MLC Kavitha: ప్రజా సమస్యలపై ప్రశ్నించినందుకే బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ చేశారు: కవిత సంచలనం
Kaleshwaram Lift Irrigation Project | కాళేశ్వరం కేసును సీబీఐ దర్యాప్తునకు ఇవ్వడంతో ఎమ్మెల్సీ కవిత తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దాంతో పార్టీ అధినేత కేసీఆర్ తన కూతురు కవితను బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ చేశారు.

Kalvakuntla Kavitha Latest News Updates | హైదరాబాద్: నామీద అక్రమ కేసులు పెట్టి ఐదున్నర నెలలపాటు నన్ను జైల్లో పెట్టారని ఎమ్మెల్సీ కవిత అన్నారు. నవంబర్ 23, 2024 నుంచి జైలు నుంచి వచ్చాక ప్రజాక్షేత్రంలో ఎన్నో పనులు చేశానని తెలిపారు. బీఆర్ఎస్ పార్టీ బహిష్కరణ వేటు పడిన తరువాత ఎమ్మెల్సీ కల్వకుంట్ల తొలిసారి మీడియాతో మాట్లాడారు. గురుకులాల్లో విద్యార్థుల సమస్యలపై తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశ్నించాను. బీసీలకు జరుగుతున్న అన్యాయం, కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఇచ్చిన 42 శాతం రిజర్వేషన్ గురించి ఉద్యమం చేశానన్నారు.
మహిళలకు 2500 ఇవ్వాలని పోస్ట్ కార్డ్ ఉద్యమం చేపట్టాను. వృద్ధులపై తెలంగాణ తల్లి స్వరూపాన్ని మార్చడాన్ని తీవ్రంగా వ్యతిరేకించాను. ఏపీ కడుతున్న బనకచర్ల ప్రాజెక్టుపై, తెలంగాణ ప్రాజెక్టులు, సాగునీటి అంశాలపై రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటుచేసి తెలంగాణ ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాను. భద్రాచలం వద్ద 5 గ్రామాల ముంపు సమస్యపై స్పందించింది మేం. సీఎం రేవంత్ రెడ్డి సొంత జిల్లా మహబూబ్ నగర్ జిల్లాలో నారాయణపేటకు వెళ్లి బాధితులకు మద్దతుగా నిలిచాం. 47 నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ కండువా కప్పుకుని ఎక్కడికి పోతే అక్కడ కేసీఆర్‌తో కమ్యూనికేషన్ చేపించి నవంబర్ నుంచి నేటి వరకు అనేక ప్రజా సమస్యలపై నేను ప్రభుత్వాన్ని ప్రశ్నించాను. వీటిని పార్టీ వ్యతిరేక కార్యక్రమాలు ఎలా అవుతాయని కేసీఆర్‌ను ప్రశ్నించారు. పార్టీ పెద్దలు తన సస్పెన్షన్ పై మరోసారి ఆలోచించాలన్నారు. బీసీలకు రిజర్వేషన్లపై అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుంటే.. నామీద వ్యతిరేకంగా బీఆర్ఎస్ నేతలు నోటికొచ్చినట్లు మాట్లాడారు.
కేసీఆర్‌కు కాళేశ్వరం అవినీతి మరకలు అంటడానికి కారణం హరీష్ రావు, సంతోష్ లేనని, వారే తన తండ్రి చుట్టు ఉన్న దెయ్యాలు అని ఎమ్మెల్సీ కవిత ఇటీవల సంచలన వ్యాఖ్యలు చేశారు. హరీష్ రావు వ్యవహరం గుర్తించినందుకే రెండోసారి బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక ఆయనను కేసీఆర్ కొంతకాలం దూరం పెట్టారంటూ కవిత చేసిన వ్యాఖ్యలు బీఆర్ఎస్ పార్టీతో పాటు తెలంగాణ రాజకీయాల్లో కలకలం రేపాయి. గత కొన్ని రోజులుగా కవిత చేస్తున్న వ్యాఖ్యలు పార్టీకి నష్టం చేకూర్చేలా ఉన్నాయని బీఆర్ఎస్ నుంచి ఆమెను సెప్టెంబర్ 2న సస్పెండ్ చేశారు. ఈ మేరకు పార్టీ ఓ ప్రకటన సైతం విడుదల చేసింది.
కాగా, ఎర్రవల్లిలోని ఫాంహౌస్‌లో బీఆర్ఎస్ నేతలతో పార్టీ అధినేత కేసీఆర్ సమావేశం అయ్యారు. పార్టీ నుంచి కవితను సస్పెండ్ చేసిన తరువాత తలెత్తిన పరిణామాలపై కేటీఆర్, జగదీష్ రెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డి, సంజయ్, మరికొందరు నేతలతో కేసీఆర్ కీలక భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది.






















