క్రికెట్ ఆడుతూ ఆగిన యువకుడి గుండె- హుస్నాబాద్‌లో విషాదం
అప్పటి వరకు ఆడుతూ పాడుతున్న ఆ యువకుడి గుండె ఆగిపోయింది. క్రికెట్ ఆడుతున్న టైంలో బౌలింగ్ చేస్తూ కుప్పకూలిపోయాడు.
ఆడుతున్న యువకుడి గుండె ఆగిపోయింది. ఏం జరిగిందో తెలుసుకునే లోపు ప్రాణం అనంతవాయువుల్లో కలిసిపోయింది. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో జరిగిన ఈ దుర్ఘటన అందర్నీ కలిచివేస్తోంది.
చిగురుమామిడి మండలం సుందరగిరికి చెందిన శనిగరం ఆంజనేయులు హుస్నాబాద్‌లో జరుగుతున్న క్రికెట్ టోర్నమెంట్‌లో పాల్గొన్నాడు. అతని వయసు 37 ఏళ్లు. బౌలింగ్ చేస్తున్న టైంలో ఒక్కసారిగా చాతీలో నొప్పి వచ్చింది. గుండె పట్టుకొని పడిపోయాడు. అంతా అక్కడకు వచ్చి చూస్తే మనిషిలో చలనం లేదు. గుండె కొట్టుకోవడం ఆగిపోయిందని గ్రహించిన స్నేహితులు సీపీఆర్ చేశారు.
సీపీఆర్ చేస్తూనే దగ్గర్‌లోనే ఉన్న ఆసుపత్రికి తరలించారు. అక్కడ పరీక్షించిన వైద్యులు మృతి చెందినట్టు చెప్పారు. అంతే ఆ ప్రాంతంలో విషాదఛాయలు అలుముకున్నాయి. అప్పటి వరకు సరదాగా తమతోనే ఉన్న మిత్రుడు ఒక్కసారిగా కుప్పకూలిపోయి మృతి చెందడాన్ని ఆంజనేయులు స్నేహితులు జీర్ణించుకోలేకపోతున్నారు.
ఈ మధ్య కాలంలో ఇలాంటి మరణాలు చాలా ఎక్కువ అయ్యాయి. ఉన్నచోటనే కుప్పకూలుతున్న ఘటనలు భయాందోళనకు గురిచేస్తున్నాయి. ఇప్పటికే పదుల సంఖ్యలో హార్ట్ ఎటాక్ తో చనిపోయారు. గత వారంలో మహబూబాబాద్ జిల్లాలో 13 ఏళ్ల చిన్నారి స్రవంతి హార్ట్ ఎటాక్ తో మృతి చెందింది. మార్చి 30న శ్రీరామనవమి వేడుకల్లో తోటి చిన్నారులతో పొద్దంతా ఆడుతూ పాడుతూ గడిపిన చిన్నారి రాత్రి పడుకునే సమయంలో గుండెపోటుతో చనిపోయింది. బోడతండాకు చెందిన బోడ లకపతి, బోడ వసంతలకు ఇద్దరు సంతానం. రెండో కుమార్తె స్రవంతి స్థానిక ప్రైవేట్ పాఠశాలలో ఆరో తరగతి చదువుతోంది. నాయనమ్మ దగ్గర పడుకున్న చిన్నారిని తెల్లవారుజామున లేపే సరికి ఒక్కసారిగా కుప్పకూలింది. చిన్నారికి బాబాయ్ సీపీఆర్ చేసి వెంటనే ఆర్ఎంపీ దగ్గరకు తీసుకెళ్లాడు. అప్పటికే బాలిక చనిపోయినట్లు వైద్యుడు నిర్ధారించారు. దీంతో ఆ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
గుండెపోటు వచ్చే ముందు కనిపించే లక్షణాలివే!
ఇటీవల కాలంలో వయసుతో సంబంధం లేకుండా 20 ఏళ్ల యువకులు కూడా గుండెపోటు బారిన పడి మరణిస్తున్నారు. డ్యాన్స్ చేస్తూ, కాలేజీలో నడుస్తూ అక్కడికక్కడే కుప్పకూలిపోయిన యువకుల వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఒకప్పుడు యాభై ఏళ్లు దాటిన వారే గుండె ఆరోగ్యం గురించి శ్రద్ధ వహించేవారు. ఇప్పుడు యువత కూడా గుండె జబ్బుల ప్రమాదంలో పడింది, కాబట్టి గుండెపోటు వచ్చే ముందు కనిపించే లక్షణాలపై అవగాహన పెంచుకుంటే ముందే జాగ్రత్త పడే అవకాశం ఉంది.
ఎందుకు వస్తుంది?
కనిపించే లక్షణాలు
1. ఛాతి నొప్పి వస్తూ పోతూ ఉంటుంది.
2. శ్వాస సరిగా ఆడదు.
3. చేయి లేదా భుజం నొప్పి వేధిస్తూ ఉంటుంది.
4. బలహీనంగా ఉన్నట్టు అనిపిస్తుంది.
ఈ లక్షణాలు గుండెపోటు రావడానికి కొన్ని వారాలు లేదా రోజులు ముందు జరగవచ్చు. కొందరి విషయంలో గంటల ముందు కూడా ఇవి కనిపించే అవకాశం ఉంది. మెడ గట్టిగా పట్టేయడం, భుజం నొప్పి, అజీర్ణం, అలసట, చల్లని చెమటలు పట్టడం కూడా గుండెపోటు రాకకు ముందస్తు సంకేతాలే. అలాగే మానసిక ఆందోళన, ఏదో వినాశనం జరగబోతుంది అంటూ వచ్చే ఆలోచనలు, గుండె దడ, శ్వాస సరిగా ఆడక పోవడం కూడా తీవ్రంగా పరిగణించాల్సిన లక్షణాలు. ఇక్కడ చెప్పినవన్నీ రోజుల్లో కాసేపు వచ్చి పోతుండటంతో ఎక్కువమంది వీటిని తేలిగ్గా తీసుకుంటారు. ఇవి కొన్ని నిమిషాల పాటు లేదా సెకండ్ల పాటు కనిపించినా కూడా గుండె వైద్యులను కలిసి పరిస్థితిని వివరించడం చాలా ముఖ్యం.