Jagityal News : వీధి శునకాలే ఆ కుటుంబానికి ఆత్మీయ నేస్తాలు, 19 శునకాలను పెంచుతున్న ఫ్యామిలీ
Jagityal News : ఆ కుటుంబానికి శునకాలే బంధువులు. కష్టం వచ్చిన, ఆనందం వచ్చినా వాటితోనే పంచుకుంటారు. నిరుపేద కుటుంబం అయినా 19 శునకాలను సాకుతున్నారు.
Jagityal News : శునకం అంటే విశ్వాసానికి మారు పేరు. చాలా మంది యజమానులు పెంపుడు శునకాలతో ఎంతో అనుబంధాన్ని పెంచుకుంటారు. శునకాలు కూడా వారి పట్ల అంతే విశ్వాసంతో ఉంటాయి. అంలాటి పెంపుడు శునకాలే ఇప్పుడు వారి బంధువులు అయ్యాయి. ఆ కుటుంబానికి నిజమైన బంధువులు విశ్వాసానికి మారుపేరైన శునకాలే అంటున్నారు.
శునకాలే ఆత్మీయ బంధువులు
జగిత్యాల జిల్లా మల్యాల మండలం లంబాడిపల్లికి చెందిన కట్ల గంగారాం కూలి పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. గ్రామీణ ఉపాధిహామీ పథకంలో రోజువారి కూలి పనులుచేస్తుంటారు. అయితే గంగారాం కుటుంబ సభ్యులకి శునకాలు అంటే ఎనలేని ప్రేమ. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 19 శునకాలని పెంచుతూ మమకారాన్ని చాటుతున్నారు. వారు చేసేది కూలిపని అయిన సంపాదనలో ఎనభై శాతం శునకాల ఆహారానికే ఖర్చు చేస్తున్నారు. ఎండకాలంలో చల్లదనానికి ఏకంగా ఓ కూలర్ కూడా ఏర్పాటు చేశారు. గంగారాం దంపతులు కొద్దిరోజుల క్రితం గ్రామంలో ఓ శునకం పిల్లలకి జన్మనిచ్చి చనిపోయింది. అది చూసి చలించిన గంగారాం కుటుంబం ఆ చిన్న శునకాలని తీసుకువచ్చి పెంచుకున్నారు. ఇప్పుడు ఆ శునకాలు తిరిగి పిల్లలు పెట్టడంతో దాదాపు నలభై వరకు శునకాలు అయ్యాయి. వాటిల్లో కొన్నింటిని గ్రామంలో ఇతరులకు ఇచ్చారు. వారి సంపాదనలో దాదాపు అధిక భాగం శునకాలకు ఖర్చు చేసేవారు. ఇప్పుడు పందొమ్మిది శునకాలు ఉండడంతో వాటిని అల్లారుముద్దుగా తమ కుటుంబ సభ్యులుగా పెంచుకుంటున్నారు.
శునకాల కోసం కూలర్
గంగారాం ఇళ్లు కూలిపోడానికి సిద్ధంగా ఉంది. ఎండ, వాన, చలి నుంచి రక్షించుకోడానికి గూనపెంకల ఇళ్లుపై కవర్లతో కప్పుకున్నారు. పూర్తిగా నిరుపేద అయిన గంగారాం కుటుంబ సభ్యుల మనసు మాత్రం విశాలమని చెప్పుకోవవ్చు. ఎండలు ఎక్కువగా ఉండడంతో ఇప్పుడు శునకాల కోసం ఓ కూలర్ ని ఏర్పాటు చేశారు. గంగారాం కుటుంబ సభ్యులకు శునకాలపై మక్కువతో వాటి ఆహారం కోసం అన్నం కాకుండా రోజు వంద రూపాయలు ఖర్చు చేస్తారు. పాలు, బిస్కట్ లు వాటికి అందిస్తారు. అంతేకాదు శనకాల కోసం ఓ మంచం, దుప్పటి ఏర్పాటు చేసి వాటిని అల్లారు ముద్దుగా పెంచుతున్నారు. ఇప్పుడు ఎండకాలంలో చల్లదనం కోసం ఓ కూలర్ ని ఏర్పాటు చేశారు. కూలర్ శునకాల చల్లదనం కోసమే వినియోగిస్తామని, ఇరవై నాలుగు గంటలు నడుస్తుండడంతో నెలకి దాదాపుగా రూ.1500 కరెంటు బిల్లు వచ్చిందన్నారు. అమితంగా ప్రేమించడం వలన ఆ శునకాలు కూడా చాలా విశ్వాసంగా ఉంటాయి. మనుషుల కంటే కుక్కలనే ఎక్కువగా నమ్ముతామని ఆ కుటుంబ సభ్యులు అంటున్నారు. వారు ఏడుస్తే అవి కూడా ఏడుస్తున్నాయని, ఇంట్లో శునకాలు ఉన్నారని తమ ఇంటికి బంధువులు ఎవ్వరూ కూడా రారాని, అయినా తమకి శునకాలు అంటేనే మమకారమని అంటున్నారు.