Siddipet Venkateswara Swamy Temple: వైకుంఠ ఏకాదశి సందర్భంగా మంత్రి హరీష్ రావు పూజలు, వెంకటేశ్వర స్వామికి స్వర్ణ కిరీటం సమర్పణ
Siddipet Venkateswara Swamy Temple: వైకుంఠ ఏకాదశి సందర్భంగా సిద్దిపేట శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో మంత్రి హరీష్ రావు ప్రత్యేక పూజలు చేశారు. స్వర్ణ కిరీటాన్ని స్వామి వారికి సమర్పించారు.
Siddipet Venkateswara Swamy Temple: వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా సిద్దిపేట శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో మంత్రి హరీష్ రావు ఉత్తర ద్వార దర్ననం చేసుకున్నారు. ఈరోజు వేకువ జామునే ఆలయానికి చేరుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఆ తర్వాత స్వామి వారికి స్వర్ణ కిరీటాన్ని సమర్పించారు. ఆలయానికి చేరుకున్న మంత్రికి ఆలయ అర్చకులు ఘన స్వాగతం పలికారు. అలాగే పూజల అనంతరం మంత్రి హరీష్ రావుకు వేదాశీర్వచనంతో పాటు తీర్థ, ప్రసాదాలను అందజేశారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా రాష్ట్రంలోని ఆలయాలన్నీ కిటకిటలాడుతున్నాయి. నిత్యం శ్రీహరిని పూజిస్తే ఇంటా, బయట ఎదుర్కుంటున్న సమస్యలు, కష్టాలు దూరం అవుతాయని భక్తుల విశ్వాసం. సంపదతో పాటు సంతోషాలు కూడా వెల్లివరుస్తాయని భక్తుల నమ్మకం.
వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా సిద్దిపేట శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఉత్తర ద్వార దర్శనం, స్వామి వారికి స్వర్ణ కిరీటం సమర్పణ. pic.twitter.com/bMNUleAb8e
— Harish Rao Thanneeru (@trsharish) January 2, 2023
వైకుంఠ ఏకాదశి పరమార్థం..
మనుషులకు ఏడాది సమయం దేవతలకు ఒక్కరోజుతో సమానం. అందుకే... మన ఆరునెలలు దేవతలకు పగలు, మరో ఆరునెలలు రాత్రి. దీని ప్రకారం దక్షిణాయనం అంతా దేవతలకు రాత్రి..ఉత్తరాయణం అంతా పగలుగా చెబుతారు పండితులు. దీని ప్రకారం వైకుంఠ ఏకాదశి రోజు దక్షిణాయనం నుంచి ఉత్తరాయణ పుణ్యకాలం ప్రవేశించే సమీపానికి వచ్చారని అర్థం. అంటే చీకటి నుంచి వెలుగులోకి వచ్చారన్నమాట. శ్రీ మహావిష్ణువు నిద్రనుంచి లేచి వైకుంఠ ద్వారం తెరుచుకున్న రోజు. స్వర్గద్వారాలు తెరిచే రోజు. ఇందుకు సూచనగా వైష్ణవ ఆలయాల్లో వైకుంఠ ద్వారాన్ని తెరిచి ఉంచుతారు...ఈ ద్వారం గుండా లోపలకు వెళ్లి స్వామివారిని దర్శించుకుంటే సకలపాపాలు హరించి పుణ్యం ప్రాప్తిస్తుందని భక్తుల విశ్వాసం.
ఉత్తర ద్వార దర్శనం ఎందుకు చేసుకోవాలి..?
ముక్కోటి ఏకాదశి రోజున ఎక్కువ మంది భక్తులు ఉత్తర ద్వారం గుండా శ్రీమన్నారాయణుని దర్శించుకోవాలని ఆరాటపడుతుంటారు. శ్రీ మహావిష్ణువు కొలువై ఉన్న వైకుంఠంలోని వాకిళ్లు ఈరోజునే తెరుచుకుంటాయని చెబుతారు. వైకుంఠం వాకిళ్లు తెరుచుకునే పర్వదినం రోజున శ్రీమహావిష్ణువు గరుడ వాహనంపై మూడు కోట్ల దేవతలతో భూలోకానికి వచ్చి భక్తులకు దర్శనమిస్తాడు. రాక్షసుల బాధలు భరించలేక దేవతలంతా ఉత్తర ద్వారం దాటి శ్రీమన్నారాయణుడిని దర్శించుకుని తమ బాధలు విన్నవించుకున్నారు. అనుగ్రహించిన శ్రీ మహావిష్ణువు ఆ పీడ వదిలించాడని.. అందుకే ఉత్తర ద్వార దర్శనం చేసుకుంటే మనల్ని పట్టిపీడిస్తున్న ఎన్నో సమస్యలు తీరిపోతాయని భక్తుల విశ్వాసం.
ఉపవాసం ఎందుకుండాలి..?
వైకుంఠ ఏకాదశి రోజు రాక్షసుడు ''ముర'' బియ్యంలో దాక్కుంటాడని, అందుకే బియ్యంతో చేసిన ఏ పదార్థం తిన కూడదని అంటారు. ఈ రోజున ఉపవాసం ఉంటే మిగతా 23 ఏకాదశులు ఉపవాసం ఉన్నట్టే అని చెబుతోంది విష్ణుపురాణం. ''ముర'' అనే రాక్షస గుణాన్ని ఉపవాసం, జాగరణ ద్వారా జయిస్తే సత్వగుణం లభించి ముక్తి మార్గం తెరుచుకుంటుందని చెబుతారు. వైకుంఠ ఏకాదశి రోజున నియమనిష్టలతో వ్రతమాచరించే వారికి మరో జన్మంటూ ఉండదని మాత్రమే కాదు.. ఈ రోజు మరణించే వారికి వైకుంఠం సిద్ధిస్తుందని చెబుతారు. అందుకే వైకుంఠ ఏకాదశి అంత ప్రత్యేకం. 2023లో వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి జనవరి 2 సోమవారం వచ్చింది.