Huzurabad Bypoll: పోలింగ్ వేళ ఈటలపై ఈసీకి టీఆర్ఎస్ నేతల ఫిర్యాదు.. కారణం ఏంటంటే..
పోలింగ్ జరుగుతుండగా ఈటల ప్రెస్ మీట్ పెట్టారంటూ టీఆర్ఎస్ నాయకులు ఆరోపిస్తున్నారు. అది ఎన్నికల నిబంధనలకు విరుద్ధం అని టీఆర్ఎస్ నేతలు ఫిర్యాదులో పేర్కొన్నారు.
హుజూరాబాద్‌లో ఉప ఎన్నిక పోలింగ్ జరుగుతున్న వేళ బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌పై టీఆర్ఎస్ నేతలు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఆయన ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించారని ఆరోపించారు. ఓవైపు పోలింగ్ జరుగుతుండగా ఓటర్లను ప్రలోభాలకు గురి చేసేలా ప్రెస్ మీట్ పెట్టారని వారు ఆరోపిస్తూ ఓ లేఖ రాసి లిఖిత పూర్వకంగా ఈసీకి అందించారు. ఈటల రాజేందర్ శనివారం కమలాపూర్‌లోని పోలింగ్ బూత్ 262లో సతీసమేతంగా ఓటు హక్కు వినియోగించుకున్న సంగతి తెలిసిందే. అనంతరం ఈటల, ఆయన సతీమణి జమున విలేకరులతో మాట్లాడారు.
పోలింగ్ జరుగుతుండగా ఆయన ప్రెస్ మీట్ పెట్టారంటూ టీఆర్ఎస్ నాయకులు ఆరోపిస్తున్నారు. అది ఎన్నికల నిబంధనలకు విరుద్ధం అని టీఆర్ఎస్ నేతలు ఫిర్యాదులో పేర్కొన్నారు. అంతేకాకుండా, ప్రజలందరూ తమవైపే ఉన్నారని, ప్రజల ఆశీర్వాదం తనకే ఉందంటూ ఈటల ఓటర్లను ప్రభావితం చేసేలా వ్యాఖ్యలు చేశారని అన్నారు. ఈటల భార్య కూడా ఇలాంటి ప్రచారమే చేస్తున్నారంటూ ఫిర్యాదు చేశారు. ఓటమి భయంతోనే ప్రభుత్వంపై ఇలాంటి చిల్లర ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ఎన్నికల నిబంధనల ఉల్లంఘన కింద ఈటల రాజేందర్, ఆయన భార్యపై చర్యలు తీసుకోవాలని టీఆర్ఎస్ నేతలు ఈసీని కోరారు.
ఓటు వేసిన గెల్లు శ్రీనివాస్
మరోవైపు, వీణవంకలోని హిమ్మత్ నగర్‌లో టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ దంపతులు ఓటు వేశారు. అంతకుముందు ఆయన గ్యాస్ బండకు నమస్కారం చేశారు. ఆ తర్వాత తన తల్లికి నమస్కరించి ఆశీర్వాదం తీసుకున్నారు. ఆ వెంటనే ఓటు వేసేందుకు వెళ్లారు. మార్పుకు హుజూరాబాద్ నాంది కావాలని ఆయన ఓటు వేసిన అనంతరం విలేకరులతో అన్నారు. ఓటర్లందరూ స్వచ్ఛందంగా బయటికి వచ్చి ఓటు వేయాలని సూచించారు. ప్రజాస్వామ్యానికి ఓటు హక్కే ఆయుధమని అన్నారు. పోలింగ్ శాతం పెరగాలని ఆయన ప్రజల్ని కోరారు.
Also Read: KPHB Colony: ఇల్లు అద్దెకు తీసుకున్నారు, కొన్నాళ్లకి పాడు పనులు స్టార్ట్.. గుట్టు ఇలా బయటికొచ్చింది
Also Read: Note For Vote : డబ్బుల కోసం ఓటర్ల ధర్నాలు ! ప్రజాస్వామ్యం పతనావస్థకు ఇదే సంకేతమా?
Also Read: పుట్టింటికి వచ్చిన ఇద్దరు యువతులు.. చివరికి చెరువులో మూడు శవాలు, ఏం జరిగిందంటే..
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి