Karimnagar: రోడ్డు ప్రమాదంతో ఓ సీనియర్ నేత కుమారుడి జీవితం అంధకారం.. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ఆదుకోవాలని విజ్ఞప్తి
రోడ్డు ప్రమాదంతో ఓ సీనియర్ నేత కుమారుడు జల్లి అజయ్ జీవితం అంధకారంగా మారింది. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ సాయం చేయాలని కుటుంబసభ్యులు కోరుతున్నారు.
Karimnagar EX ZPTC Member Jalli Peddulus Son Jalli Ajay: అప్పటి వరకు ఆనందంగా కొనసాగుతున్న జీవితం ఒక్కసారిగా అల్లకల్లోలమైంది. రోడ్డు ప్రమాదంతో ఓ సీనియర్ నాయకుడి కుమారుడి జీవితం అంధకారంగా మారింది. ఉత్సాహంగా పని చేసుకోవాల్సిన వయసులో ఇతర కుటుంబ సభ్యులపై పూర్తిగా ఆధారపడిన పరిస్థితుల్లో తన చికిత్సకి ఆర్థిక సహాయం అందిస్తే ఏదో ఒక పని చేసుకుంటూ బతకగలను అంటూ అభ్యర్థిస్తున్నాడు.. నాయకులు, ప్రభుత్వం కానీ లేదా దాతలు సహకరిస్తే తాను తిరిగి మామూలు మనిషి అవుతానని అంటున్నాడు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ సాయం చేయాలని కుటుంబసభ్యులు కోరుతున్నారు.
కరీంనగర్‌కు చెందిన జల్లి అజయ్ వయస్సు ప్రస్తుతం 38 ఏళ్లు. 2015 సంవత్సరంలో ఒక కార్యక్రమం ముగించుకుని తిరిగి ఇంటికి వెళ్తుండగా యాక్సిడెంట్ కి గురయ్యాడు . స్థానికంగా కరీంనగర్లో ఉన్న హాస్పిటల్లో చెకప్ చేయించగా సాధారణంగానే దెబ్బలు తగిలాయని.. ఆందోళన చెందాల్సిన అవసరం లేదంటూ ప్రాథమిక చికిత్స తో పాటు చిన్న పాటి సర్జరీ కూడా చేశారు. కానీ రాను రాను పరిస్థితి విషమించడంతో అజయ్ సోదరుడికి సమస్య తీవ్రం అవుతుందేమో అనే డౌట్ మొదలైంది.
వాస్తవానికి అజయ్ కి మెదడులో రక్తం గడ్డ కట్టడం, అది కూడా కళ్లకు మెదడు కి మధ్య అనుసంధానంగా ఉండే కంటి నరాలను డ్యామేజ్ చేయడంతో కంటిచూపు క్రమక్రమంగా మందగించటం ప్రారంభమైంది. దీంతో అతని సోదరుడు ట్రీట్మెంట్ కోసం హైదరాబాద్‌తో పాటు బెంగళూరులోని ప్రసిద్ధ నిమ్ హాన్స్ లోని ప్రఖ్యాత న్యూరో డాక్టర్‌లను సైతం సంప్రదించారు. అయితే అప్పటికే కంటి నరాలు విపరీతంగా డామేజ్ కావడంతో కోట్ల మందిలో ఒకరికి వచ్చే అరుదైన వ్యాధి కారణంగా కంటిచూపును కోల్పోయాడు అజయ్. అప్పటికి దాదాపుగా 15 లక్షల వరకు ఖర్చు కావడంతో కుటుంబ సభ్యులు కూడా ప్రభుత్వ సహాయం కోసం ప్రయత్నాలు ప్రారంభించారు.
సీనియర్ నేత మరణంతో మరింత విషాదం..
మరోవైపు అజయ్ తండ్రి సీనియర్ నేత జెల్లి పెద్దులు 2016 లో ఆకస్మికంగా గుండెపోటుతో మరణించారు. నిజానికి పెద్దులు కాంగ్రెస్ పార్టీలో కరీంనగర్‌లో కీలక నేతగా చలామణి అయ్యారు. 1984-85 లో కౌన్సిలర్‌గా గెలిచిన పెద్దులు ఆ తరువాత 90 దశకంలో చాలా ఏళ్ల పాటు కాంగ్రెస్ లో పలు పదవుల్లో కొనసాగిన ఆయన తెలంగాణ రాష్ట్ర సమితి (TRS) ఆవిర్భావంsy 2001లో కరీంనగర్‌లో జెడ్పీటీసీగా ఎన్నికయ్యారు. అప్పుడే పుట్టిన పార్టీ కావడంతో చాలా మందిని పార్టీ వైపు వచ్చేలా సభ్యత్వ నమోదు చేయడంతో బాటు, స్వయానా స్థానిక సంస్థల ఎన్నికల కోసం అభ్యర్థుల ఎంపిక కోసం కూడా అధిష్టానం ఆదేశాలను తు.చ తప్పకుండా పాటించారు.
పార్టీ బలపడే విధంగా పలు ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించి తొలి రోజుల్లో టీఆర్ఎస్ స్థానికంగా బలపడేలా చేయడంలో తన వంతు కృషి చేశారు. సైద్ధాంతిక పరంగా ఎలాంటి విభేదాలు ఉన్నప్పటికీ దాదాపు అన్ని పార్టీల నాయకులతో మంచి రిలేషన్ మెయింటెయిన్ చేశారు. ఓవైపు కుమారుడి అనారోగ్యం క్షీణిస్తుండగా.. అదే సమయంలో విధి వక్రీకరించి 2016లో గుండెపోటుతో పెద్దులు మరణించారు.
ఆకస్మికంగా జరిగిన ప్రమాదం తనను తీవ్ర ఇబ్బందుల్లోకి నెట్టివేసిందని, చికిత్స అందించి ఏదైనా ఉపాధి చూపిస్తే మళ్లీ తన కాళ్లపై తాను నిలబడి కుటుంబానికి అండగా నిలుస్తానని బాధితులు జల్లి అజయ్ చెబుతున్నాడు.
తమకు ఆర్ధిక సహాయం అందించి కుమారుడిని ఆదుకోవాలని అజయ్ తల్లి, పెద్దులు భార్య భాగ్యలక్ష్మి కోరుతున్నారు. తన భర్త చికిత్సకి సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ సహాయం అందిస్తే తాము వారికి రుణపడి ఉంటామని అజయ్ భార్య జల్లి కవిత అన్నారు. చిన్న వయసులోనే తన భర్త ఎదుర్కొంటున్న సమస్యకి ఒక పరిష్కారం చూపేలా ఆదుకోవాలని కోరారు.
Also Read: Saidabad: పోలీసులు చేతులెత్తేసిన కేసును ఛేదించిన సామాన్యుడు... భార్యను వెతికిపట్టుకున్న భర్త...