ISRO research: మీ ప్రాంతాల్లో ఆదిత్య 369 లాంటి మెషిన్లు చూస్తే పోలీసులకు చెప్పండి- బహుమతులు ఇస్తారు!
ISRO research: ఆదిత్య 369 సినిమా చూశారా అందులో ఉన్న టైమ్ మెషిన్ లాంటిదే ఇప్పుడు హైదరాబాద్‌లో కలకలం రేపింది. తీరా ఆరా తీస్తే అది ఇస్రో శాస్త్రవేత్తలు వదిలిన పరికరంగా తేలింది.
ISRO Research: వికారాబాద్ జిల్లా మర్పల్లి మండలం మొగిలిగుండ్లలో వింత శకటం కలకలం రేపింది. ఆదిత్య 369 సినిమాలో చూపించిన టైమ్‌మెషిన్‌లా ఉండే ఆ ఆకారాన్ని చూసిన జనం ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. ఎక్కడ నుంచో వచ్చి పంటపోలాల్లో పడిన శకటాన్ని చూసేందుకు ప్రజలు పరుగులు పెట్టారు. కొందరు వింతగా చూస్తూ కామెడీలు చేస్తుంటే మరికొందరు భయంతో అటు చూడటానికే ధైర్యం చేయలేకపోయారు.
విషయం తెలుసుకున్న అధికారులు వచ్చి చూసి అది ఇస్రో పంపిన వాహకంగా నిర్దారించారు. హైదరాబాద్ వేదికగా ఇస్రో శాస్త్రవేత్తలు బెలూన్లతో ప్రయోగాలు చేస్తున్నారు. ముఖ్యంగా టాటా ఇన్ స్టిట్యూట్ ఫండమెంటల్ రీసెర్ట్, డిపార్ట్ మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ, ఇస్రో ఆధ్వర్యంలో ఈ ప్రయోగాలు నిర్వహిస్తున్నారు. ఎత్తయిన ప్రదేశాల్లో పరిశోధనల కోసం శాస్త్రీయ పరికరాలను మోసుకెళ్లగల బెలూన్లతో ప్రయోగాలు చేశారు. ఈ నెల రెండో వారం నుంచి వచ్చే ఏడాది ఏప్రిల్ 3వ తేదీ వరకు ఈ ప్రయోగాలు సాగనున్నాయి.
బెలూన్ ఫెసిలిటీ ఆఫ్ టాటా ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్ట్, ఈసీఐఎల్ నుంచి విడతల వారీగా పది బెలూన్లను ప్రయోగించనున్నారు. సన్నని ప్లాస్టిక్ ఫిల్ములతో దాదారు 50 నుంచి 85 మీటర్ల వ్యాసార్థం ఉండి, హైడ్రోజన్ నింపిన బెలూన్ విమానాలను రాత్రి 8 గంటల నుంచి ఉదయం 6.30 గంటల మధ్య ప్రయోగిస్తున్నారు. ఆ బెలూన్లు 30 నుంచి 42 కిలో మీటర్ల ఎత్తులో ఎగురుతాయి. దాదాపు 10 గంటల పాటు ఆయా ఎత్తులో నిలకడగా ఉండి, తర్వాత కిందకు వస్తాయి.
అలా వీళ్లు పంపిన బెలూన్లలో ఒకటే ఇప్పుడు మొగిలిగుండ్లలో కనిపించిన వింత ఆకారం. దాన్నే చూసిన జనాలు రకరకాల కథనాలు ప్రచారం చేశారు. ప్రజల్లో భయాందోళనలకు కారణమయ్యారు.
ఏపీ, ఉత్తర కర్ణాటక, తెలంగాణల్లో ల్యాండయ్యే అవకాశం..
ప్రయోాగాల కోసం పంపించిన ఈ బెలూన్లు భూమికి తిరిగి వచ్చే క్రమంలో హైదారబాద్‌కు 200 నుంచి 350 కిలోమీటర్ల దూరంలో ల్యాండ్ అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. విశాఖపట్నం- హైదరాబాద్ - షోలాపూర్ లైన్‌లో ఏపీ, ఉత్తర కర్ణాటక, మహారాష్ట్రతోపాటు తెలంగాణలోని ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, హైదరాబాద్, జగిత్యాల, జయశంకర్ భూపాలపల్లి, జోగులాంబ గద్వాల, కామారెడ్డి, కరీంనగర్, ఖమ్మం, కుమురం భీం, మహబూబాబాద్, మహబూబ్ నగర్, మంచిర్యాల, మెదక్, మల్కాజిగిరి, నాగర్ కర్నూల్, నల్లగొండ, నిర్మల్, నిజామాబాజ్, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, రంగారెడ్డి, సంగారెర్డి, సిద్దిపేట, సూర్యాపేట, వికారాబాద్, వనపర్తి, వరంగల్, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో ఈ బెలూన్ విమానాలు నెమ్మదిగా ల్యాండయ్యే అవకాశం ఉంది.
ఆ బెలూన్లను తాకడం చాలా ప్రమాదకరం..
ఆ పారాచూట్, బెలూన్ విమాన పరికరాలను ఎవరైనా గుర్తిస్తే.. వాటిని ముట్టుకోవద్దని చెబుతున్నారు శాస్త్రవేత్తలు. వాటిని తాకడం కానీ... అక్కడి నుంచి తొలగించడం కానీ చేయవద్దని సూచిస్తున్నారు. వాటిని గుర్తిస్తే వెంటనే తమకు సమాచారం అందించాలని విజప్తి చేస్తున్నారు. తమ నెంబర్ తెలియకపోతే సమీపంలోని పోలీస్ స్టేషన్, పోస్టాఫీస్, జిల్లా అధికారులకు తెలియజేయాలని అభ్యర్థించారు. సమాచారం ఇచ్చిన వారికి రివార్డు కూడా ఇస్తామని ప్రకటించారు.
బెలూన్ విమానాల్లోని పరికరాలు చాలా సున్నితంగా ఉంటాయి. వాటిని తాకితే శాస్త్రీయ డాటా పోతుందని శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బెలూన్‌లోని కొన్ని పరికరాలపై అధిక వోల్టేజీ పవర్ ఉండే అవకాశం ఉందని, వాటిని తాకడం చాలా ప్రమాదకరం అని హెచ్చరించారు. కాబట్టి ప్రజలెవరూ వాటిని తాకకూడదు. వాటికి దూరంగా ఉండాలన్నారు. గుర్తించిన వెంటనే సమాచారం అందిస్తే డాటాను పొందవచ్చని తెలిపారు. తెలియని వాళ్లకు కూడా ఈ సమాచారాన్ని అందించాలన్నారు.