Delhi Election Results: మనం మనం కొట్లాడుకుంటే ఇట్లుంటాది - ఢిల్లీ ఫలితాలపై ఒమర్ అబ్దుల్లా మీమ్ రిప్లై
Delhi Election Results : ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల ప్రక్రియ కొనసాగుతుండగా.. జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా కీలక వ్యాఖ్యలు చేశారు. ఇండియా కూటమిపై విమర్శలు చేశారు.

Delhi Election Results : ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెల్లడయ్యేందుకు సమయం సమీపించింది. ఎర్లీ ట్రెండ్స్ లో బీజేపీ ఆధిక్యంలో కొనసాగుతుండగా.. తర్వాతి స్థానంలో ఆప్ ఉంది. బీజేపీ ఇప్పటివరకు దాదాపు 43 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా, ఆప్ 26, కాంగ్రెస్ ఒక స్థానంలో ఆధిక్యంలో ఉన్నాయి. ఢిల్లీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి 36 సీట్లు అవసరం. ఈ నేపథ్యంలో ఢిల్లీలో ప్రభుత్వ ఏర్పాటుకు కావల్సిన మేజిక్ ఫిగర్‌ను బీజేపీ దాటేసినట్లు కనిపిస్తోంది. ఈ ఉత్కంఠ సమయంలో నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ నేత, జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ఢిల్లీ ఫలితాలపై సంచలన ట్వీట్ చేశారు. ఎన్నికల సమయంలో ఇండియా అలయన్స్‌లో స్పష్టంగా కనిపించిన విభేదాలపై ఆయన వ్యంగ్య వ్యాఖ్యలు చేశారు.
ఇండియా కూటమిపై తీవ్ర విమర్శలు చేసిన ఒమర్ అబ్దుల్లా.. మనం మనం కొట్లాడుకుంటే ఫలితాలు ఇలానే ఉంటాయని చెప్పారు. ఇంకా కొట్లాడుకోండి.. ఇంకా దారుణాలు ఫలితాలు వస్తాయని హెచ్చరించారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియాలో పోస్టులో రామాయణం వీడియోలోని ఓ gif ని షేర్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్టు అన్ని ప్లాట్ ఫారమ్స్ లోనూ తెగ వైరల్ అవుతోంది.
Aur lado aapas mein!!! https://t.co/f3wbM1DYxk pic.twitter.com/8Yu9WK4k0c
— Omar Abdullah (@OmarAbdullah) February 8, 2025
ఎన్నికల ప్రచారం సందర్భంగా, ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్, కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ దేశ రాజధానిలో యమునా నది పరిశుభ్రతతో పాటు ఇతర అంశాలపై ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకున్నారు. ఇకపోతే అంతకుముందు, కూటమిలో ఎజెండా, నాయకత్వంపై స్పష్టత లేదని అబ్దుల్లా ఆరోపించారు. "ఇండియా బ్లాక్ సమావేశం జరగడం లేదు. స్పష్టత పొందడానికి ఒక సమావేశం ఏర్పాటు చేస్తే బాగుంటుంది. ఈ కూటమి పార్లమెంటరీ ఎన్నికల కోసమే అయితే మనం దీన్ని ముగించాలి. లేకపోతే, అసెంబ్లీ ఎన్నికలకు కూడా అయితే మనం కలిసి పనిచేయాలి" అని ఆయన అన్నారు.
హోరాహోరీగా ఎన్నికల కౌంటింగ్
ఇక దేశ రాజధాని ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ రసవత్తరంగా సాగుతోంది. ఆప్ అగ్రనేతలంతా వెనుకంజలో ఉండగా.. అరవింద్ కేజ్రీవాల్, సీఎం అతిశీ, మనీశ్ సిసోడియా తదితరులపై ప్రత్యర్థులు ఆధిక్యంలో కొనసాగుతున్నారు. కేజ్రీవాల్ మీద పోటీ చేసిన బీజేపీ అభ్యర్థి పర్వేష్ వర్మ, కాల్కాజీలో ఫస్ట్ రౌండ్ ట్రెండ్స్ సీఎం ఆతిషి కన్నా రమేష్ బిధూరి ముందంజలో ఉన్నారు. ఓట్ల లెక్కింపు మొదలైన గంట తర్వాత కూడా కేజ్రీవాల్ వెనుకంజలోనే ఉండడం గమనార్హం. మరోపక్క ఢిల్లీలో తెలుగువాళ్లున్న స్థానాల్లోనూ బీజేపీ ఆధిక్యం ప్రదర్శిస్తోంది. చంద్రబాబు ప్రచారం చేసిన షహదరాలోనూ బీజేపీ దూసుకుపోతోంది. ఇప్పటికే ఆ పార్టీ మ్యాజిక్ ఫిగర్ 36ను దాటి.. సుమారు 26ఏళ్ల తర్వాత ఢిల్లీలో కాషాయ జెండా ఎగురవేసేందుకు సిద్ధమవుతోంది. కేంద్ర బడ్జెట్‌లో పన్ను మినహాయింపులు, ఆప్‌పై వ్యతిరేకత బీజేపీకి బాగా కలిసొచ్చాయని తెలుస్తోంది.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

