(Source: ECI/ABP News/ABP Majha)
Rasamayi Balakishan: ఎమ్మెల్యే రసమయి కారుపై చెప్పుల దాడి! మూకుమ్మడిగా ఎగబడ్డ యువకులు
గన్నేరువరం నుండి గుండ్లపల్లికి డబుల్ లేన్ రోడ్డు నిర్మాణాన్ని చేపట్టాలని కోరుతూ యువజన సంఘాలు ఆందోళనలు రోడ్డుపై ఆందోళన చేస్తున్నాయి.
మానకొండూర్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ కాన్వయ్ పై చెప్పుల దాడి జరిగింది. కొంత మంది యువకులు ఆయన కాన్వాయ్‌పై చెప్పులు విసిరారు. దీంతో పోలీసులు వెలంటనే స్పందించి యువకులపై లాఠీఛార్జ్ చేశారు. దీంతో ఉద్రిక్తత పరిస్థితి ఏర్పడింది. కరీంనగర్ జిల్లా గుండ్లపల్లిలో ఈ ఘటన జరిగింది. స్థానికంగా డబుల్ రోడ్డు నిర్మాణం కోసం యువజన సంఘాలు ఎమ్మెల్యే కారుపై దాడికి యత్నించారు. దీంతో పోలీసులు యువజన సంఘాలపై లాఠీ చార్జీకి దిగారు. ఈ ఘటనతో గ్రామంలో ఉద్రిక్తత ఏర్పడింది.
గన్నేరువరం నుండి గుండ్లపల్లికి డబుల్ లేన్ రోడ్డు నిర్మాణాన్ని చేపట్టాలని కోరుతూ యువజన సంఘాలు ఆందోళనలు రోడ్డుపై ఆందోళన చేస్తున్నాయి. ఈ ఆందోళనలకు కాంగ్రెస్ నేత కవ్వంపల్లి సత్యనారాయణ మద్దతు ప్రకటించారు. అదే సమయంలో ఆ ధర్నా జరుగుతుండగా, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ హైదరాబాద్ వెళ్లే క్రమంలో ఆ వైపుగా వచ్చింది. అక్కడే ట్రాఫిక్ లో చిక్కుకున్నారు. ట్రాఫిక్ లో చిక్కుకున్న ఎమ్మెల్యేను చూసి ఆగ్రహానికి గురైన యువకులు కారు వెంట పరుగులు తీశారు. దాడులు చేశారు. అనంతరం పోలీసుల వారిని నిలువరించడంతో రసమయి వాహనంలో వెళ్లిపోయారు. ఈ నేపథ్యంలో ధర్నా చేస్తున్న యువకులను పోలీసులు చెదరగొట్టి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. దీంతో కాసేపు అక్కడ తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.
అయితే మహా ధర్నాతో తనను అడ్డుకోవటంపై ఎమ్మెల్యే రసమయి బాల కిషన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రహదారి కోసం తాను ఇప్పటికే ప్రతిపాదనలు పంపానని వివరణ ఇచ్చారు. కాంగ్రెస్ అధ్యక్షుడు సత్యనారాయణ తీరుపై రసమయి మండిపడ్డారు. కొంతమంది కావాలనే రాద్ధాంతం చేస్తున్నారని ఆరోపించారు.
మునుగోడు ఎన్నికల సమయంలో ఫిర్యాదులు
ఇటీవల మునుగోడు ఉప ఎన్నిక సందర్భంగా మానకొండూరు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌పై ఓ కాంగ్రెస్ నాయకుడు ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేశారు. మునుగోడు ఉప ఎన్నికల ప్రచారంలో దోనిపాముల గ్రామంలో టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల తరపున రసమయి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారని, ఆ గ్రామానికి రెండు కోట్లు తెచ్చి అభివృద్ధి చేస్తానని ప్రజలకు హామీ ఇచ్చారని ఫిర్యాదు చేశారు. అయితే, బాధ్యతాయుతమైన ఎమ్మెల్యే పదవిలో ఉండి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని, ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవాలని బెజ్జంకి మండలానికి చెందిన కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి పోతిరెడ్డి రాజశేఖర్ రెడ్డి ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేశారు.
రాజీనామా చేయాలంటూ ఫోన్ కాల్స్ కూడా
మునుగోడు ఉప ఎన్నికల సందర్భంగా ఆ మధ్య చాలా మంది ప్రజా ప్రతినిధులకు గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్ చేసి నువ్వు కూడా రాజీనామా చేయాలని కొంత మంది ఎమ్మెల్యేలు, మంత్రులను కోరిన సంగతి తెలిసిందే. అలా మానకొండూరు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ కూడా ఆ కాల్స్ ఎదుర్కొన్న వారిలో ఉన్నారు. మీరు రాజీనామా చేస్తేనే మాకు అభివృద్ధి జరుగుతుందంటూ ఓ వ్యక్తి ఫోన్ చేసి మాట్లాడారు. దానికి సంబంధించిన ఆడియో కూడా సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది.