Fish Rain: కాళేశ్వరంలో చేపల వర్షం, ఇలా ఎందుకు జరుగుతుందో తెలుసా! నిపుణుల అభిప్రాయం ఇదే
Fish Rain in Kaleshwaram: మీరు ఎప్పుడైనా అలా రోడ్డుపై ప్రయాణిస్తూ ఉంటే అకస్మాత్తుగా వర్షంతో పాటుగా చేపలు పడితే ఎలా ఉంటుంది. సరిగ్గా ఇలాంటి అనుభూతిని జయశంకర్ భూపాలపల్లి జిల్లా వాసులు పొందారు.
సాధారణంగా జూన్ నెల రాగానే నైరుతి రుతుపవనాలు వస్తాయి. దాంతో ప్రజలు వర్షం కోసం ఎదురుచూస్తుంటారు. కొన్నిసార్లు సాధారణ వర్షంతో పాటు వడగళ్ల వానలు కురుస్తుంటాయి. అయితే జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ప్రజలకు విచిత్ర అనుభూతి కలిగింది. కాళేశ్వరంలో చేపల వర్షం కురిసింది. మీరు ఎప్పుడైనా అలా రోడ్డుపై ప్రయాణిస్తూ ఉంటే అకస్మాత్తుగా వర్షంతో పాటుగా చేపలు పడితే ఎలా ఉంటుంది. సరిగ్గా ఇలాంటి అనుభూతిని జిల్లా వాసులు పొందారు. ఆ చేపలు కూడా చిన్న చేపలు మాత్రం కాదందోయ్.. పెద్ద పెద్ద చేపల వర్షం కురిసిందని తెలియగానే సోమవారం నాడు చుట్టుపక్కల ప్రాంతాల వారు కూడా చేపల కోసం కాళేశ్వరానికి వెళ్లి దొరికినన్ని చేపల్ని తీసుకెళ్లారు.
కాళేశ్వరంలో చేపల వర్షం..
కాళేశ్వరంలో ఆదివారం రాత్రి కురిసిన భారీ వర్షానికి కొన్ని చోట్ల చేపలు నేలపై పడ్డాయి. సమీప గ్రామాలతో బాటు పడిదం చెరువు సమీపంలోనూ ఇక చుట్టుపక్కల గల అటవీ ప్రాంతం లోనూ చేపలు రోడ్లపై కనిపించడంతో అటుగా వెళ్తున్న రైతులు, కూలీలు సామాన్య ప్రజలు ఆశ్చర్యపోయారు. సోమవారం ఉదయం ఈ విషయం తెలియగానే చుట్టుపక్కల వారు అక్కడికి చేరుకుని కాస్త పెద్ద సైజులో ఉన్న చేపలను పట్టుకుని చిన్న చిన్న నీటి మడుగులు అప్పటికప్పుడు తయారుచేసి నిల్వ చేసుకున్నారు. అసలు చుట్టుపక్కల ఎక్కడా కూడా నీటి నిల్వ లేకపోవడంతో అసలు ఎక్కడనుండి వచ్చాయోనని మొదట అయోమయంలో పడ్డ జనాలకు చివరకి ఒక క్లారిటీ వచ్చింది. ఇదంతా వరుణుడి మహిమ అని అర్ధం అయింది.
తీర ప్రాంతాల్లో చేపల వర్షాలు..
ముఖ్యంగా సముద్ర తీర ప్రాంతాల్లో చేపల వర్షం ఇలాంటి ఘటనలు జరుగుతుంటాయి. అయితే ఇది అప్పుడప్పుడు కనిపించే విషయమే. వాతావరణంలో తీవ్ర మార్పులు జరిగే సమయంలో ఏర్పడే సుడిగుండాలు నేలపై నుంచి పైకి వెళుతూ అడ్డువచ్చిన వాటిని పైకి తీసుకుపోతాయి. సాధారణంగా భారీ స్థాయిలో నీటి నిల్వలు ఉన్న ప్రాంతాల్లో సుడిగాలి గనుక పెద్ద పరిమాణంలో వచ్చినట్లయితే అందులో ఉన్న చేపలు దానితో పాటుగా మేఘాల లోకి వెళ్లి సమీప ప్రాంతాల్లో వర్షం పడ్డప్పుడు అక్కడ నేలమీదికి వస్తాయి. ఇది కొంతవరకు అసాధారణ విషయం అని జిల్లా మత్స్యశాఖ అధికారి అవినాష్ అన్నారు. ఈ చేపలను మామూలు భాషలో నటు గురక అంటారని వీటి శాస్త్రీయ నామం అనాబస్ టెస్ట్ ట్యూడియస్ (Aabas Testudineus) అని తెలిపారు. సుడిగాలి వచ్చిన సమయంలో తీర ప్రాంతాల్లో నీటితో పాటు చేపలు పైకి లేచి మేఘంగా మారి వర్షంతో పాటు పడతాయని వివరించారు.
మరో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ సుడిగాలులకు కొన్ని కిలోమీటర్ల వరకు కూడా అంత శక్తి ఉంటుందట. దీంతో ఇక్కడ చేపలు అకస్మాత్తుగా వర్షంతో పాటు నేల మీద పడతాయని.. ప్రజలు ఇలాంటి సందర్భాన్ని వింతగా చూస్తారని నిపుణులు చెబుతున్నారు.