పర్యావరణ సమతుల్యతలో పెద్దపులి అగ్రభాగం, సేవ్ టైగర్ ఉద్యమానికి ఎంపీ సంతోష్ కుమార్ మద్దతు
50 ఏళ్ల క్రితం 1800 పులులు.. నేడు సుమారు 3వేలుప్రపంచంలోని 70శాతం పులులకు మనదేశమే ఆలవాలం
దేశ వ్యాప్తంగా అడవుల రక్షణ, పులుల సంరక్షణ కోసం కేంద్ర ప్రభుత్వం 1973లో ప్రాజెక్టు టైగర్ చేపట్టింది. సేవ్ టైగర్ ఉద్యమానికి ఏప్రిల్ 1తో యాభై ఏళ్లు నిండాయి. దేశవ్యాప్తంగా ఈ ప్రాజెక్ట్ టైగర్ కింద తీసుకున్న చర్యల వల్ల పులుల సంఖ్య కూడా గణనీయంగా పెరిగింది. 1973లో 1827 ఉన్న పులుల సంఖ్య 2022 నాటికి 2,967కి చేరింది. టైగర్ రిజర్వ్ ఫారెస్టుల సంఖ్య 9 నుంచి 53కు పెరిగింది. ఈ నేపథ్యంలో ప్రాజెక్ట్ టైగర్ ప్రాధాన్యతను రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్ కుమార్ ట్విట్టర్ ద్వారా పంచుకున్నారు.
గంభీరమైన జంతువును కాపాడాల్సిన బాధ్యత మనదే- ఎంపీ సంతోష్
సేవ్ టైగర్ ఉద్యమం గోల్డెన్ జూబ్లీ సందర్భంగా అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ విడుదల చేసిన టైగర్ బుక్, టీ షర్ట్, కాఫీ మగ్, సావ్‌నీర్లను ఎంపీ సంతోష్ కుమార్ ప్రదర్శించారు. తెలంగాణ ప్రభుత్వం, అటవీశాఖ ద్వారా అమ్రాబాద్, కవ్వాల్ పులుల అభయారణ్యాలను బాగా నిర్వహిస్తోందని, పులుల సంఖ్య గణనీయంగా పెరుగుతోందని ఎంపీ సంతోష్ కుమార్ ఆనందం వ్యక్తం చేశారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ తరపున దేశవ్యాప్తంగా పచ్చదనం పెంపునకు, పర్యావరణ రక్షణపై అవగాహన పెంచేందుకు కృషి చేస్తున్నామని అన్నారు. పులుల రక్షణకు తమ మద్దతు ఉంటుదని తెలిపారు. పర్యావరణ సమతుల్యతలో పెద్దపులి అగ్రభాగాన ఉంటుందని, రాబోయే తరాల కోసం ఈ గంభీరమైన జంతువును కాపాడాల్సిన బాధ్యత మన అందరిపై ఉందని ఎంపీ సంతోష్ కుమార్ అభిప్రాయపడ్డారు.
50 ఏళ్లలో ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్న ప్రాజెక్ట్ టైగర్
వాస్తవానికి ఐదు దశాబ్దాల క్రితం భారతదేశంలోని పులుల సంఖ్య 10వేల నుంచి 1800కి పడిపోయిందని గణాంకాలు చెబుతున్నాయి. అడవుల నరికివేత, వేటగాళ్ల విశృంఖలత్వం వెరసి పులి జాడ కనుమరుగైంది. అందుకే సేవ్ టైగర్ ఉద్యమం ప్రతిష్ఠాత్మకంగా పురుడుపోసుకుంది. ఈ క్రమంలోనే ఏప్రిల్1, 1973న పులిని జాతీయ జంతువుగా కేంద్రం ప్రకటించింది. ఫుడ్ చైన్‌లో ఎగువన ఉన్న ఈ జాతిని కాపాడ్డానికి అనేక రిజర్వ్ ఫారెస్టులను ఏర్పాటు చేశారు. ఈ 50 ఏళ్లలో ప్రాజెక్ట్ టైగర్ ఎన్నో ఎత్తుపల్లాలను చవిచూసింది. ఈ కాన్సెప్ట్ చేపట్టిన 30 ఏళ్ల తర్వాత పులల గణన చేపడితే వాటి సంఖ్య పెరగకపోగా, 1400కు పడిపోయిందని తెలిసింది. ఈ పరిణామాన్ని పెను ప్రమాద ఘంటికగా ప్రాజెక్ట్ భావించింది. టెక్నాలజీని పెంచారు. నిఘా పటిష్టం చేశారు. అడవి నరికివేతకు గురికాకుండా పకడ్బందీ ప్రణాళిక చేపట్టారు.
3వేలకు చేరిన పులుల సంఖ్య
పులి బతకాలి, పులి అడవిలో స్వేచ్ఛగా తిరగాలి, భావితరాలకు పులి రాజసం తెలియాలి! ఇదే సేవ్ టైగర్ ప్రాజెక్ట్ సంకల్పం, ఆ శ్రమకు నేడు ఫలితం కనిపిస్తోంది. పులుల సంఖ్య దాదాపు 1800 నుంచి 3000కు చేరుకుంది. అయినప్పటికీ పులిని అంతరించిపోతున్న జాతిగా పరిగణించడం బాధాకరమైన అంశం. గత కొన్ని సంవత్సరాలుగా, అభయారణ్యాల సంఖ్య 9 నుండి 54కి పెరిగింది. ఇప్పుడు ప్రపంచంలోని 70శాతం పులులకు మనదేశమే ఆలవాలంగా ఉంది. ఇది ఊరటనిచ్చే విషయం. అయినా సరే, మూడింట ఒకటోవంతు పులులు సురక్షిత ప్రాంతాలను వదిలేసి బయటే తిరుగుతుండటం వన్యప్రాణ ప్రేమికులను కలవరపెట్టే అంశం.
గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌కు మరో వినూత్న అవార్డు
ఇదిలావుంటే గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌కు మరో వినూత్న అవార్డు దక్కింది. పర్యావరణ పరిరక్షణకు పాటుపడినందుకు ప్రముఖ మీడియా సంస్థ నెట్ వర్క్ 18 గ్రూప్ గ్రీన్ రిబ్బన్ ఛాంపియన్ గా ఎంపీ సంతోష్ కుమార్ కు గుర్తింపునిచ్చింది. గతవారం ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో అనివార్య కారణాల వల్ల ఎంపీ హాజరు కాలేక పోయారు. దీంతో శనివారం నాడు నెట్ వర్క్ 18 గ్రూప్ ప్రతినిధి సంతోష్ కుమార్ ను కలిసి అవార్డును అందించారు. పర్యావరణ పరిరక్షణ, పచ్చదనం పెంపు, సామాజిక స్పృహ, అన్నివర్గాల ప్రాతినిధ్యానికి కృషి, దేశవ్యాప్తంగా వివిధ రంగాలకు చెందిన ప్రముఖులను గ్రీన్ అంబాసిడర్లుగా ప్రమోట్ చేస్తున్నందుకు సంతోష్ కుమార్ గ్రీన్ రిబ్బన్ ఛాంపియన్ గా ఎంపికైనట్లు నెట్ వర్క్ 18 గ్రూప్ తెలిపింది. పర్యావరణ మార్పుల వల్ల మానవాళికి పొంచిఉన్న పెనుముప్పుపై అవగాహన కల్పించేందుకు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ చేస్తున్న కృషి అమోఘమని సంస్థ ప్రతినిధులు ప్రశంసించారు.