Thandel: 'తండేల్' రియల్ స్టోరీ... చేపల కోసం వెళ్ళి పాకిస్థాన్ చెరలో చిక్కుకున్న ఆ మత్స్యకారుడు ఎవరో తెలుసా?
Thandel: యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన 'తండేల్' సినిమాకు ఇన్స్పిరేషన్‌గా నిలిచిన మత్స్యకారుడు చోడిపిల్లి ముసలయ్య రియల్ స్టోరీ ఏంటో తెలుసా?

అక్కినేని నాగచైతన్య - సాయి పల్లవి జంటగా నటించిన 'తండేల్' థియేటర్లలోకి వచ్చింది. అయితే మూవీని అనౌన్స్ చేసినప్పుడే ఇది వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కుతోందన్న విషయాన్ని మేకర్స్ వెల్లడించారు. సముద్రంలో చేపలు పట్టడానికి వెళ్లి, తెలియకుండానే పాకిస్థాన్ జలాల్లోకి ఎంటరయ్యి కష్టాల ఊబిలో కూరుకుపోయిన శ్రీకాకుళం మత్స్యకారుల రియల్ లైఫ్ ఆధారంగా మూవీని తెరకెక్కించారు. అయితే మూవీకి ఇన్స్పిరేషన్ గా నిలిచింది మాత్రం శ్రీకాకుళం మత్స్యకారుడు చోడిపిల్లి ముసలయ్య.
పని కోసం వెళ్ళి... పాక్ చెరలో!
సరిగ్గా 15 ఏళ్ల 2000లో 21 ఏళ్ల వయసున్న ముసలయ్య అనే జాలరి పనిని వెతుక్కుంటూ గుజరాత్ కి వెళ్ళాడు. ఆ టైంలో మత్స్యకారులకు సరిహద్దులను ట్రాక్ చేయడానికి జిపిఎస్ అందుబాటులో ఉండేది కాదట. దీంతో చేపలు పట్టడానికి సముద్ర జలాల్లోకి వెళ్లిన మత్స్యకారులు తరచుగా విదేశీ జనాల్లోకి వెళ్లేవారట. అదే ఏడాది నవంబర్లో 6 పడవల్లో, 30 మందితో కలిసి అతను చేపల వేటకి వెళ్ళాడు. తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో పెద్దపెద్ద శబ్దాలు రావడంతో అందరూ మేల్కొన్నారట. అసలు ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితిలో కళ్ళు తెరిచి చూస్తే, వారిని పాకిస్థాన్ కోస్ట్ గార్డ్స్ చుట్టుముట్టారు.
మొత్తం 25 మంది మత్స్యకారులను పాకిస్థాన్ కోస్ట్ కార్డులు బందీలుగా పట్టుకున్నారు. అంతే కాకుండా ఆ పడవ డ్రైవర్లను వెంబడించమని అధికారులను ఆదేశించారు. అయితే డ్రైవర్లు మాత్రం ఎలాగో అక్కడి నుంచి తప్పించుకుని బయట పడ్డారు. ఇక పాకిస్థాన్ తీరానికి ప్రయాణించేలోపు బందీలుగా పట్టుకున్న జాలర్లకు చుక్కలు చూపించారట. పదేపదే కొట్టడంతో పాటు రోజంతా ఆహారం కాదు కదా, కనీసం నీళ్లు కూడా ఇవ్వలేదట. ఇక ఒడ్డుకు చేరుకున్న తర్వాత వాళ్ళని పాకిస్థాన్ స్థానిక జైల్లో ఉంచారు. ఆ తర్వాత చట్టపరమైన లాంఛనాలు పూర్తి చేసి, వారిని కరాచీ జైలుకు తరలించారు. మరోవైపు పాక్ అధికారులకు పట్టుబడ్డ 25 మంది మత్స్యకారుల కుటుంబాల పరిస్థితి అయోమయంలో పడింది. వాళ్ళు ఎప్పుడు ఇంటికి తిరిగి వస్తారు? అసలు వస్తారా లేదా? అనేది తెలియకపోవడంతో కన్నీరు మున్నీరు అయ్యారు.
జైల్లో నరకయాతన అనుభవించి...
జైల్లో ఖైదీలుగా ఉన్న ఆ మత్స్యకారులకు చపాతీ, కూర, టీ వంటి చాలీచాలని ఫుడ్ పెట్టేవారట. రాత్రి భోజనం టైంలో రెండంటే రెండు చపాతీలు మాత్రమే ఇచ్చేవారట. పోషకాహారం సరిగ్గా లేకపోవడంతో చాలామంది మత్సకారులు ఆ టైంలో అనారోగ్యానికి గురయ్యారట. కనీసం సరైన దుస్తులు కూడా ఇచ్చేవారు కాదట. దీంతో పాక్ ఖైదీలు వదిలేసిన దుస్తులను వీళ్ళు వాడుకునే వారట. అప్పట్లో కరాచీ జైల్లో రాత్రిపూట నిద్రపోవడం కూడా కష్టంగా ఉండేదట. ఖైదీలతో కిక్కిరిసిపోవడంతో నిద్రపోవడానికి స్థలం సరిపోయేది కాదట. ఇలాగే ఒక సంవత్సరం పాటు అక్కడే కష్టపడ్డారు ఆ మత్స్యకారులు. ఆ తర్వాత 2022 ఫిబ్రవరిలో ముసలయ్యతో పాటు ఇతర జాలర్లు కూడా కరాచీ జైలు నుంచి రిలీజ్ అయ్యారు. జైలు పాలైన వారిలో 1500 మంది జనాభా కలిగిన కండువాని పేట గ్రామానికి చెందిన ఐదుగురు మత్సకారులు కూడా ఉన్నారట.





















