Jeedimetla News : ఆడుకుంటూ సంపులో పడి రెండేళ్ల బాలుడు మృతి
Jeedimetla News : హైదరాబాద్ లోని పేట్ బషీరాబాద్ లో రెండేళ్ల బాలుడు సంపులో పడి మృతి చెందాడు. పొట్ట కూటికి కోసం నగరానికి వచ్చిన ఆ కుటుంబంలో విషాదం అలముకుంది.
Jeedimetla News : హైదరాబాద్ జీడిమెట్ల పేట్ బషీరాబాద్ లో విషాద ఘటన జరిగింది. ప్రమాదవశాత్తు ఇంటి ముందు ఉన్న సంపులో పడి రెండేళ్ల బాలుడు మృతి చెందాడు. ఆడుకుంటూ వెళ్లి బాలుడు సంపులో పడి మృతిచెందాడని స్థానికులు తెలిపారు. ఒడిశా రాష్ట్రానికి చెందిన అమర్ దాస్, ఎమిన్ దాస్ దంపతులు గత పదేళ్ల కిందట బతుకుదెరువు కోసం నగరానికి వలస వచ్చారు. నగర శివారు గుండ్లపోచంపల్లిలోని ఎస్సీ కాలనీలో నివాసం ఉంటూ రోజువారి కూలీ పనులు చేసుకుంటున్నారు. వారికి ఇద్దరు పిల్లలు. భార్య ఎమిన్ దాస్ రోజువారి పనుల్లో భాగంగా ఉదయం పనికి వెళ్లింది. తన భర్త అమర్ దాస్ తో పాటు ఇంట్లో తన పదేళ్ల పెద్దకొడుకుతో పాటు కృష్ణదాస్ (2) తో కలిసి ఉన్నారు. పెద్దకొడుకుకు జ్వరం రాగా ఇంట్లో పడుకొని ఉన్నాడు. మధ్యాహ్నం సమయంలో అమర్ దాస్ ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. చిన్న కొడుకు కృష్ణదాస్ ఆడుకుంటూ ఇంటి ముందు ప్రమాదవశాత్తు సంపులో పడి మృతి చెందాడు. బయటకు వెళ్లి తిరిగి వచ్చిన తండ్రి అమర్ దాస్ సంపులో తేలిన కొడుకు మృతదేహాన్ని చూసి బోరున విలపించడంతో స్థానికులు బాలుడి మృతదేహాన్ని బయటకు తీశారు. పోలీసులకు సమాచారం అందించడంతో సంఘటనా స్థలానికి చేరుకుని బాలుడి మృతదేహాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
భర్తతో గొడవపడి బావిలో దూకిన మహిళ
ఓ మహిళ భర్తతో గొడవ పడి కూతురిని బావిలో పడేసి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. చిన్నారి మృతి చెందగా మహిళ రక్షించారు. ఈ సంఘటన బషీరాబాద్ మండలం మర్పల్లిలో బుధవారం ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానికుల సమాచారం ప్రకారం గ్రామానికి చెందిన కమలమ్మ, నాగప్పలకు ముగ్గురు కుమార్తెలు. కుటుంబ కలహాలతో తల్లి గారి ఊరు మర్పల్లికి వచ్చి కూలీ పనులు చేస్తూ జీవనం సాగిస్తోంది. కొన్ని నెలల క్రితం భర్త కూడా ఇక్కడికే వచ్చి భార్యతో ఉంటున్నాడు. మళ్లీ వీరి మధ్య గొడవలు మొదలయ్యాయి. గ్రామ సర్పంచి నీలమ్మ, పెద్దలు ఇద్దరికి నచ్చజెప్పి పంపారు. మంగళవారం రాత్రి భార్యాభర్తలు మళ్లీ గొడవపడ్డారు. దీంతో మనస్తాపానికి గురైన కమలమ్మ, చిన్నకూతురు వైష్ణవిని(13 నెలలు) తీసుకొని ఇంట్లోంచి బయటికి వెళ్లింది. ఊర్లోని బావి వద్దకు వెళ్లి తాను చనిపోతున్నట్లు అరుస్తూ అందులో దూకింది. అక్కడే ఉన్న గ్రామస్థులు ఆమెను వారిస్తున్నా చిన్నారిని బావిలో పడేసి, ఆమె దూకింది. అక్కడే ఉన్న గ్రామస్థులు నరేష్, ఈశ్వర్, మరికొందరు బావిలోకి దూకి ఇద్దరినీ కాపాడే ప్రయత్నం చేశారు. అయితే అప్పటికే చిన్నారి మృతి చెందింది. కమలమ్మను యువకులు కాపాడారు. ఈ ఘటనపై తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని ఎస్‌ఐ తెలిపారు.
Also Read : Rangareddy Crime : బాలికను గర్భవతి చేసిన యువకుడు, వైద్యులతో కుమ్మక్కై మత్తు మందు ఇచ్చి అబార్షన్!
Also Read : Visakha Bride Death : పెళ్లి పీఠలపై నవ వధువు అనుమానాస్పద మృతి, సహజ మరణమా లేక ఆత్మహత్యా?