Karimnagar: ప్రధాని మోదీ కరీంనగర్ సభతో పార్టీలో నూతనోత్సాహం, ఆనందంలో కార్యకర్తలు
మునుగోడు ఉప ఎన్నికల్లో పరాభవం తర్వాత బీజేపీలో జోష్ తగ్గిందనడం వాస్తవం. అయితే మోదీ స్థాయి నేత జాతీయ స్థాయి ప్రాజెక్టుకు నేరుగా రావడంతో బీజేపీ శ్రేణులకు ఉత్సాహం వచ్చింది.
ఉమ్మడి కరీంనగర్ జిల్లా రాజకీయాల్లో ఉత్తర తెలంగాణకే ఆయువు పట్టుగా భావించే ఉమ్మడి కరీంనగర్ జిల్లా రామగుండంలో జరిగిన ప్రధాని మోదీ సభ పట్ల బీజేపీ శ్రేణుల్లో ఉత్సాహం వ్యక్తం అవుతుంది. ఈ మధ్య జరిగిన మునుగోడు ఉప ఎన్నికల్లో పరాభవం తర్వాత బీజేపీలో జోష్ తగ్గిందనడం వాస్తవం. అయితే వెను వెంటనే దిద్దుబాటు చర్యలకు దిగిన బీజేపీ శ్రేణులకు మోదీ స్థాయి నేత జాతీయ స్థాయి ప్రాజెక్టుకు నేరుగా రావడం కలిసి వచ్చిందని చెప్పవచ్చు. గతంలో సీఎం కేసీఆర్ తో సహా పలువురు మంత్రులు యూరియాకి సంబంధించి ప్రకటనలు చేసినప్పటికీ ఆచరణాత్మకంగా తాము మాత్రమే చేసి చూపించగలిగామని మోదీ ప్రకటించడం పట్ల బీజేపీ వర్గాల్లో ఆనందం వ్యక్తం అవుతోంది.
తెలంగాణలో కీలకమైన రైతుల సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించామని పేర్కొన్న మోదీ కేవలం శంకుస్థాపనకే తాము పరిమితం కాదని రైతుల సమస్యలను ప్రాక్టికల్ గా ఆలోచించి మరీ పరిష్కరిస్తామని తెలపడంతో బీజేపీ వర్గాలు మరింత ఉత్సాహంగా పనిచేయడానికి ముందుకెళ్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక సింగరేణి ప్రైవేట్ పరం చేస్తారంటూ వచ్చిన పుకార్లను పీఎం నేరుగానే కొట్టి పారేశారు. ప్రైవేట్ చేయాలంటే 51 శాతం ఉన్న రాష్ట్ర ప్రభుత్వమే వలన అవుతుందని తమ వాటా 49 శాతం అని స్పష్టం చేశారు. ఎట్టి పరిస్థితిలో సింగరేణి ప్రైవేట్ పరం చేసే ఆలోచన లేదని కుండ బద్దలు కొట్టడం కొంతవరకు బీజేపీ పార్టీకి అనుకూలించిందని చెప్పవచ్చు.
పీఎం నోట కూల్చివేత మాట
ఎప్పుడూ లేని విధంగా ఏకంగా ప్రధానమంత్రి స్థాయి వ్యక్తి ప్రభుత్వాన్ని కూల్చివేస్తామంటూ ప్రకటించడం రాజకీయ వర్గాలను సైతం ఆశ్చర్యపరిచింది. తాము ప్రజావ్యతిరేక ప్రభుత్వాలను ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించబోమని.. అవినీతికి పాల్పడితే ఎలాంటి స్థానిక ప్రభుత్వాన్ని అయినా సరే.. కూల్చివేస్తామంటూ నేరుగా ప్రకటించడంతో ఇక బీజేపీ కేంద్ర స్థాయి నేతలు ఎలాంటి వ్యూహాలను రచించి దుందుడుకుగా వెళ్ళబోతున్నారో చెప్పకనే చెప్పినట్టు అయింది. ఈ మాట రాష్ట్ర నేతల్లో ఉత్సాహం నింపగా ప్రతిపక్షాలకు సీరియస్ గానే ఒక వార్నింగ్ ఇచ్చినట్టు అయింది.
ఈ ఊపు కొనసాగేనా?
నిజానికి రాష్ట్ర రాజకీయాల్లో బిజెపిలో కీలక పాత్ర వహిస్తున్న పలువురు నేతలు ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన వారే ప్రస్తుతం ఉన్న పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ కరీంనగర్లో కార్పొరేటర్ నుండి ఎంపీ వరకు ఎదిగారు. ఇక టీఆర్ఎస్ పార్టీ పుట్టుక నుండి ఉన్న ఈటల రాజేందర్ ప్రస్తుతం హుజురాబాద్ ఉప ఎన్నిక తరువాత చేరికల కమిటీ చైర్మన్గా కొనసాగుతున్నారు. నేరుగా కేంద్రస్థాయి నేతలతో సంబంధాలు కొనసాగిస్తున్నారు. ఇక మహారాష్ట్ర మాజీ గవర్నర్ చెన్నమనేని విద్యాసాగర్ రావు, సీనియర్ బీజేపీ నేత మురళీధర్ రావు పేరాల శేఖర్ జి లాంటి ఉద్దండులంతా కరీంనగర్ జిల్లాకు చెందిన వారి కావడం గమనార్హం.
13 నియోజకవర్గాలున్న ఈ జిల్లాలో పట్టు సాధిస్తే తెలంగాణపై చేయి సాధించడం తేలిక అనేది వాస్తవం. అందుకే మొదటి నుండి టీఆర్ఎస్ అగ్రనేత కేసీఆర్ సైతం కరీంనగర్ ని నమ్ముకునే తన రాజకీయ ప్రస్తానాన్ని ప్రారంభించారు. అలాంటి కీలక ప్రాంతంలో పీఎం మోడీ సభ నిర్వహించి సక్సెస్ కావడం పట్ల బీజేపీ నాయకుల్లో కార్యకర్తల్లో ఆనందం వ్యక్తం అవుతుంది. తాము నిర్వహించింది.. రాజకీయ సంబంధిత సభ కాదు అని బీజేపీ నేతలు అంటున్నప్పటికీ పూర్తిగా వ్యూహాత్మకంగానే ప్లాన్ చేశారన్నది మాత్రం వాస్తవం.