Kavitha Comments On Harish Rao: రేవంత్ రెడ్డి కాళ్లు పట్టుకున్న హరీష్ రావు! నాకు పట్టిన గతి రేపు కేటీఆర్‌కు కూడా: కవిత
Harish Rao Surrenders To Revanth Reddy | తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కాళ్లు హరీష్ రావు పట్టుకున్నారని కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. హరీష్ రావు మాకు వెన్నుపోటు పొడిచారని ఆరోపించారు.

Kalvakuntla Kavitha | హైదరాబాద్: హరీష్ రావు, సంతోష్ చేసిన కుట్రలకు తాను బలైపోయానన్న ఎమ్మెల్సీ కవిత రేపు సోదరుడు కేటీఆర్‌కు సైతం ఇదే గతి పట్టే అవకాశం ఉందన్నారు. సీఎం రేవంత్ రెడ్డికి హరీష్ రావు సరెండర్ అయి కాళ్లు పట్టుకున్నాడని అప్పటినుంచే కేసీఆర్ ఫ్యామిలీ మీద కుట్రలు జరుగుతున్నాయని కవిత ఆరోపించారు. తనను పార్టీ నుంచి సస్పెండ్ చేసిన తరువాత కవిత తొలిసారి మీడియాతో మాట్లాడుతూ.. హరీష్ రావు, సంతోష్ లపై సంచలన ఆరోపణలు చేశారు. జాగ్రత్తగా ఉండాలని కేటీఆర్‌కు సూచించారు.
హరీష్ రావు నాపై దుష్ప్రచారం చేయించారు..
దళితులకు 3 ఎకరాలు ఇస్తానన్న ఏకైక సీఎం కేసీఆర్.. ఆయన వేలుపట్టి రాజకీయ, ఉద్యమ ఓనమాలు చేస్తున్న వ్యక్తిని తానని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. హరీష్ రావు, సంతోష్ పనిగట్టుకుని తనపై దుష్ప్రచారం చేశారు. బంగారు తెలంగాణ అంటే హరీష్ రావు, సంతోష్ ఇంట్లో బంగారం ఉండటం కాదు. సామాజిక తెలంగాణ కోసం నేను మాట్లాడితే కవిత సొంత పార్టీ పెడుతుంది, ఆమె బీఆర్ఎస్ కు వ్యతిరేకంగా పనిచేసిందని ప్రచారం చేయడం కరెక్టేనా అని ఆ నేతల్ని ప్రశ్నించారు.
తెలంగాణ భవన్‌కు వెళ్లి నామీద కుట్రలు జరుగుతున్నాయి, దుష్ప్రచారం జరిగిందని మా అన్న, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు చెప్పాను. ఓ మహిళా ఎమ్మెల్సీని, నీ చెల్లిని నాకు సమస్య ఉందని తెలంగాణ భవన్ కు వెళ్లి చెబితే.. వర్కింగ్ ప్రెసిడెంట్ అని అయినా నాకు కనీసం ఫోన్ చెయ్యాలి కదా. 103 రోజులు అయింది. ఈరోజు వరకు ఒక్కమాట కూడా మాట్లాడలేదు. కేసీఆర్ స్పందించాలని నేను కోరుకోలేదు. వర్కింగ్ ప్రెసిడెంట్ చెల్లిగా కాకపోయినా, మహిళా ఎమ్మెల్సీగా నాకు కనీసం ఫోన్ కాల్ కూడా రానందుకు బాధగా ఉంది.
నేను కేసీఆర్ బిడ్డను అయి ఉండి ప్రెస్ మీట్ పెడితేనే పట్టించుకోలేదు. అలాంటిది మహిళా నేతలు, కార్యకర్తలు సమస్యలు చెబితే ఎవరు స్పందిస్తారు. నిన్న నన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేశారని ప్రకటన వచ్చాక జరిగిన ఘటనతో సంతోషంగా ఉన్నా. మహిళా ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు ఐదుగురు తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడినందుకు హ్యాపీగా ఉంది. ఇదే నేను కోరుకున్నా. నేను, కేటీఆర్ అన్నాచెల్లెళ్లం. కుటుంబసభ్యులగా మాకు ఏ సమస్యలు లేవు. కానీ కొందరు మా మధ్య చిచ్చుపెడుతున్నారు. బలవంతంగా నన్ను పార్టీ నుంచి బయటకు పంపించారు. నాన్న దీని మీద మీరు మరోసారి ఆలోచించండి. రేపు కేటీఆర్‌కు ఇదే ప్రమాదం పొంచి ఉంది. కుట్రలో భాగంగా నన్ను బయటకు పంపించారు.
నా మీద కుట్రలు ఎప్పుడు మొదలయ్యాయి..
హరీష్ రావు, రేవంత్ రెడ్డి ఓసారి విమానంలో కలిసి ప్రయాణం చేశారు. అప్పుడు హరీష్ రావు సరెండర్ అయి రేవంత్ రెడ్డి కాళ్లు పట్టుకున్నారు. అప్పటినుంచే మా మీద కుట్రలు జరుగుతాయి. హరీష్ రావు పాల వ్యాపారంపై ఆరోపణలు వచ్చాయి. రెండు రోజులు పేపర్లో న్యూస్ వస్తుంది. తరువాత దానిమీద చర్యలుండవు. ఎందుకంటే హరీష్ రావు సరెండర్ అయ్యాడు. అదే కేసీఆర్, కేటీఆర్ మీద కేసులు పెడుతున్నారు. వరుస కేసులతో కేటీఆర్ ను విచారణకు పిలిచి వేధిస్తున్నారు.
విధానపరమైన నిర్ణయాలు తీసుకునేవాళ్లు సీఎంగా ఉండాలి. తుమ్మడిహట్టి నుంచి మేడిగడ్డకు బ్యారేజీ మార్చినప్పుడు మంత్రిగా ఎవరున్నారు. కానీ కేసీఆర్ ను టార్గెట్ చేసి ఆరోపణలు చేశారు.






















