BRS MLA Kaushik Reddy: గెలిచాక పార్టీ మారితే వెయ్యి మందితో దాడి, తుక్కుతుక్కు చేస్తాం: కౌశిక్‌రెడ్డి వార్నింగ్
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ గెలిపించుకున్నాక ఎవరైనా అభ్యర్థులు పార్టీ మారితే మాత్రం తీవ్ర పరిణామాలు ఉంటాయని ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి హెచ్చరించారు.

Telangana News | కమలాపూర్: హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలతో మరోసారి వార్తల్లో నిలిచారు. తెలంగాణలో త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో భారత రాష్ట్ర సమితి (BRS) కార్యకర్తలు కష్టపడి గెలిపించుకున్న అభ్యర్థుు కనుక పార్టీ మారితే వదిలిపెట్టేది లేదని హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి హెచ్చరించారు. స్థానిక ఎన్నికల కోసం బీఆర్ఎస్ ప్రచారం మొదలుపెట్టింది. ఈ క్రమంలో హనుమకొండ జిల్లా కమలాపూర్‌లో సోమవారం బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల సమావేశానికి కౌశిక్ రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు.
గెలిచాక పార్టీ మారితే తీవ్ర పరిణామాలు
పార్టీ కోసం, ప్రజల కోసం పనిచేసే బీఆర్ఎస్ అభ్యర్థులను స్థానిక ఎన్నికల్లో గెలిపించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. కానీ ఎన్నికల్లో గెలిచాక ఆ అభ్యర్థులు పార్టీ మారితే మర్యాద దక్కదని హెచ్చరించారు. బీఆర్ఎస్ నుంచి గెలిచాక ఎవరైనా పార్టీ మారితే కనుక 1000 మందిని తీసుకొచ్చి వారి ఇంటిపై దాడి చేసి తుక్కుతుక్కు చేస్తామని హెచ్చరించారు. నియోజకవర్గంలోని 5 మండలాల్లోని తమ అభ్యర్థులందరికీ ఇది వర్తిస్తుందని ఘాటు వ్యాఖ్యలు చేశారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలని వదిలిపెట్టలేదని, అలాగే మిమ్మల్ని కూడా వదిలిపెట్టమని కౌశిక్ రెడ్డి వ్యాఖ్యానించారు.
‘నాకోసం కష్టపడ్డారు, ఇప్పుడు మీకోసం కష్టపడతా. యూరియా అందించని ప్రభుత్వానికి ఓట్లు అడిగే హక్కు లేదు. కమలాపూర్ గడ్డపై గులాబీ జెండా ఎగరవేస్తాం, హుజురాబాద్ నియోజకవర్గంలో అత్యధిక సీట్లు గెలిపించి కేసీఆర్ కి కానుక ఇస్తాం’ అన్నారు కౌశిక్ రెడ్డి. ఈనెల 9 నుంచి నామినేషన్ ప్రక్రియ ప్రారంభం అవుతుంది, అంతా సిద్ధంగా ఉండాలని గులాబీ శ్రేణులకు పిలుపునిచ్చారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో తనకోసం కష్టపడి గెలిపించిన కార్యకర్తలు, నాయకులకు తాను అండగా నిలబడి, స్థానిక సంస్థల ఎన్నికల్లో వారిని గెలిపించేందుకు కష్టపడతా అన్నారు.

సోమవారం కమలాపూర్ లో నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ — హుజురాబాద్ నియోజకవర్గ అభివృద్ధికి కేసీఆర్ వందల కోట్లు వెచ్చించారని గుర్తుచేశారు. అయితే, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన 6 గ్యారంటీల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్కదాన్ని కూడా పూర్తిగా అమలు చేయలేదు. రైతులు యూరియా కోసం తీవ్రంగా ఇబ్బందులు పడుతుండగా, యూరియా అందించని కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓట్లు అడిగే హక్కే లేదు.

ఎన్నికలకు బీఆర్ఎస్ సిద్ధం..
ప్రజల విశ్వాసం గెలుచుకున్న వారికి మాత్రమే బీఆర్ఎస్ టికెట్లు కేటాయిస్తాం. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా బీఆర్‌ఎస్ పార్టీ సిద్ధంగానే ఉంది. హుజురాబాద్ నియోజకవర్గం నుంచి అత్యధిక సీట్లు గెలిపించి కేసీఆర్ కి కానుకగా అందిస్తాం. బీజేపీ, కాంగ్రెస్ పార్టీల్లో వర్గ రాజకీయాలు ముదిరిపోయాయని, కానీ బీఆర్‌ఎస్‌లో మాత్రం ఒక్కటే వర్గం అది “కేసీఆర్ వర్గం” అని’ కౌశిక్ రెడ్డి స్పష్టం చేశారు. రాబోయే ఎంపీటీసీ, జడ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికల్లో కూడా హుజురాబాద్ మొత్తం మీద గులాబీ జెండా ఎగరడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఈనెల 9 నుంచి నామినేషన్ ప్రక్రియ ప్రారంభమవుతుందని తెలిపారు.
అదే సమయంలో ఉప్పల్ గ్రామం రైల్వే బ్రిడ్జ్ నిర్మాణ పనులను BRS ప్రభుత్వం దాదాపు పూర్తిచేసినా, మధ్యలో కేంద్ర ప్రభుత్వం పనులు నిలిపివేసిందని విమర్శించారు. ప్రస్తుత రహదారిపై ఏర్పడిన గుంతల కారణంగా వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. సమస్య పరిష్కారానికి త్వరలోనే చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సింగిల్ విండో చైర్మన్ సంపత్ రావు, వైస్ చైర్మన్ ఇంద్రసేనా రెడ్డి, మాజీ జడ్పీటీసీలు లక్ష్మణరావు, నవీన్, సీనియర్ నాయకులు సత్యనారాయణ రావు, తిరుపతి రావు, కేడీసీసీ డైరెక్టర్ కృష్ణ చైతన్య, సమన్వయ కమిటీ సభ్యులు, బీఆర్‌ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.






















