TRS Meeting : దసరా రోజున మీటింగ్ యథాతాథం - ఏ మార్పు లేదన్న టీఆర్ఎస్ !
దసరా రోజున టీఆర్ఎస్ జనరల్ బాడీ మీటింగ్ యథాతథంగా ఉంటుందని కేసీఆర్ ప్రకటించారు. ఉపఎన్నిక షెడ్యూల్ ప్రభావం ఎమీ ఉండదని ప్రతినిధులకు సంకేతం పంపారు.
TRS Meeting : తెలంగాణ భవన్ లో దసరా నాడు ఉదయం 11 గంటలకు తలపెట్టిన టిఆర్ఎస్ పార్టీ జనరల్ బాడీ మీటింగ్ యధావిధిగా జరగుతుందని టిఆర్ఎస్ అధినేత సిఎం కెసిఆర్ స్పష్టం చేశారు.మునుగోడు ఉప ఎన్నికల నోటిఫికేషన్ నేపథ్యంలో దాని ప్రభావం, దసరా నాటి టిఆర్ఎస్ సర్వసభ్య సమావేశం పైన ఉండదని., సభ్యులు అనుమానాలకు గురికావద్దని అన్నారు. ముందుగా ప్రకటించినట్టే అక్టోబర్ 05 వ తేదీన ఉదయం 11 గంటలకు తెలంగాణ భవన్ లో పార్టీ సర్వసభ్య సమావేశం కొనసాగుతుందని సిఎం కెసిఆర్ పునరుద్ఘాటించారు. అందరూ నిర్దేషిత సమయం లోపే హాజరుకావాలన్నారు.
దసరా రోజున పార్టీ పేరు మార్పు తీర్మానం కోసం టీఆర్ఎస్ జనరల్ బాడీ మీటింగ్
జాతీయ రాజకీయాలపై దృష్టి సారించిన సీఎం కేసీఆర్.. దసరా పండుగ రోజు పార్టీ పేరు ప్రకటించనున్నట్లు సమాచారం. ఇందులో భాగంగానే ఈ నెల 5న తెలంగాణ భవన్లో టీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేశారు. ఈ మీటింగ్కు పార్టీ ప్రజా ప్రతినిధులు, సీనియర్ నేతలతో పాటు జిల్లాల నేతలు రానున్నారు. తాజాగా మునుగోడు ఉప ఎన్నిక షెడ్యూల్ విడుదల కావడంతో టీఆర్ఎస్ మీటింగ్పై అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఈ క్రమంలో సీఎం కేసీఆర్ సమావేశం నిర్వాహణపై స్పష్టతనిచ్చారు.
పేరు మార్పుకు అనుగుణంగా తీర్మానాలు చేస్తున్న పార్టీలోని వివిధ స్థాయిల కార్యవర్గాలు
ప్రస్తుతం టీఆర్‌ఎస్‌లో అన్ని స్థాయిల నేతల సమావేశాలు జరుగుతున్నాయి. దసరా రోజున టీఆర్ఎస్ జనరల్ బాడీ మీటింగ్‌లో టీఆర్‌ఎస్ పేరు మార్చుతూ ఏకగ్రీవంగా తీర్మానం చేయనున్నారు. ఈ సమావేశానికి పార్టీ రాష్ట్ర కార్యవర్గం, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, రాష్ట్ర స్థాయి కార్పొరేషన్, జిల్లా పరిషత్, డీసీసీబీ, డీసీఎంఎస్, జిల్లా గ్రంథాలయ సంస్థల చైర్మన్లను ఆహ్వానించారు. మొత్తం 283 మంది టీఆర్‌ఎస్ ముఖ్య నాయకత్వం పార్టీ పేరును మార్చుతూ తీర్మానం చేయనున్నారు. ప్రత్యేకంగా పార్టీ పెట్టడం కాదని పేరు మాత్రమే మారుస్తున్నామని కేసీఆర్ చెబుతున్నారు. భారత రాష్ట్ర సమితికే కేసీఆర్ ఫిక్స్ అయ్యారు.
పూర్తి స్థాయిలో పార్టీ పేరు మారిన తర్వాత కార్యవర్గం ఏర్పాటు
దసరా రోజు రాష్ట్ర విస్తృత స్థాయి సమావేశం అనంతరం మధ్యాహ్నం 1.19 గంటలకు జాతీయ పార్టీ పేరు, జెండా, ఎజెండాను మీడియాకు వెల్లడిస్తారు కేసీఆర్. సమావేశంలో చేసిన తీర్మానం ప్రతులతో ఈ నెల 6న ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ వినోద్ కుమార్ ఢిల్లీకి వెళ్లి సీఈసీకి వాటిని అందజేస్తారు. పార్టీ పేరు మారేదాకా వినోద్ నేతృత్వంలోని టీం ఫాలో అప్ చేస్తుంది. జాతీయ పార్టీ అధ్యక్షుడిగా కేసీఆర్ ఉంటారు. పార్టీ పేరు మారి, కేంద్ర ఎలక్షన్ కమిషన్‌కు సంబంధించిన ప్రక్రియ పూర్తయ్యాక జాతీయ కార్యవర్గ సమావేశాలు నిర్వహించి పూర్తి స్థాయి కార్యవర్గాన్ని, పొలిట్ బ్యూరోను నియమిస్తారు.
కేసీఆర్ జాతీయ పార్టీ పెట్టేది తెలంగాణలో మూడో సారి గెలవడానికే. - అంచనాలకు అందని కేసీఆర్ వ్యూహం ఇదే !