్
అయితే ఈ ఆరోపణల్ని కేంద్రం ఖంించింది. ప్రోటోకాల్ ప్రకారం సీఎం కేసీఆర్‌ను ఆహ్వానించలేదని టీఆర్ఎస్ నేతలు విమర్శలు చేస్తున్నారు. దీంతోే కేంద్ర ప్రభుత్వ వర్గాలు .. ఈ ఆరోపణల్ని ఖండించాయి. రామగుండం ప్లాంట్ సీఈవో స్వయంగా కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయ పంపిన ఆహ్వానలేఖను సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీకి అందించారన్నారు. ఈ లేఖను మీడియాకు కూడా విడుదల చేశారు.
మోదీ పర్యటనను అడ్డుకుంటామని పలువురు ప్రకటనలు - టీఆర్ఎస్ నిరసనలు
మోదీ పర్యటనను అడ్డుకుంటామని పలు సంస్థలు ఇప్పటికే ప్రకటించాయి. తెలంగాణ అభివృద్ధికి అనేక హామీలిచ్చిన కేంద్రం వాటిని నెరవేర్చడం లేదని ఆరోపించారు. ప్రజలను మరోసారి మోసం చేసేందుకే రాష్ట్రంలో మోదీ పర్యటిస్తున్నారని పేర్కొన్నారు. 2021 నుంచే రామగుండం ఫ్యాక్టరీ ఉత్పత్తి ప్రారంభించిందని, అప్పటి నుంచి సుమారు పది లక్షల టన్నులకు పైగా ఎరువుల ఉత్పత్తి సరఫరా అవుతుందన్నారు.ప్రజలను మభ్యపెట్టేందుకు పాత ఫ్యాక్టరీని ప్రారంభించేందుకు రాష్ట్రానికి రావడం విడ్డూరంగా ఉందని విమర్శిస్తున్నారు. దీంతో మోదీ పర్యటన ఉద్రిక్తల మధ్య సాగే అవకాశం కనిపిస్తోంది.
తెలంగాణ ప్రభుత్వ నివేదిక ఆధారంగానే సోదాలు - గ్రానైట్ వ్యాపారుల భారీ హవాలా స్కామ్ బయటపడిందన్న ఈడీ !