Visakha Bride Death : పెళ్లి పీఠలపై నవ వధువు అనుమానాస్పద మృతి, సహజ మరణమా లేక ఆత్మహత్యా?
Visakha Bride Death : విశాఖలో నవవధువు మృతిపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. గన్నేరు పప్పు తీసుకోవడం వల్ల వధువు మృతి చెంది ఉండవచ్చని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
Visakha Bride Suspicious Death : విశాఖలో నవవధువు మృతి అనుమానాస్పదంగా మారింది. సహజ మరణమా లేక ఆత్మహత్య అనే విషయంపై వైద్యులు పరీక్షలు చేస్తున్నారు. కుటుంబ సభ్యులు ఇచ్చిన సమాచారంతో పోలీసులు సీఆర్పీసీ174 సెక్షన్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే గన్నేరు పప్పు తీసుకోవడం వలన మృతి చెంది ఉండవచ్చని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
విశాఖలోని మధురవాడలో విషాద ఘటన చోటు చేసుకుంది. పెళ్లిపీటల మీదే వధువు కుప్పకూలిన సంఘటన బుధవారం రాత్రి జరిగింది. కాసేపట్లో పెళ్లనగా పెళ్లికుమార్తె చనిపోయిన విషాద సంఘటన ఇది. హైదరాబాద్ కు చెందిన ముంజేటి ఈశ్వరరావు, అనురాధ కుమార్తె సృజన(22)కు విశాఖ పీఎంపాలెం ప్రాంతానికి చెందిన నాగోతి అప్పలరాజు, లలిత కుమారుడు శివాజీతో సంబంధం కుదిరింది. ఈ నెల 11న రాత్రి 10 గంటలకు వివాహం నిశ్చయించారు. ఈశ్వరరావు స్వస్థలం శ్రీకాకుళం జిల్లా జలుమూరు. శివాజీ గతంలో టీఎన్ఎస్ఎఫ్ కార్యనిర్వాహక కార్యదర్శిగా కూడా పనిచేశారు. ఈ నేపథ్యంలో మూడు రోజులుగా ఇరువర్గాల ఇళ్లలో వివిధ కార్యక్రమాలు జరిగాయి. బుధవారం జరిగిన అనేక కార్యక్రమాల్లో వధూవరులిద్దరూ హుషారుగా పాల్గొన్నారు. వివాహ రిసెప్షన్ పలువురు టీడీపీ ప్రముఖ నేతలు కూడా హాజరయ్యారు. ఈ నేపథ్యంలో ముహూర్తం సమయం దగ్గర పడుతుండగా సృజనకు నీరసంగా అనిపించింది. వరుడు జీలకర్ర, బెల్లం పెడుతున్న సమయంలో సృజన అక్కడికక్కడే కుప్పకూలిపోయింది. తక్షణమే ఆమెను కుటుంబీకులు ఆస్పత్రికి తరలించారు.
అసలేం జరిగింది?
విశాఖలోని మధురవాడలో పెళ్లింట విషాదం చోటుచేసుకుంది. పెళ్లి తంతులో జీలకర్ర బెల్లం తలమీద పెడుతున్న సమయంలో వధువు మృతి చెందిన తీవ్ర విషాద ఘటన జరిగింది. వరుడు తెలుగు యువత అధ్యక్షుడు శివాజీతో సృజన అనే యువతికి వివాహం కుదిరింది. ఇరువురికీ ఇవాళ వివాహం జరుగుతుంది. ముహూర్త సమయంలోనే ఈ ఘటన చోటుచేసుకుంది. జీలకర్ర బెల్లం పెడుతుండగా వధువు స్పృహ తప్పి పడిపోవడంతో వధువును వెంటనే ఆసుపత్రికి తరలించారు బంధువులు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ వధువు మృతి చెందడంతో ఆ కుటుంబంలో విషాదచాయలు అలుముకున్నాయి. వధూవరులకు బుధవారం రాత్రి రిసెప్షన్ జరిగింది. దీంతో పెళ్లి ఏర్పాట్లు అన్ని పూర్తిచేసి వివాహం చేసుకోవడానికి ఇద్దరు పెళ్లి పీఠలు ఎక్కారు. జీలకర్ర బెల్లం పెడుతున్న సమయంలో ఒక్కసారిగా వధువు నేలకూలింది. దీంతో వివాహ వేడుకలో ఇలా జరగడంతో అందరూ ఒక్కసారిగా షాకయ్యారు. వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందించినా వధువు మృతి చెందడం పెళ్లింట తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ విషాధ ఘటనతో బంధువులందరూ కన్నీరుమున్నీరుగా విలపించారు. వధువు మృతికి కారణం తెలియాల్సి ఉంది.