Ramagundam: రామగుండం స్కాంకు రాజకీయ రంగు! నువ్వంటే నువ్వే కారణమంటూ ఒకటే పోరు
Ramagundam: దాదాపుగా 280 మంది కాంట్రాక్టు కార్మికులను ఆకస్మికంగా తొలగించడంతో పైసలు వసూలు చేసిన వ్యవహారం బయటకు వచ్చిన విషయం తెలిసిందే.
Ramagundam News: రామగుండంలో ప్రభుత్వ ఉద్యోగాల్లో జరిగిన స్కాం రాజకీయ రంగు పులుముకుంటోంది. దీనికంతటికీ కారణం మీరంటే మీరే అంటూ అధికార టీఆర్ఎస్ ప్రతిపక్ష బీజేపీ నాయకుల మధ్య పోరు తీవ్ర స్థాయికి చేరింది. దాదాపుగా రెండు వందల ఎనభై మంది కాంట్రాక్టు కార్మికులను ఆకస్మికంగా తొలగించడంతో పైసలు వసూలు చేసిన వ్యవహారం బయటకు వచ్చిన విషయం తెలిసిందే. అయితే టీఆర్ఎస్ ఎమ్మెల్యే చందర్ పై ఆరోపణలు రావడంతో ప్రెస్ మీట్ పెట్టి మరి వాటిని ఖండించారు. మరోవైపు 18 మందితో కూడిన విచారణ కమిటీని వేయడమే కాకుండా తన పార్టీకి చెందిన ఎలాంటి స్థాయి నాయకుడు అయినా ఇందులో దోషిగా తేలితే ఖచ్చితంగా సస్పెండ్ చేయడం గ్యారెంటీ అంటూ ప్రజల ముందుకు వచ్చారు. అవసరం అయితే పోలీసులకు ఫిర్యాదు చేసి మరీ అసలైన నిందితులను దొరకపడతామంటూ హెచ్చరించారు. తనను రాజకీయంగా ఎదుర్కోలేకే తప్పుడు ఆరోపణలు చేస్తూ కొందరు నాయకులు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని వారి బండారం త్వరలోనే బయట పెడతానంటూ సవాల్ విసిరారు.
మరోవైపు అధికారాన్ని అడ్డుపెట్టుకొని అందిన కాడికి గుంజుతూ అమాయకులను మోసం చేస్తున్నారని ఆర్టీసీ మాజీ చైర్మన్ సోమారపు సత్యనారాయణ మండిపడ్డారు. పెద్దపల్లి జిల్లా రామగుండం ఎరువుల కర్మాగారంలో పర్మనెంట్ ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ అధికార పార్టీకి చెందిన కొంతమంది నాయకులు దళారులుగా మారి నిరుద్యోగుల నుండి లక్షలు వసూలు చేశారని ఆయన ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వ పెద్దల అండదండలతో ఎమ్మెల్యే అనుచరులమంటూ కార్యకర్తలు విజృంభిస్తున్నారని సత్యనారాయణ మండిపడ్డారు. ఆర్ ఎఫ్ సి ఎల్ లో శాశ్వత ఉద్యోగం వస్తుందని నిరుద్యోగ యువకులు భూములు, బంగారం అమ్ముకొని లక్షల రూపాయలు దళారుల చేతిలో పెట్టారని, సంవత్సరం తిరగకముందే వారిని ఇంటికి పంపించారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
ఉద్యోగాల పేరుతో 500 మంది కార్మికులను మోసం చేశారని అన్నారు. ఉద్యోగాల స్కామ్ లో ఎమ్మెల్యే చందర్ పాత్ర ఉందని ప్రజలు బాహాటంగానే చెప్పుకుంటున్నారని, విచారణ జరిపించి చందర్ ను జైల్లో పెట్టాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారని అన్నారు. కేంద్ర ప్రభుత్వ సంస్థ ఆర్ ఎఫ్ సీ ఎల్ ఉద్యోగాల గోల్మాల్ లో సీబీఐ విచారణ జరిపించాలని ఆయన కోరారు. రాష్ట్ర ప్రభుత్వం ఆర్ ఎఫ్ సీ ఎల్ కార్మికులకు న్యాయం జరిగేలా చొరవ తీసుకోవాలని లేని పక్షంలో బీజేపీ బాధితుల పక్షాన పోరాటాలు కొనసాగిస్తుందని ఆయన హెచ్చరించారు.
అసలేంటి గొడవ?
కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన ఆర్ ఎఫ్ సీ ఎల్ తిరిగి ప్రారంభం కావడంతో పలువురు నిరుద్యోగుల్లో అందులో ఉద్యోగాలపై ఆశ పెరిగింది. దీని కోసం కొందరు దళారులు స్థానిక నేతల అండదండలతో 8 నుండి 12 లక్షల వరకు వసూలు చేశారని అని ఆరోపణలు వెల్లువెత్తాయి. అయితే అది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగంపైగా 25 వేల జీతంతో పాటు క్వార్టర్స్ ఇతర అన్ని సౌకర్యాలు లభిస్తాయి అంటూ చెప్పడంతో తాము భారీ మొత్తంలో నగదు సమర్పించుకున్నామని బాధితులు వాపోయారు. ఇదంతా కూడా ఒక సంవత్సరం పాటు పనిచేసిన తర్వాత కొందరు కాంట్రాక్టు కార్మికులను యజమాన్యం తొలగించడంతో బయటపడింది. ఇక బాధితులంతా ఒక గ్రూపుగా ఏర్పడి నిరసనలు ధర్నాలకు సైతం దిగారు. ఇక అప్పటి నుండి మొదలైన ఆరోపణల పర్వం అధికార టీఆర్ఎస్ నాయకులపై మాటల దాడికి ప్రతిపక్ష కాంగ్రెస్ బీజేపీ నాయకులకు అవకాశం ఇచ్చినట్లయింది. అవసరమైతే గవర్నర్ ని సైతం కలిసి దీనిపై కేంద్ర స్థాయి సంస్థలతో విచారణ చేయాలంటూ కోరతామని కార్మిక సంఘాలు హెచ్చరిస్తున్నాయి.