Jagityal Friends Death: పుట్టింటికి వచ్చిన ఇద్దరు యువతులు.. చివరికి చెరువులో మూడు శవాలు, ఏం జరిగిందంటే..
ముగ్గురికి ఆరోగ్యం బాగా లేకపోవడం వల్లే తమ కుమార్తెలు బలవన్మరణానికి పాల్పడ్డారని వివాహితులైన యువతుల తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
జగిత్యాల జిల్లాలో తీవ్రమైన విషాద ఘటన చోటు చేసుకుంది. ముగ్గురు యువతులు దారుణమైన స్థితిలో ఆత్మహత్య చేసుకున్నారు. వారు ముగ్గురూ దగ్గరి బంధువులు.. చిన్నప్పటి నుంచి స్నేహితులు.. కలిసే ఆడుకుంటూ కలిసే చదువుకున్నారు. చివరికి చెరువులో పడి ఆత్మహత్య చేసుకున్నారు. అంతకుముందు కొద్ది రోజుల క్రితమే వారిలో ఇద్దరి రోజుల వ్యవధిలో వివాహం అయింది. ఇంతలోనే ఈ ఘటన జరగడం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశం అయింది.
జగిత్యాల పట్టణం ఉప్పరిపేటకు చెందిన ఎక్కలదేవి వందన(16), ఎక్కలదేవి గంగాజల(19), సమీపంలోని గాంధీనగర్‌కు చెందిన ఎక్కలదేవి మల్లిక(19) కజిన్స్. చిన్నప్పటి నుంచి మంచి స్నేహితులు కూడా. వారిలో గంగాజల, మల్లికలు ఇంటర్ విద్యను కంప్లీట్ చేశారు. మూడో అమ్మాయి వందన ప్రస్తుతం ఇంటర్ ఫస్టియర్ చదువుతోంది. వారిలో గంగాజలకు ఆగస్టు 23న జగిత్యాల మండలం నర్సింగాపూర్ అనే గ్రామానికి చెందిన రాజు అనే వ్యక్తితో పెళ్లి జరిగింది. మరో యువతి మల్లిక వివాహం కూడా అదే నెల 26న కొడిమ్యాల మండలం డబ్బుతిమ్మయ్య పల్లి గ్రామానికి చెందిన అదరవేని రాజు అనే వ్యక్తితో జరిగింది.
పెళ్లి జరిగిన ఈ ఇద్దరు యువతులు మెట్టింటి నుంచి వారం క్రితమే పుట్టింటికి వచ్చారు. బుధవారం మధ్యాహ్నం సమయంలో ముగ్గురూ వేర్వేరు కారణాలు చెప్పి ఇళ్లలోంచి బయటికి వెళ్లారు. సాయంత్రం వరకు ఇంటికి రాకపోవటంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. ముగ్గురు కుటుంబాల వారు కలిసి చుట్టుపక్కల వెతికారు. అయినా, ఆచూకీ లభ్యం కాలేదు.
Also Read: Sumanth's Malli Modalaindi Trailer: దొంగ సచ్చినోడా... ఎంతమంది ఆడపిల్లల జీవితాలు నాశనం చేస్తావ్ రా!
ఇంతలో గురువారం ఉదయం 11 గంటలకు ధర్మ సముద్రం జలాశయంలో మృతదేహాలను స్థానికులు గుర్తించారు. వారు ఆత్మహత్యకు పాల్పడినట్టుగా కుటుంబ సభ్యులు గుర్తించారు. పోలీసులు కూాడా ఇదే అని ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. యువతులు ముగ్గురికి చిన్నతనం నుంచి ఆరోగ్యం బాగా లేకపోవడం వల్లే తమ కుమార్తెలు ఈ అఘాయిత్యానికి పాల్పడి ఉంటారని యువతుల తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన కూతురు వారిద్దరితో కలిసి ఆత్మహత్య చేసుకుందని వందన తండ్రి ఆవేదన చెందాడు. పోలీసులు ఈ వ్యవహారంలో విచారణ కోసం వారి సెల్ ఫోన్‌లను పోలీసులు స్వాధీనం చేసుకుని కాల్ డేటాను, మెసేజ్‌లను పరిశీలిస్తున్నారు. అయితే, వివాహం కారణంగా ఒకరికొకరం దూరమయ్యామనే బాధతోనే వారు ఆత్మహత్య చేసుకుని ఉంటారని స్థానికులు చెబుతున్నారు.
Also Read: Family Drama Movie Review 'ఫ్యామిలీ డ్రామా' సమీక్ష: థ్రిల్లింత కొంత... సుహాస్ నటన కొండంత!
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి