KTR : కేసీఆర్ ఏం చేస్తున్నారో చెప్పిన కేటీఆర్ - తెలంగాణ ప్రజలకు త్వరలో శుభవార్త ఉంటుందని ప్రకటన !
మేనిఫెస్టోపై కేసీఆర్ మేథోమథనం జరుపుతున్నారా ? అందుకే పూర్తి సమయం కేటాయిస్తున్నారా ?
KTR : తెలంగాణ సీఎం కేసీఆర్ ఇరవై రోజుల నుంచి బయట కనిపించడం లేదు. కొద్ది రోజుల క్రితం ఆయనకు వైరల్ ఫీవర్ వచ్చిందని కేటీఆర్ ట్వీట్ చేశారు. తర్వాత అప్ డేట్ లేదు. తాజాగా వరంగల్ పర్యటనలోకేసీఆర్ ఏం చేస్తున్నారో కేటీఆర్ పరోక్షంగా చెప్పారు. వరంగల్‌లో పలు కార్యక్రమాల్లో పాల్గొన్న ఆయన ప్రజలు ఎలా మంచి చేయాలన్నదానిపై కేసీఆర్ ఆలోచన చే్స్తున్నారని.. త్వరలోనే ప్రజలకు శుభవార్త ఉంటుందని ప్రకటించారు.
కేసీఆర్ మేనిఫెస్టోపై మేథోమథనం చేస్తున్నారా ?
కేసీఆర్ రాజకీయ వ్యూహాల విషయంలోనే సొంతంగా పని చేస్తున్నారని బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. ముఖ్యంగా కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారంటీలను తలదన్నేలా పథకాలు ప్రకటించేందుకు కసరత్తు చేస్తున్నారని భావిస్తున్నారు. ఈ విషయాన్ని కేటీఆర్ పరోక్షంగా వరంగల్ సమావేశలో ప్రకటించారు. ఎవరో వస్తరు.. ఏదో చేస్తారనే ఆలోచన అక్కర్లేదని.. కచ్చితంగా తొందరలోనే మీరంతా శుభవార్త వింటారని మంత్రి కేటీఆర్ అన్నారు. దీనిపై ముఖ్యమంత్రి కూడా ఆలోచన చేస్తున్నారని తెలిపారు. పెన్షన్లు ఎంత పెంచాలి? ఆడబిడ్డలకు ఎలా సాయం చేయాలి? ఎవరెవరికి ఏమేమీ చేయాలి? ఈ పదేండ్లలో చేసినదానికి ఇంకా ఎక్కువ ఎలా చేయాలనే ఆలోచనలో ఉన్నారని అన్నారు. తొందరలోనే మీకు ఆ శుభవార్త కూడా వస్తదని అన్నారు. ఇప్పటిదాకా ఇచ్చింది కేసీఆరే.. రేపు భరోసాగా ఇచ్చేది కూడా కేసీఆరే. ఎందుకంటే మళ్లీ వచ్చేది.. ముఖ్యమంత్రి అయ్యేది కేసీఆరే అని ధీమా వ్యక్తం చేశారు.
ఎలాంటి పథకాలనైనా అమలు చేసే సామర్థ్యం కేసీఆర్‌కే ఉందన్న కేటీఆర్
విప్లవాత్మక పథకాలు ప్రవేశపెట్టాలంటే.. చారిత్రక కార్యక్రమాలు చేయాలంటే నాయకులకు తెగువ, తెగింపు ఉండాలని.. అల్లాటప్ప నాయకులతో విప్లవాత్మక పథకాలు రావని కేటీఆర్ వ్యాఖ్యానించారు. స్వాతంత్య్రం అనంతరం 76 ఏండ్లలో ఎవరూ పెట్టని విధంగా కేసీఆర్ నాయకత్వంలో దళితబంధు అనే విప్లవాత్మక పథకాన్ని పెట్టుకున్నామని అన్నారు. అందులో భాగంగానే ఇవాళ వరంగల్ తూర్పు నియోజకవర్గంలో 1100 మందికి దళిత బంధు అందుతున్నదని తెలిపారు. బాబా సాహెబ్ ఆశయాలను ముఖ్యమంత్రి ముందుకు తీసుకెళ్లున్నారని అన్నారు. కుల రహిత సమాజం, వివక్ష లేని సమాజం ఉండాలంటే ఆర్థిక అసమానతలు తొలగిపోవాలనే ఆకాంక్షతో సీఎం దళితబంధు పథకాన్ని ప్రవేశపెట్టారు. కేసీఆర్ ప్రభుత్వానికి ప్రజలపై ఎంత ప్రేమ ఉందో ఆలోచన చేయాలని మంత్రి కేటీఆర్ సూచించారు.
ఒక్క చాన్స్ ఇచ్చి గోసపడవద్దు !
కొంతమంది వచ్చి ఒక్క ఛాన్స్ ఇవ్వాలని అడుగుతున్నారని.. ఒక్క ఛాన్స్ కాదు.. 11 ఛాన్స్‌లు .. 55 ఏండ్లు అధికారం ఇచ్చారని గుర్తు చేశారు. అప్పుడు మరి రైతులకు పైసలు ఇవ్వాలనే సోయి ఎందుకు లేదు? రైతుకు పెట్టుబడి ఇవ్వాలనే ఆలోచన ఎందుకు చేయలేదు? అని ప్రశ్నించారు. ఇవాళ కేసీఆర్ నాయకత్వంలో 73 వేల కోట్ల రూపాయలు ఈ ఐదారేండ్లలో 70 లక్షల మంది రైతుల ఖాతాలో పడ్డాయన్నారు. ఇదివరకు ఉన్న వాళ్లు మంచి నీళ్లు ఇవ్వాలనే ఆలోచన చేసిండ్రా అని ప్రశ్నించారు. అదే కేసీఆర్ నాయకత్వంలో మిషన్ భగీరథ కార్యక్రమం కింద 43 వేల కోట్లు ఖర్చు చేసి బ్రహ్మాండంగా ఇంటింటికీ తాగునీరు అందిస్తున్నారని తెలిపారు. తెలంగాణ రాకముందు ఆనాడు కరెంటు ఎట్లుండె.. ఇప్పుడు ఎట్లయ్యిందనేది ఒకసారి ఆలోచించుకోవాలని సూచించారు.