Medak Crime News: మెదక్ జిల్లాలో విషాధం - పెళ్లికి పెద్దలు ఒప్పుకోలేదని ప్రేమ జంట ఆత్మహత్య
Medak Crime News: మెదక్ జిల్లా నార్సింగిలో విషాధం చోటు చేసుకుంది. తల్లిదండ్రులు తమ ప్రేమ పెళ్లికి అంగీకరించకపోవడంతో మనస్తాపం చెందిన జంట ఆత్మహత్య చేసుకుంది.
Medak Crime News: మెదక్ జిల్లా నార్సింగిలో విషాదం చోటుచేసుకుంది. ఫిబ్రవరి 14వ తేదీన ప్రేమికుల దినోత్సవం రోజు నుంచి కనిపించకుండా పోయిన ప్రేమ జంట అదృశ్యం కేసు విషాదాంతంగా ముగిసింది. తమ పెళ్లికి పెద్దలు ఒప్పుకోకపోవడంతో తీవ్ర మనస్తాపం చెందిన జంట.. చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. గురువారం ఉదయం నార్సింగి చెరువులో నుంచి ప్రేమ జంట మృతదేహాలను వెలికితీశారు.
అసలేం జరిగిందంటే..?
జిల్లాలోని నార్సింగికి చెందిన కల్పన, ఖలీల్ గత కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు. అయితే వీరద్దరి ప్రేమ విషయం ఇరుకుటుంబాల్లో తెలిసిపోయింది. మతాలు వేరు కావడంతో వీరి పెళ్లికి పెద్దలు ఒప్పుకోలేదు. ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు పెళ్లి చేసుకునేందుకు మేము ఒప్పుకోమంటూ చెప్పారు. దీంతో జంట తీవ్ర మనస్తాపానికి గురైంది. కలిసి జీవించలేని తాము కనీసం చావుతోనైనా ఒకటవుదామని భావించారు. ఈ క్రమంలోనే ప్రేమికుల దినోత్సవం నాడే ఈ ప్రేమ జంట ఇంట్లో నుంచి వెళ్లిపోయారు. ఇద్దరూ కలసి నార్సింగి చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారు. అయితే పిల్లలు కనిపించకపోవడంతో.. ఇరు కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. వాళ్ల సెల్ ఫోన్ సిగ్నల్ ఆధారంగా వాళ్లు ఎక్కడున్నది తెలుసుకున్నారు. వెళ్లి చూసే సరికి కల్పన, ఖలీల్ చెరువులో మృతదేహాలై తేలారు. ఇదే విషయాన్ని పోలీసులు ఇరుకుటుంబ సభ్యులకు తెలియజేశారు. ఆపై మృతదేహాలను బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరిలంచారు. చేతికి అంది వచ్చిన పిల్లలు.. ఇలా చలనం లేకుండా పడి ఉండడం చూసి ఇరుకుటుంబాల తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపించారు.
నాలుగు రోజుల క్రితమే యువకుడి ఆత్మహత్యే - ప్రేయసి పెళ్లే కారణం
వికారాబాద్ జిల్లా, చౌడపూర్ గ్రామానికి చెందిన ప్రవీణ్ అనే యువకుడు చిన్నప్పుడే తల్లిదండ్రులను కోల్పోయాడు. కొంతకాలం నుంచి ఓ అమ్మాయిని ప్రేమిస్తున్నాడు. వీరిద్దరూ కొంతకాలం కలిసి షికార్లు చేశారు. ప్రేమలో ముగినితేలుతున్నా కెరీర్ మీద ఫోకస్ తప్పలేదు ప్రవీణ్. కానిస్టేబుల్ ఎగ్జామ్ రాసి ప్రిలిమ్స్ క్వాలిఫై అయ్యాడు. ఈవెంట్స్ సైతం పూర్తి చేసుకుని, మెయిన్స్ కు ప్రిపేర్ అవుతున్నట్లు సమాచారం. కానీ ఈ క్రమంలో ప్రేమించిన యువతి ప్రవీణ్ ను మోసం చేసింది. ప్రాణంగా ప్రేమించిన అమ్మాయి తనను కాదని మోసం చేసి వేరే అబ్బాయి సన్నిహితంగా ఉంటూ అతడితో వివాహానికి సిద్దమైంది. ఈ విషయాన్ని ప్రియుడు జీర్ణించుకోలేక పోయాడు.
సెల్ఫీ వీడియో, ఆత్మహత్య..
ప్రాణంగా ప్రేమించిన అమ్మాయి తనను మోసం చేసిందని తీవ్ర మనస్తాపానికి గురై పెద్ద నిర్ణయం తీసుకున్నాడు ప్రవీణ్. ఇక జీవితం వద్దనుకుని చనిపోవాలని నిర్ణయించుకున్నాడు. ఇంట్లో ఫ్యాన్ కు ఉరి వేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు ప్రవీణ్. రాజేంద్రనగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. యువకుడి ఆత్మహత్య చేసుకున్న చోట సూసైడ్ నోట్ తో పాటు తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు సెల్ఫీ వీడియో తీసుకున్నట్లు గుర్తించారు.