Telangana Politics : కరీంనగర్‌లో దేవుడు చుట్టూ రాజకీయాలు - గంగులకు చెక్ పెట్టేందుకు పొన్నం ప్రయత్నం
Karim Nagar : కరీంనగర్ జిల్లాలో రాజకీయాలు దేవుడి చుట్టూ తిరుగుతున్నాయి. వెంకటేశ్వరుని బ్రహ్మోత్సవాల విషయంలో పొన్నం ప్రభాకర్ పట్టదలకు పోతున్నారు.
![Telangana Politics : కరీంనగర్‌లో దేవుడు చుట్టూ రాజకీయాలు - గంగులకు చెక్ పెట్టేందుకు పొన్నం ప్రయత్నం Minister Ponnam, Former Minister Gangula War For Venkanna Brahmotsavam Telangana Politics : కరీంనగర్‌లో దేవుడు చుట్టూ రాజకీయాలు - గంగులకు చెక్ పెట్టేందుకు పొన్నం ప్రయత్నం](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/02/08/cbb6dad64331e1779cecb2b6f7881ba01707374636435840_original.png?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Karimnagar Politics : కరీంనగర్ (Karimnagar)జిల్లాలో రాజకీయాలు రంజుగా మారుతున్నాయి. రవాణ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ (minister ponnam prabhakar), మాజీ మంత్రి గంగుల కమలాకర్ (Former Minister Gangula Kamalakar) మధ్య వార్ జరుగుతోంది. ఎవరికి వారే ఎత్తుకు పైఎత్తులు వేసుకుంటున్నట్లు స్థానికులు చెప్పుకుంటున్నారు. మొన్నటి వరకు కరీంనగర్ జిల్లాలో గంగులా కమలాకర్ చక్రం తిప్పితే... ఇప్పుడు మంత్రి పొన్నం ప్రభాకర్ వంతు వచ్చింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాపై పట్టు సాధించేందుకు పొన్నం ప్రభాకర్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు.
గతంలో వ్యక్తిగతంగా వెంకన్న బ్రహ్మోత్సవాలు నిర్వహించిన కమలాకర్
మాజీ మంత్రి గంగుల కమలాకర్ కు చెక్ పెట్టేలా...ఎత్తులు వేస్తున్నారు. ఆ పార్టీ ఈ పార్టీ అనే తేడా లేకుండా నాయకులంతా...అఖిలాండ కోటి బ్రహ్మండ నాయకుడు వెంకటేశ్వర స్వామి చుట్టూ రాజకీయాలు నడుపుతున్నారు. స్వామి వారి బ్రహ్మోత్సవాల అంశంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల మధ్య పోటీ నడుస్తోంది. ప్రతీ ఏటా కరీంనగర్‌లోని మార్కెట్ రోడ్డులో ఉన్న శ్రీ వెంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలను...మాజీ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఆధ్వర్యంలో జరిగేవి. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి టీటీడీ నుంచి అర్చకులను పిలిపించి ...ఏనుగు అంబారీల ఊరేగింపుతో వెంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించేవారు. రాష్ట్రంలో అధికార మార్పిడి జరగడంతో...ఆ ప్రభావం కరీంనగర్‌లో నిర్వహించే వెంకన్న బ్రహ్మోత్సవాలపై పడింది.
ఇప్పుడు ప్రభుత్వమే నిర్వహిస్తుందన్న పొన్నం
బీఆర్ఎస్ ప్రతిపక్షానికే పరిమితం అయినా...కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో మాత్రం...గంగుల కమలాకర్ శాసనసభ్యుడిగా గెలుపొందారు. ప్రతి సంవత్సరం మాదిరిగానే...ఈ సారి కూడా వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలను ఈ నెలలోనే నిర్వహించాలని భావించారు. అయితే మంత్రి పొన్నం ప్రభాకర్ రూపంలో సమస్యలు వస్తున్నట్లు తెలుస్తోంది. నగరానికే చెందిన పొన్నం ప్రభాకర్...హుస్నాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి పదవి దక్కించుకున్నారు. దీంతో కరీంనగర్ రాజకీయాల్లో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. వెంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలపై పొన్నం ఆరా తీశారు. ఆ ఉత్సవాలను ఈసారి ప్రభుత్వం నిర్వహిస్తుందని ప్రకటించడంతో అసలు కథ మొదలైంది. ఆలయ అధికారులను పిలిపించుకొని పొన్నం మాట్లాడినట్లు తెలుస్తోంది. ప్రభుత్వం ఉండగా.. దేవాదాయశాఖ పరిధిలోని ఆలయంలో ఇతరులెలా ఉత్సవాన్ని నిర్వహిస్తారంటూ...అధికారులను ప్రశ్నించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఏడు రోజుల పాటు వెంకటేశ్వరస్వామి ఉత్సవాలను మంత్రి హోదాలో పొన్నం ఆధ్వర్యంలో నిర్వహించేందుకు రెడీ అయినట్లు తెలుస్తోంది. గతంలో పన్నెండు రోజుల పాటు నిర్వహించే ఈ ఉత్సవాలను.. ఇప్పుడు కుదించడంపై బీఆర్ఎస్ శ్రేణులు మంత్రి పొన్నం ప్రభాకర్ పై విమర్శలు చేస్తున్నాయి.
దేవుడి చుట్టూ రాజకీయాలు
దేవుడు సెంట్రిక్‌గా మంత్రి వర్సెస్ మాజీ మంత్రిగా మారిన రాజకీయాలు...కరీంనగర్‌లో కొత్తేమీకాదు. ఈ ట్రెండ్ దాదాపు 15 ఏళ్ల క్రితమే ప్రారంభమైందట. బండి సంజయ్...బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా, కరీంనగర్ ఎంపీగా ఎదగడానికి దైవానుగ్రహమే కారణమని ఆయన చెప్పుకున్నారు. బండి నేతృత్వంలో నిర్మించి, నిర్వహిస్తున్న మహాశక్తి ఆలయ ముగ్గురమ్మల దీవెనలే కారణమని బండి సంజయ్ బలంగా నమ్ముతారు. అంతకుముందు అలాంటి ఆలోచనలు లేని గంగుల...తానూ ఆధ్యాత్మిక కార్యక్రమాలను మొదలుపెట్టారు. తొలుత గణేష్ నవరాత్రులు, దుర్గా నవరాత్రులను స్టార్ట్ చేసి.. తర్వాత వెంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలను అన్నీ తానై జరిపే స్థాయికి వెళ్లారు. కరీంనగర్‌లో బీజేపీ స్ట్రాంగ్‌గా ఉన్నప్పటికీ గంగుల విజయం సాధించడానికి...వెంకటేశ్వరస్వామి ఉత్సవాలే కారణమని నమ్ముతారు. గతంలో బండి వర్సెస్ గంగుల సాగిన ఆధ్యాత్మిక రాజకీయాలు...ఇప్పుడు కొత్త టర్న్ తీసుకుని...ట్రయాంగిల్‌గా మారాయి.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)