మావోయిస్టు పార్టీలో తుపాకీపై చీలిక: ఉనికి కోసం తుపాకీ వదిలేస్తారా? లేక పోరాటం కొనసాగిస్తారా? తుపాకి పై మావోయిస్టు పార్టీ ఉద్దేశాలేంటి ?
Maoist Party:"తుపాకీ గొట్టం నుంచే రాజకీయ అధికారం వస్తుంది" అని విప్లవకారులను తుపాకీ పట్టేలా ప్రేరేపించే సిద్ధాంతాన్ని ప్రకటించారు మావో జెడాంగ్. దీనిపై ఆ పార్టీలోనే భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Maoist Party: ఆపరేషన్ కగార్‌తో మావోయిస్టు పార్టీ ఉక్కిరిబిక్కిరి అవుతోంది. పార్టీ ప్రధాన కార్యదర్శి సహా ముఖ్య నేతలంతా భద్రతా బలగాల చేతుల్లో ఎన్‌కౌంటర్ అవుతున్నారు. పార్టీ మనుగడ ప్రశ్నార్థకమవుతోంది. ఈ తరుణంలో మావోయిస్టుల మధ్య ఉన్న సైద్ధాంతిక విభేదాలు బయటపడ్డాయి. శాంతి చర్చల కోసం తుపాకీ పక్కన పెడతామని మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు మల్లోజుల వేణుగోపాల్ రావు అలియాస్ సోనూ అలియాస్ అభయ్ పేరుతో లేఖ విడుదల చేశారు. ఈ లేఖ విడుదల కాగానే దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఎందుకంటే, మావోయిస్టు పార్టీకి తుపాకీ అనేది ఒక ఆయుధం మాత్రమే కాదు, అది ఒక సిద్ధాంతం. అయితే, ఈ ఆయుధాలు పక్కన పెడతామని అభయ్ పేరిట వచ్చిన లేఖను ఖండిస్తూ తెలంగాణ రాష్ట్ర కమిటీ ప్రతినిధి జగన్ పేరుతో మరో లేఖ విడుదల కావడం తీవ్ర చర్చకు దారి తీసింది. తుపాకీ పక్కన పెట్టడం అనేది పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమేనని, పార్టీ ఆలోచన అది కాదని ఆ లేఖలో స్పష్టం చేయడం జరిగింది. దీంతో మావోయిస్టు పార్టీలో సైద్ధాంతిక విభేదాలు బయటపడినట్లయింది. అయితే, అసలు తుపాకీ పక్కన పెట్టాలా వద్దా అన్న విషయంలో ఇంత పెద్ద చర్చ జరగడం వెనుక కారణాలు ఏంటి? మావోయిస్టు పార్టీ తుపాకీ విషయంలో ఎందుకు ప్రాధాన్యత ఇస్తుంది అన్న అంశాలు ఈ కథనం ద్వారా తెలుసుకుందాం.
తుపాకీ గొట్టంతోనే రాజ్యాధికార సాధన సిద్ధాంతం
మన దేశంలో అధికారంలోకి రావాలంటే బ్యాలెట్ ద్వారా రాజకీయ అధికారం దక్కుతుంది. కానీ, మావోయిస్టు పార్టీ సిద్ధాంతం ప్రకారం, రాజకీయ అధికారం తుపాకీ గొట్టం ద్వారానే ఉద్భవిస్తుంది. ఈ సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది మావో జెడాంగ్. మావో జెడాంగ్ (1893-1976) చైనా కమ్యూనిస్ట్ పార్టీ వ్యవస్థాపకుడు, పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనాకు మొదటి అధ్యక్షుడిగా పనిచేశారు. ఆయన మార్క్సిజం, లెనినిజంల ఆధారంగా మావోయిజం అనే కొత్త విప్లవ సిద్ధాంతానికి రూపకల్పన చేశారు. దీర్ఘకాలిక సాయుధ పోరాటం ద్వారా చైనాను ఏకం చేసిన వ్యక్తి. చైనాలో నాటి భూస్వామ్య వ్యవస్థను రద్దు చేసి నవ చైనా రూపకల్పనకు నాంది పలికిన వ్యక్తి. చైనాలో కమ్యూనిస్ట్ పార్టీని శక్తివంతమైన రాజకీయ, సైనిక శక్తిగా రూపొందించడంలో మావో జెడాంగ్ కీలక పాత్ర పోషించారు. 'తుపాకీ గొట్టం ద్వారానే రాజ్యాధికారం' అన్న సాయుధ విప్లవ సిద్ధాంతాన్ని ప్రవచించింది మావోనే. ఆయన సిద్ధాంతాలు మన దేశంతోపాటు లాటిన్ అమెరికా, మరి కొన్ని ప్రపంచ దేశాల్లో విప్లవోద్యమాలను నడిపించాయి. ఆయన సిద్ధాంతాల ప్రభావం ఇప్పటికీ ప్రపంచ రాజకీయాలపై కనిపించడం విశేషం.
తుపాకీ ద్వారా రాజ్యాధికార సిద్ధాంత వివరణ - భారత దేశంలో విస్తరణ
ఈ సిద్ధాంతాన్ని మావో 1938లో ప్రతిపాదించారు. 1938లో చైనా - జపాన్ యుద్ధం జరుగుతున్న రోజుల్లో చైనా కమ్యూనిస్ట్ పార్టీ కేంద్ర కమిటీ సమావేశంలో మావో ఈ సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. 'యుద్ధం - వ్యూహాత్మక సమస్యలు' అనే ప్రసంగంలో ఈ సిద్ధాంతాన్ని మావో వివరించారు. యుద్ధం అనేది రాజకీయ లక్ష్యాలను సాధించే ఒక సాధనంగా చెప్పారు. యుద్ధం ద్వారానే అంటే ఆయుధంతోనే ప్రజలు అధికారంలోకి వస్తారని, "రాజకీయ అధికారం అనేది తుపాకీ గొట్టం నుండే వస్తుంది" (Political power grows out of the barrel of a gun) అని ఎంతో మంది విప్లవకారులను తుపాకీ పట్టేలా ప్రేరేపించే సిద్ధాంతాన్ని ప్రకటించారు. మావో చెప్పిన ఈ సిద్ధాంతం విప్లవ పార్టీలకు, విప్లవకారులకు కీలకమైన విషయంగా మారింది. సాయుధ పోరాటం ద్వారానే సమ సమాజ స్థాపన జరుగుతుందని మావోయిస్టు పార్టీతో సహా సాయుధ పోరాటం అనుసరించే కమ్యూనిస్ట్ అండ్ మావోయిస్టు పార్టీలు ప్రపంచవ్యాప్తంగా నమ్మడం ప్రారంభించాయి. భూస్వామ్య వ్యవస్థలు, పాలక వర్గాలు ప్రజలను అణిచివేస్తుంటే వారికి విముక్తి కల్పించేది సాయుధ పోరాటమే, అందుకు తుపాకీ పట్టాల్సిందే అన్న సిద్ధాంతం ఇక్కడి నుండే మొదలైంది. శాంతియుత నిరసనలు, శాంతి మార్గం లేదా బ్యాలెట్ పద్ధతిలో ఈ మార్పు జరగదన్నది మావోయిస్టు పార్టీ సిద్ధాంతంగా మారింది.
మావోయిస్టు పార్టీ సిద్ధాంతం విస్తరణ
ఇక మన దేశంలో ఈ సిద్ధాంతం నక్సల్ బరీ ఉద్యమం నుంచి ప్రారంభమైంది. చారు మజుందార్ ఈ సిద్ధాంతపరమైన ఉద్యమానికి నాంది పలికారు. మావో జెడాంగ్ ప్రతిపాదించిన ఈ సిద్ధాంతాన్ని మన దేశంలోని భూస్వామ్య వ్యవస్థ దోపిడీని అరికట్టేందుకు అమలు చేయాలని నిర్ణయించారు. నక్సల్ బరీ ఉద్యమానికి సిద్ధాంతకర్త చారు మజుందార్ కాగా, ఈ తరహా ఉద్యమాన్ని ప్రారంభించిన నాయకుల్లో కానూ సన్యాల్ కూడా ఒకరిగా చెప్పాలి. 'తుపాకీ గొట్టం ద్వారానే రాజ్యాధికారం' అనే సిద్ధాంతం నాటి ఆంధ్రప్రదేశ్, దండకారణ్యం వంటి ప్రాంతాలకు విస్తరింపజేసిన నాయకుల్లో కొండపల్లి సీతారామయ్యది కూడా కీలక పాత్ర. నాడు పీపుల్స్ వార్ గా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కార్యకలాపాలు ప్రారంభించిన పార్టీ 2004లో మావోయిస్టు కమ్యూనిస్టు సెంటర్ ఆఫ్ ఇండియాగా ఏర్పడింది. అప్పటి నుంచి మావో జెడాంగ్ ప్రతిపాదించిన సాయుధ పోరాటం ద్వారా రాజ్యాధికారం అనేది అధికార సిద్ధాంతంగా మారింది.
తుపాకీ ఆయుధం కాదు, మావోయిస్టు పార్టీ అధికారిక సిద్ధాంతం
తుపాకీ అనేది మావోయిస్టు పార్టీకి ఒక ఆయుధం కాదు. అది వారి పార్టీ సిద్ధాంతం. తుపాకీ పక్కన పెట్టడం అంటే సిద్ధాంతాన్ని పక్కన పెట్టడంలాంటిదేనని ఈ విప్లవ పార్టీలను దగ్గరగా చూసే చరిత్రకారులు చెబుతారు. అయితే, తుపాకీ ప్రాముఖ్యతపై ఇప్పుడు ఆ పార్టీలోనే భిన్న స్వరాలు వినిపపిస్తున్నాయి. అందులో భాగమే మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు మల్లోజుల వేణుగోపాల్ రావు విడుదల చేసిన లేఖ, దాన్ని ఖండిస్తూ తెలంగాణ రాష్ట్ర కమిటీ ప్రతినిధి జగన్ విడుదల చేసిన లేఖ. మారిన పరిస్థితులకు అనుగుణంగా తుపాకీ వదలి శాంతియుత మార్గాల ద్వారా లక్ష్యాన్ని చేరుకోవాలని కొందరు ప్రతిపాదిస్తుంటే, తుపాకీ విడిచిపెడితే ఉద్యమం బలహీనమవుతుందని మరికొందరి వాదన. ఈ భిన్నాభిప్రాయాలతోనే పార్టీలో చీలికలు రావచ్చని, అందులో భాగమే ఈ లేఖాస్త్రాలని కొద్ది మంది విశ్లేషకుల మాట. అయితే, ఏది ఏమైనా మావోయిస్టు పార్టీకి తుపాకీ అనేది పోరాట మార్గం కోసం మాత్రమే కాదు, అది రాజకీయ అధికారం కోసం అడుగులు వేసే ప్రాథమిక మార్గం అని చెప్పవచ్చు. అయితే, ఈ విషయంలో మావోయిస్టు పార్టీ అధికారిక నిర్ణయం ఏంటా అన్న ఉత్కంఠ మాత్రం ఇప్పుడు దేశవ్యాప్తంగా నెలకొంది. మరో వైపు భద్రతా బలగాలు మాత్రం ఆపరేషన్ కగార్ పేరుతో మావోయిస్టులను అంతం చేసేందుకు వ్యూహాలకు పదును పెడుతున్నాయి. దీన్ని తుపాకీ ద్వారా అడ్డుకుంటారా, లేక శాంతియుత చర్చల ద్వారానా అన్న విషయం తేలాలంటే మాత్రం వేచి చూడాల్సిందే.





















