Karimnagar Ayush: ఫలించిన బండి సంజయ్ కృషి - కరీంనగర్‌కు ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ మంజూరు చేసిన కేంద్రం
AYUSH hospital: కరీంనగర్ కు ఆయుష్ ఆస్పత్రిని మంజూరు చేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. కేంద్ర మంత్రి బండి సంజయ్ చేసిన ప్రయత్నాలకు ఫలితం లభించింది.

AYUSH hospital for Karimnagar: కరీంనగర్ ప్రజలకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ చేసిన నిరంతర కృషి ఫలితంగా కరీంనగర్‌కు 50 పడకల ఆయుష్ ఆసుపత్రి మంజూరైంది. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం తాజాగా పరిపాలనాపరమైన అనుమతులు మంజూరు చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఉత్తర తెలంగాణలోనే ఒక ప్రధాన వైద్య హబ్‌గా కరీంనగర్ ఎదిగేందుకు ఈ నిర్ణయం దోహదపడనుంది.
మొదటి విడత నిధులు మంజూరు చేసిన కేంద్రం
ఈ ఆసుపత్రి నిర్మాణానికి మొత్తం రూ. 15 కోట్ల వ్యయం అవుతుందని అంచనా వేయగా, అందులో మొదటి విడతగా కేంద్ర ప్రభుత్వం రూ. 7.5 కోట్ల నిధులను తక్షణమే విడుదల చేసింది. అల్లోపతి మందుల వల్ల కలిగే దుష్ప్రభావాల భయంతో ఆయుర్వేదం, హోమియోపతి వైపు మొగ్గు చూపుతున్న ప్రజల ఆకాంక్షను గుర్తించిన బండి సంజయ్ , కేంద్ర ఆయుష్ మంత్రి ప్రతాప్ రావు జాదవ్ ని కలిసి ఈ ఆసుపత్రి అవశ్యకతను వివరించారు. దీనిపై సానుకూలంగా స్పందించిన కేంద్రం, ఈ ప్రాంత అవసరాలను దృష్టిలో ఉంచుకుని గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
ఆయుర్వేద చికిత్సలు అందించనున్న ఆయుష్
మంజూరైన 50 పడకల ఆసుపత్రిలో వైవిధ్యభరితమైన విభాగాలను ఏర్పాటు చేయనున్నారు. కాయచికిత్సకు 20, పంచకర్మకు 10, సర్జికల్ సేవలకు 10, అలాగే ఈఎన్టీ, ప్రసూతి, స్త్రీ ఆరోగ్య సేవలకు మరో 5 పడకలను ప్రత్యేకంగా కేటాయించారు. ఇక్కడ కేవలం చికిత్సలే కాకుండా కాయకల్ప చికిత్స, యోగా, ధ్యానం, జీవనశైలి మార్పులపై కౌన్సిలింగ్ వంటి సేవలు కూడా అందుబాటులోకి రానున్నాయి. తద్వారా దీర్ఘకాలిక వ్యాధులైన బీపీ, షుగర్, ఆస్తమా, మైగ్రేన్ వంటి సమస్యలకు సహజమైన పరిష్కారాలు లభించనున్నాయి.
స్థలం ఎంపిక చేయనున్న కలెక్టర్
ఆసుపత్రి ఏర్పాటుకు అవసరమైన స్థలాన్ని కేటాయించడం, వైద్యులు , ఇతర సిబ్బందిని నియమించే బాధ్యతలను కేంద్రం రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించింది. ఈ మేరకు కేంద్రం నుంచి అధికారిక లేఖ అందడంతో జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ఇప్పటికే ఆయుష్ అధికారులతో చర్చలు ప్రారంభించారు. త్వరలోనే తగిన స్థలాన్ని ఎంపిక చేసి నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టనున్నారు.
ఉమ్మడి జిల్లా ప్రజలకు ఎంతో మేలు
ఈ ఆసుపత్రి అందుబాటులోకి వస్తే కరీంనగర్ జిల్లా ప్రజలతో పాటు చుట్టుపక్కల ఉన్న ఉత్తర తెలంగాణ జిల్లాల ప్రజలకు ఉపశమనం లభిస్తుంది. మెడికల్ సూపరింటెండెంట్ నేతృత్వంలో సుమారు 21 మంది సెక్యూరిటీ సిబ్బందితో సహా భారీ సంఖ్యలో నర్సింగ్ స్టాఫ్, ల్యాబ్ టెక్నీషియన్లు, యోగా ట్రైనర్లు ఇక్కడ సేవలందించనున్నారు. మోదీ ప్రభుత్వం భారతీయ సాంప్రదాయ వైద్యానికి ఇస్తున్న ప్రాధాన్యతలో భాగంగా కరీంనగర్‌కు ఈ ప్రాజెక్టు దక్కడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.





















