IndiGo Flight Cancellations: అప్పటిలోగా ఫ్లైట్ టికెట్ రిఫండ్ చేయండి.. ఇండిగోకు కేంద్రం ఆదేశాలు
Indigo Ticket Refund Date: డిసెంబర్ 6న కేంద్రం, ప్రయాణికులకు టికెట్ డబ్బులు తిరిగి చెల్లించాలని, లగేజీని కూడా తిరిగి ఇవ్వాలని ఆదేశించింది.

IndiGo Flight Cancellations | న్యూఢిల్లీ: ఇండిగో విమానాలు రద్దు కావడంతో వేలాది మంది ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. డిసెంబర్ 6న సైతం వందల విమాన సర్వీసులు రద్దు చేసింది ఇండిగో. ఈ క్రమంలో రద్దు చేసిన విమానాలకు టికెట్ డబ్బులను తిరిగి చెల్లించే ప్రక్రియపై విమానయాన మంత్రిత్వ శాఖ చర్యలు చేపట్టింది. రద్దయిన విమానాల్లో టికెట్లు బుక్ చేసుకున్న ప్రయాణికులకు డిసెంబర్ 7వ తేదీన టికెట్ డబ్బులు రిఫండ్ చేయాలని ఇండిగో సంస్థను ఆదేశించింది.
ప్రయాణికుల వస్తువులను కూడా వచ్చే రెండు రోజుల్లో వారికి చేరవేయాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. డిసెంబర్ 5న దేశంలోనే అతిపెద్ద విమానయాన సంస్థ ఇండిగో 1,000 కంటే ఎక్కువ విమానాలను రద్దు చేయగా.. శనివారం కూడా ఇదే పరిస్థితి కొనసాగడంతో ప్రయాణికులు విమానాశ్రయాల్లో చిక్కుకుని తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దాంతో రీఫండ్ ప్రక్రియలో ఎలాంటి జాప్యం లేదా నిబంధనలను పాటించకపోతే తక్షణమే చర్యలు తీసుకుంటామని కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖ తెలిపింది.
డిసెంబర్ 7 రాత్రి వరకు రీఫండ్
రద్దు చేసిన లేదా అంతరాయం కలిగిన అన్ని విమానాలకు రీఫండ్ ప్రక్రియను ఆదివారం రాత్రి 8 గంటలలోపు పూర్తి చేయాలని మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ట్రావెల్ ప్లాన్ రద్దు కావడంతో ప్రభావితమైన ప్రయాణికుల నుండి ఇండిగో ఎటువంటి రీషెడ్యూలింగ్ ఛార్జీలు వసూలు చేయకూడదని సైతం ప్రకటనలో పేర్కొంది. శనివారం నాడు పలు విమానాశ్రయాల్లో 500 కంటే ఎక్కువ విమానాలు రద్దు చేశారు.
ప్రయాణికుల కోసం ప్రత్యేక సహాయం మరియు రీఫండ్ సౌకర్య కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని కూడా ఇండిగోను ఆదేశించింది. విమాన సర్వీసు కార్యకలాపాలు పూర్తిగా స్థిరపడే వరకు, ఆటోమేటిక్ రీఫండ్ ప్రక్రియ కొనసాగుతుంది. అంతేకాకుండా, విమానాలు రద్దు లేదా ఆలస్యం కావడానికి గల కారణాల వల్ల ప్రయాణికుల వస్తువులను గుర్తించి, వాటిని వచ్చే 48 గంటల్లో సంబంధిత వ్యక్తులకు చేరవేయాలని ఎయిర్‌లైన్‌కు మంత్రిత్వ శాఖ సూచించింది.
రిఫండ్ ఎవరికి వర్తిస్తుంది..
డిసెంబర్ 5 నుంచి డిసెంబర్ 15 తేదీల మధ్య ఇండిగో విమానంలో ప్రయాణించే టిక్కెట్లను రద్దు చేస్తే, పూర్తి రీఫండ్ ఏ ఖాతా నుంచి చెల్లింపు జరిగిందో అదే ఖాతాకు పంపుతామని సంస్థ తెలిపింది. ఎవరైనా తమ ట్రావెల్ డేట్ మార్చుకోవాలనుకుంటే, అదనపు ఛార్జీలు లేకుండానే మరో తేదీకి రీషెడ్యూల్ చేసుకోవాలని సూచించింది.
చివరి నిమిషంలో విమానాలు రద్దు అయి, టిక్కెట్లు తిరిగి బుక్ చేసుకోవడానికి సమయం లేదా అవకాశం లేని ప్రయాణికులకు ఈ నిర్ణయం ఉపయోగపడుతుంది. తమ వల్ల జరిగిన తప్పిదం, నిర్లక్ష్యానికి ఇండిగో ఎయిర్‌లైన్స్ కూడా క్షమాపణలు చెప్పింది. పరిస్థితిని సాధారణ స్థితికి తీసుకురావడానికి ప్రస్తుతం ప్రయత్నాలు కొనసాగుతున్నాయని సంస్థ తెలిపింది. గత రెండు రోజులుగా ఎయిర్ పోర్టులో ఉండి తినడానికి ఆహారం, తాగునీళ్లు, సరైన వసతి లేక ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో యుద్ధ ప్రాతిపదికన కేంద్రం చర్యలు చేపట్టింది. డిసెంబర్ 7వ తేదీ రాత్రి 8లోగా టికెట్ రిఫండ్ చేయాలని ఇండిగో సంస్థను ఆదేశించింది. లేకపోతే చర్యలు తీసుకుంటామని ప్రకటనలో తెలిపింది.






















