(Source: Poll of Polls)
Kavitha Meets KCR: సీఎం కేసీఆర్‌తో కవిత భేటీ, అర్ధరాత్రి ప్రత్యేక విమానంలో ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు
ఢిల్లీలో ఉండగానే ఈడీ విచారణ ముగిసిన తర్వాత రాత్రి తుగ్లక్ రోడ్డుకు చేరుకున్న కవిత.. మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు, వి.శ్రీనివాస్ గౌడ్ తో పాటు న్యాయ నిపుణులతో ప్రత్యేకంగా భేటీ అయినట్లు తెలిసింది.
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఎన్ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ విచారణ ఎదుర్కొన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నిన్న (మార్చి 12) అర్ధరాత్రే ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు చేరుకున్నారు. దాదాపు అర్ధరాత్రి 12 గంటలు దాటాక మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు, వి.శ్రీనివాస్ గౌడ్ ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో హైదరాబాద్ బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్నారు. హైదరాబాద్‌కు వచ్చిన వెంటనే ప్రగతి భవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కల్వకుంట్ల కవిత కలిశారు. ఈడీ విచారణ జరిగిన తీరు, వారు సంధించిన ప్రశ్నలను గురించి వివరించినట్లు సమాచారం.
అంతకుముందు ఢిల్లీలో ఉండగానే ఈడీ విచారణ ముగిసిన తర్వాత రాత్రి తుగ్లక్ రోడ్డుకు చేరుకున్న కవిత.. మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు, వి.శ్రీనివాస్ గౌడ్ తో పాటు న్యాయ నిపుణులతో ప్రత్యేకంగా భేటీ అయినట్లు తెలిసింది. ఈడీ అడిగిన ప్రశ్నలు, విచారణ జరిగిన తీరు వారికి వివరించినట్లు సమాచారం. తర్వాత కేటీఆర్, హరీశ్ రావు, ఇతర మంత్రులు, ఎంపీలు, ముఖ్య నేతలు హైదరాబాద్ కు అర్ధరాత్రి దాటాక చేరుకున్నారు. మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావుతో కలిసి నేరుగా ప్రగతి భవన్‌కు వెళ్లి.. సీఎం కేసీఆర్‌తో భేటీ అయ్యారు. శనివారం ఉదయం నుంచి రాత్రి దాకా జరిగిన ఈడీ విచారణ గురించి కేసీఆర్‌కు వివరించారు. నేడు కేసీఆర్‌తో కలిసి మరోసారి న్యాయ నిపుణులతో చర్చించనున్నట్లు తెలుస్తోంది.
లిక్కర్ స్కాంలో కవిత
ఢిల్లీలో లిక్కర్ పాలసీని మార్చి.. అక్రమాలు జరిగిన అవినీతి చేసిన కేసులో సౌత్ గ్రూప్ నుంచి కవిత ప్రధాన పాత్ర పోషించారని ఈడీ చెబుతోంది. సౌత్ గ్రూప్ లో రామచంద్ర పిళ్లై, సమీర్ మహీంద్రూ, మాగుంట శ్రీనివాస్ రెడ్డికి 65 శాతం పార్టనర్ షిప్ ఉన్నట్లు పేర్కొంది. మనీశ్ సిసోడియా తరపున విజయ నాయర్ పని చేస్తున్నారన్న ఈడీ ఇండో స్పిరిట్ కు కవిత ప్రతినిధిగా అరుణ్ పిళ్లై ఉన్నారని తెలిపింది. సౌత్ గ్రూప్ ప్రతినిధిగా ఉన్న బుచ్చిబాబు ఫిబ్రవరి 28వ తేదీన ఇచ్చిన స్టేట్ మెంట్ లో హవాలా మార్గంలో వంద కోట్లు చెల్లించినట్లు చెప్పినట్లు ఈడీ పేర్కొంది.ఢిల్లీ లిక్కర్ పాలసీ రూప కల్పనలో ఢిల్లీ సీఎం అరవింత్ కేజ్రీవాల్, కవిత మధ్య రాజకీయ అవగాహన కుదిరిందని ఈడీ పేర్కొంది. 2021 మార్చి 19, 20 తేదీల్లో కవితను విజయ నాయర్ కలిశారని, న్యూఢిల్లీలోని గౌరి అపార్ట్ మెంట్ లో జరిగిన సమావేశం తర్వాత అరుణ్ అభిషేక్ 2021 జూన్ లో హైదరాబాద్ లో ఐటీసీ కోహినూరులో విజయ్ నాయర్ దినేశ్ అరోరాతో సమావేశం అయ్యారని ఈడీ పేర్కొంది.
రామచంద్రపిళ్లై వాంగ్మూలంతోనే అసలు చిక్కులు !
ఢిల్లీ లిక్కర్ స్కాంలో ప్రమేయం ఉందని ప్రచారం జరుగుతున్న నిందితులందర్నీ దాదాపుగా అరెస్ట్ చేశారు. ఇప్పటికే స్కాం జరిగినప్పుడు ఢిల్లీ డిప్యూటీ సీఎంగా ఉన్న మనీష్ సిసోడియాతో పాటు శరత్ చంద్రారెడ్డి, మాగుంట రాఘవరెడ్డి, అభిషేక్ బోయినపల్లి సలహా పలువురు మద్యం వ్యాపారులు, ఆప్ సన్నిహితుల్ని అరెస్ట్ చేశారు. అరెస్టయిన వారిలో రామచంద్ర పిళ్లై తాను కవిత బినామీ అని వాంగ్మూలం ఇవ్వడంతో కవితకు చిక్కులు వచ్చాయి. ఈ వాంగ్మూలం ఆధారంగానే ఈడీ కవితను ప్రశ్నించారు. అయితే ఈ వాంగ్మూలాన్ని తాను వెనక్కి తీసుకుంటానని పిళ్లై ఇప్పటికే రౌస్ అవెన్యూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై విచారణ జరగాల్సి ఉంది.