Karimnagar: ఆయన పేరు ఆరోగ్యం- పోలీసు వ్యవస్థకే అనారోగ్యం- కరీంనగర్ పోలీస్ కమిషనర్‌కు బాధితుల ఫిర్యాదు!
Telangana: ఆయన పేరు ఆరోగ్యం. కానీ ఆయన తన ప్రవర్తనతో పోలీస్ వ్యవస్థకే అనారోగ్యంలా మారారు అంటున్నారు ప్రజలు. అధికారి టార్చర్ తట్టుకోలేక ఆత్మహత్యాయత్నం కూడా చేసుకున్నారు.
Karimnagar: సమాజంలో ఎవరికైనా అన్యాయం జరిగిందంటే ముందుగా గుర్తుకు వచ్చేది పోలీస్ స్టేషన్. పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేస్తే న్యాయం జరుగుతుందని ప్రజల్లో ఒక నమ్మకం. పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేస్తే సమస్యకు పరిష్కారం లభిస్తుందని భరోసా. కానీ కొందరి తీరు వల్ల పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేయాలంటేనే భయపడాల్సిన పరిస్థితి. అలాంటి వాళ్లు ఏదైనా సమస్యతో పోలీస్ స్టేషన్‌కు వచ్చే కేసుకో రేటుగా ముడుపులు గుంజుతున్నారు. కేసులు ఎవరు పెట్టినా మూటలు ముట్టిన వారివైపే మొగ్గుతున్నరనే ఆరోపణలు ఉన్నాయి.
వీటికి నిదర్శనమే కరీంనగర్ జిల్లాలో జరిగిన ఓ ఘటన. కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం పోలీస్ స్టేషన్‌లో ఎస్సై ఆరోగ్యం పేరు చెబితేనే ప్రజలు హడలిపోతారు. ఆయన సిన్సియారిటీ చూసి కాదు. ఈయన తీరు వేరే రకం. ఈ మధ్య జరిగిన బదిలీల్లో వేరే ప్రాంతానికి ఎస్సైగా వెళ్లిపోయారు. గత రెండేళ్లుగా సైదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో విధులు నిర్వహించిన ఈయన చేసిన నిర్వాకాలు అన్నీఇన్నీ కావు. బదిలీపై వెళ్లడంతో ఆయన చేసిన అరాచకాలను ప్రజలు వెలుగులోకి తీసుకొస్తున్నారు. ఏదైనా సమస్యతో పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేస్తే ముడుపు కట్టనిదే సమస్య వినిపించుకోరట.
బాధితులు ఏమంటున్నరంటే....
సైదాపూర్ మండల కేంద్రానికి చెందిన ఓ మహిళ తన భర్త మరణించడంతో తమకు చెందాల్సిన భూమిని బావ ఆక్రమించుకున్నారని ఫిర్యాదు చేశారు. సదరు మహిళ బావ వద్ద నుంచి ఎస్ఐ ఆరోగ్యం అధిక మొత్తంలో డబ్బులు తీసుకొని తనకు అన్యాయం చేశారని ఆమె ఆరోపిస్తున్నారు. అంతేకాదు అసభ్యకరమైన మాటలతో చిత్రవధ చేశారని ఆవేదన వ్యక్తంచేశారు. అదే గ్రామానికి చెందిన దంపతులు కుటుంబ సమస్యలతో పోలీస్ స్టేషన్‌కు వెళ్లారు. వీళ్ల వద్ద 60 వేల రూపాయలతోపాటు గొర్రెలు తీసుకున్నారని ఆరోపిస్తున్నారు.
సైదాపూర్ మండలానికి చెందిన వాసుదేవ రెడ్డి, భాస్కర్రెడ్డి మధ్య భూవివాదాలు ఉన్నాయి. కెనడాలో ఉండే వ్యక్తితో చేతులు కలిపి సెటిల్మెంట్ చేసుకోవాలంటూ ఒత్తిడి చేస్తున్నారని భాస్కర్ రెడ్డి ఆరోపిస్తున్నారు. హుజూరాబాద్ ఏసీపీ తనకు ఫోన్ చేసి ఊళ్లో ఉంటావా ఉండవా అంటూ బెదిరించారని రికార్డింగ్స్ చూపించారు. బదిలీలు జరిగిన తర్వాత కూడా ఎస్ఐ ఆరోగ్యం తన ఇంట్లోకి చొరబడి దౌర్జన్యం చేశారంటున్నారు. దాన్ని చిత్రీకరించిన వీడియో డిలీట్ చేసేందుకు ఫోన్ను లాక్కొని డిలీట్ చేశారని చెప్పుకొచ్చారు.
సైదాపూర్ మండలంలో ఎస్ఐ ఆరోగ్యం కొంతమంది అనుచరులను ఏర్పాటు చేసుకున్నారని చెబుతున్నారు బాధితులు. పోలీస్ స్టేషన్‌కు వచ్చిన ఫిర్యాదుల్లో ఎవరైనా ఎస్ఐ ఆరోగ్యం మాట వినకపోతే బెదిరిస్తారని, దాడి చేస్తారని వాపోతున్నారు. అప్పటికీ వినకుంటే పొలాలలో ఉండే బోర్లు కాల్చేస్తారని, పంటలు ధ్వంసం చేస్తారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి అధికారులు పోలీసు వ్యవస్థలో ఉండడం సిగ్గుచేటని ఇలాంటి వారి వల్లే పోలీసులకు చెడ్డ పేరు వస్తుందని అన్నారు.
సైదాపూర్ మండలంలోని ఎస్సై ఆరోగ్యం బాధితులంతా కరీంనగర్ పోలీస్ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. ఏది ఏమైనాప్పటికీ ఓ పోలీస్ అధికారికి సివిల్ మ్యాటర్‌లో తలదుర్చే అధికారం ఉంటుందా? ఒకవేళ అధికారం ఉంటే ఎంతవరకు వారికి అధికారం ఉంటుంది...? ఒకవేళ వీటిని అతిక్రమిస్తే వారిపై ఎలాంటి చర్యలు తీసుకోవచ్చు అనేది చర్చనీయాంశమవుతోంది. ఈ విషయంపై పోలీసు ఉన్నత అధికారులు ఎలా రియాక్ట్ అవుతారు. ఎలాంటి చర్యలు తీసుకుంటారో అన్న విషయం ఆసక్తికరంగా మారింది.
Also Read: నడిరోడ్డుపై వింత ఆకారం - దగ్గరకు వెళ్లి చూస్తే భయం భయం, క్షుద్రపూజల కలకలం!