Special Trains: హైదరాబాద్ నుంచి పలు ప్రాంతాలకు ప్రత్యేక రైళ్లు, టైమింగ్స్ ఇవే
Indigo Flights cancelled | ఓవైపు దేశ వ్యాప్తంగా ఇండిగో విమానాల రద్దు, మరోవైపు ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని రైల్వేశాఖ కొన్ని ప్రత్యేక రైలు సర్వీసులను ప్రకటించింది.

Special trains from Hyderabad | హైదరాబాద్: ప్రయాణీకుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఇండియన్ రైల్వేస్ (Indian Raiways) హైదరాబాద్‌లోని చర్లపల్లి, హైదరాబాద్ (నాంపల్లి) నుంచి పలు ప్రాంతాలకు ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. ఈ ప్రత్యేక రైలు సర్వీసులు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మీదుగా ప్రయాణించనున్నాయి.
ప్రత్యేక రైళ్ల పూర్తి వివరాలు
రైల్వేశాఖ ప్రకటించిన వివరాల ప్రకారం, ముఖ్యంగా చర్లపల్లి, హైదరాబాద్ స్టేషన్ల నుంచి నాలుగు జతల (8) ప్రత్యేక రైళ్లు నడవనున్నాయి. ప్రయాణికులు ఈ ప్రత్యేక రైళ్లలో ముందస్తు రిజర్వేషన్ చేసుకునే సదుపాయాన్ని రైల్వేశాఖ కల్పించింది.
చర్లపల్లి- హజ్రత్ నిజాముద్దీన్: సోమవారం (డిసెంబర్ 8న) రాత్రి 9:45 గంటలకు చర్లపల్లి నుంచి ఢిల్లీలోని హెచ్. నిజాముద్దీన్‌కు బయలుదేరి, తిరిగి డిసెంబర్ 10న ఉదయం 4:00 గంటలకు హజ్రత్ నిజాముద్దీన్ నుంచి చర్లపల్లికి ప్రత్యేక రైలు నడుస్తుంది.
చర్లపల్లి- యలహంక: సోమవారం (డిసెంబర్ 8న) రాత్రి 10:00 గంటలకు చర్లపల్లి నుంచి యలహంకకు, తిరిగి డిసెంబర్ 9న మధ్యాహ్నం 1:00 గంటకు యలహంక నుంచి చర్లపల్లికి ప్రత్యేక రైలు నడుపుతున్నారు.
చర్లపల్లి- షాలిమార్: సోమవారం (డిసెంబర్ 8న) రాత్రి 9:35 గంటలకు చర్లపల్లి నుంచి షాలిమార్‌కు బయలుదేరగా, డిసెంబర్ 10న మధ్యాహ్నం 12:10 గంటలకు షాలిమార్ నుంచి చర్లపల్లికి ప్రత్యేక రైలు నడవనుంది.
హైదరాబాద్ (నాంపల్లి)- కొట్టాయం: సోమవారం రాత్రి 9:50 గంటలకు హైదరాబాద్ నుంచి కొట్టాయంకు బయలుదేరనుంది. తిరిగి డిసెంబర్ 10న ఉదయం 7:45 గంటలకు కొట్టాయం నుంచి హైదరాబాద్‌కు ప్రత్యేక రైలు నడపనున్నట్లు రైల్వేశాఖ తెలిపింది.
ఇండిగో విమానాల రద్దు సమయంలో ప్రత్యామ్నాయ రవాణా ఏర్పా్ట్లు
ఇటీవల ఇండిగో విమానయాన సంస్థ దేశ వ్యాప్తంగా పలు నగరాల నుండి రాకపోకలు సాగించే పలు రైళ్లను గత నాలుగు రోజులుగా రద్దు చేస్తోంది. ఇండిగో ఎయిర్‌లైన్స్ శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో సైతం వందలాది విమాన సర్వీసులు రద్దు చేసింది. విమానాలు రద్దు కారణంగా వేలాది మంది ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
ఇండిగో విమానాల రద్దు వల్ల ప్రయాణ అవసరాలు ఒక్కసారిగా పెరిగిన కారణంగా ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని రైల్వేశాఖ ఈ ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. ఈ ప్రత్యేక రైళ్లు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని పలు ముఖ్య రైల్వే స్టేషన్ల మీదుగా ప్రయాణించనున్నాయి. అలాగే, ఇండిగో విమానాల రద్దుతో తలెత్తిన డిమాండ్‌ను తీర్చడానికి స్పైస్‌జెట్ వంటి ఇతర విమానయాన సంస్థలు కూడా అదనపు విమాన సర్వీసులను నడుపుతున్నాయి. ఈ అదనపు రైలు సర్వీసులు ప్రయాణీకుల రద్దీని సమర్థవంతంగా నిర్వహించడానికి సహాయపడతాయి.
సరైన నిర్వహణ, ప్లానింగ్ లేని కారణంగా ఇండిగో ఎయిర్‌లైన్స్ గత కొన్ని రోజులుగా ప్రతిరోజూ వెయ్యి వరకు విమాన సర్వీసులు రద్దు చేస్తోంది. దాంతో ముందగానే జర్నీ ప్లాన్ చేసుకుని, టికెట్లు బుక్ చేసుకున్న ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. కొందరైతే పెళ్లి రద్దు చేసుకోగా.. కొందరు ఆన్‌లైన్లో వేడుకలకు హాజరవుతున్నారు. జాబ్ ఇంటర్వ్యూ ఉన్నాయని కొందరు ఆవేదన వ్యక్తం చేస్తుంటే.. కూతురికి రక్తం వస్తుందని ప్యాడ్ కావాలని ఇండిగో సిబ్బందిపై ఓ తండ్రి ఆగ్రహం వ్యక్తం చేయడం పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.






















