Karimnagar News: కరీంనగర్ రచయితకి కేంద్ర సాహిత్య అకాడమీ బాల సాహిత్య పురస్కారం!
Karimnagar News: ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన ప్రసిద్ధ కవి, రచయిత డాక్టర్ పత్తిపాక మోహన్ కు ప్రతిష్టాత్మకమైన కేంద్ర సాహిత్య అకాడమీ బాల సాహిత్య పురస్కారం దక్కింది.
Karimnagar News: ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన రచయిత, కవి, అనువాదకుడు, నేషనల్ బుక్ ట్రస్ట్ సహాయ సంపాదకుడు డాక్టర్ పత్తిపాక మోహన్ ప్రతిష్టాత్మకమైన కేంద్ర సాహిత్య అకాడమీ బాల సాహిత్య అవార్డుని అందుకున్నారు. సోమవారం సాయంత్రం న్యూ ఢిల్లీలోని త్రివేణి కళా సంఘం ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో సాహిత్య అకాడమీ అధ్యక్షుడు చంద్రశేఖర్ కంబార్, వైస్ ప్రెసిడెంట్ మాధవ్‌కౌశిక్, కార్యదర్శి శ్రీనివాసరావు, హిందీ రచయిత ప్రకాశ్‌మను పురస్కారం ప్రదానం చేశారు. జిల్లాలో ఇప్పటి వరకు కేంద్ర సాహిత్య అకాడమీ నుంచి కవిత్వంలో డాక్టర్ సి.నారాయణ రెడ్డి, అనువాదంలో డాక్టర్ నలిమెల భాస్కర్, ఇప్పుడు బాల సాహిత్యంలో డాక్టర్ పత్తిపాక మోహన్ పురస్కారం అందుకున్నారు. 2022 సంవత్సరానికి పత్తిపాక మోహన్ ‘బాలల తాతా బాపూజీ’ (పిల్లల కోసం గాంధీ గేయాలు, గేయకథ) సంకలనానికి కేంద్ర సాహిత్య అకాడమీ బాల సాహిత్య పురస్కారం లభించింది.
మరోవైపు అలనాటి అగ్ర కవి రచయిత సి.నారాయణ రెడ్డి గారి ప్రోత్సాహంతో తాను కవిత్వం వైపు అడుగులు వేశానని... ఇక ఏడవ తరగతిలోనే మొదటి కవిత రాసిన తాను సాహిత్యంపై మరింత అవగాహన పెంచుకుంటూ వచ్చారని తెలిపారు. తన భార్య చందన కూడా హిందీ టీచర్ కావడంతో తాము బాల సాహిత్యంపై తరచూ చర్చలు జరిపే వాళ్లమని... ఈ క్రమంలోనే ఆ వైపు అడుగులు వేశారని తెలిపారు. బాల సాహిత్యానికి దేశంలో బంగారు భవిష్యత్తు ఉందని నూతన యువ కవులు సైతం ఈ వైపుగా దృష్టి సారించాలని సూచించారు.
సాహిత్య సేద్యం ఇలా...
1997 నుంచి ‘మొగ్గ’ కోసం బాల సాహిత్య రచన ప్రారంభించారు. ‘పిల్లల కోసం మన కవులు’ పేర రాసిన బాలల సాహిత్య వ్యాసాలను 2004లో పుస్తకంగా ప్రచురించారు. ఆ తర్వాత ‘చందమామ రావే’ అనే బాలల గేయ సంకలనం వేశారు. దీనికి 2013లో తెలుగు విశ్వవిద్యాలయం బాలసాహిత్య పురస్కారం లభించింది. 2016లో ‘వెన్నముద్దలు’ పేరుతో బాలగేయాల పుస్తకం తోబాటు పిల్లల కోసం ఎన్నో పుస్తకాలు రాశారు. వివిధ భారతీయ భాషలకు చెందిన 15 పుస్తకాలను తెలుగులోకి అనువదించారు. అంతే కాకుండా 15 పుస్తకాలు, సంచికలకు సంపాదకత్వం వహించే అవకాశం కూడా లభించింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 5వ తరగతి వరకు పాఠ్య పుస్తకాల తయారీ కోసం ఏర్పాటు చేసిన సంపాదక బృందంలో ఒకడిగా పనిచేశారు.
బాల్యం ఇలా గడిచింది..
ఉమ్మడి కరీంనగర్ జిల్లా సిరిసిల్లలోని చందుర్తి మండలంలో గల లింగంపేట గ్రామంలో జన్మించిన పత్తిపాక మోహన్ తండ్రి పవర్లూమ్ వ్యాపారం చేసేవారు. అంతే కాకుండా రాజకీయ నేపథ్యం సైతం ఉంది. చేనేత కుటుంబంలో పుట్టడం వల్ల అనేక కవితలను బాల్యం నుండే నేర్చుకోవడం మొదలు పెట్టారు. తాత శంకరయ్య శిక్షణలో వేమన పద్యాలు, కబీర్ పద్యాలు నేర్చుకున్నారు. ఇక మేనత్త ఇందిరా బాయి అన్ని రకాల తెలుగు పుస్తకాలు, చందమామ వంటి పత్రికలను తెప్పించి చదివించేది. దీంతో సాహిత్యం బాల్యం నుండే అబ్బింది. ఇప్పుడు అదే సాహిత్యం ప్రతిష్టాత్మక కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు పొందడానికి తోడ్పడింది.