Maoist Party : మావోయిస్ట్ పార్టీలో సంక్షోభం-సాయుధ పోరాట విరమణపై 'కామ్రేడ్ సోను' ప్రకటన ఖండించిన కేంద్ర కమిటీ
Maoist Party : సాయుధ పోరాట విరమణ ఆలోచనే లేదని మావోయిస్టు పార్టీ ప్రకటించింది. కామ్రేడ్ సోనూ ప్రకటనను ఖండించింది. పద్ధతి కాదని చీవాట్లు పెట్టింది.

Maoist Party : గత కొన్నేళ్లుగా దేశంలోని మావోయిస్టు విప్లవోద్యమ శిబిరాన్ని కకావికలం చేస్తున్నాయి. ఇప్పుడు ఆ శిబిరమే చీలిపోయిందన్న వాదన బలంగా వినిపించే ఘటన చోటు చేసుకుంది. కేంద్ర ప్రభుత్వం ఒకవైపు మావోయిస్ట్ పార్టీని 2026 మార్చి నాటికి సమూలంగా నిర్మూలిస్తామని బహిరంగంగా ప్రకటిస్తోంది. ఆ దిశగానే నిర్మూలన చర్యలు తీవ్రతరం చేస్తోంది. ఈ పరిస్థితుల్లో పార్టీ కేంద్ర కమిటీ కీలక నాయకుడు 'సాయుధ పోరాటాన్ని విరమిస్తున్నట్లు' ప్రకటించడం విప్లవ శిబిరంలో తీవ్ర గందరగోళాన్ని సృష్టించింది. ఈ ప్రకటనపై మావోయిస్ట్ పార్టీ అధికార ప్రతినిధి 'జగన్' తీవ్ర అభ్యంతరం తెలుపుతూ, అది పార్టీ నిర్ణయం కాదని, ఈ పద్ధతి ఉద్యమానికి నష్టం కలిగిస్తుందని ఒక ప్రత్యేక పత్రికా ప్రకటన ద్వారా స్పష్టం చేశారు.
పార్టీ ముఖ్య నాయకత్వంపై యుద్ధ దాడులు తీవ్రంగా కొనసాగుతున్న ఈ క్లిష్ట సమయంలో వచ్చిన ఈ తాజా ప్రకటన పార్టీలో అంతర్గత విబేధాలు, ఒత్తిడి ఏ స్థాయిలో ఉందో తెలియజేస్తోంది.
'కగార' ఆపరేషన్‌తో ఉక్కిరిబిక్కిరి
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం విప్లవోద్యమ నిర్మూలనకు చాలా ఏళ్ల నుంచి పథకాలు రచిస్తోంది. 'కగార' అనే పేరుతో భారీ స్థాయి యుద్ధ చర్యలను అమలు చేస్తోంది. ఈ చర్యల లక్ష్యం కేవలం క్యాడర్ మాత్రమే కాదు, నాయకత్వాన్ని, సహకరించే ప్రజలను కూడా నిర్మూలించడమేనని మావోయిస్టులు ఆరోపిస్తోంది.
ఈ ఆపరేషన్ ఫలితంగా మావోయిస్టు పార్టీకి తీరని నష్టం వాటిల్లింది. మే 21న జరిగిన దాడిలో ఏకంగా పార్టీ ప్రధాన కార్యదర్శితో సహా 28 మంది కామ్రేడ్స్ చనిపోయారు. అంతేకాకుండా, జూన్ నుంచి సెప్టెంబర్ వరకు జరిగిన ఘటనలలో కేంద్ర కమిటీ సభ్యులు ఉదయ్ అలియాస్ గజరల్ రవి, మోడెం బాలకృష్ణ, పరేవశ సోరెన్ కూడా మృతి చెందారు. రాష్ట్ర కమిటీ సభ్యులు గౌతమ్, భాస్కర్, అరుణ, జగన్ అలియాస్ పండన్న, పండు అలియాస్ చంద్రహాస్ వంటివారు కూడా కన్నుమూశారు.
ఈ భయంకరమైన దాడులు కొనసాగుతున్న నేపథ్యంలో, కొంతమంది రాష్ట్ర కమిటీ సభ్యులు, కింది స్థాయి కమిటీ సభ్యులు అనారోగ్య సమస్యల రీత్యా పార్టీ అనుమతితోనే సరెండర్ అయ్యారని ప్రస్తుతం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు జగన్.
శాంతి ప్రతిపాదనలు – ప్రభుత్వం వైఖరి
విప్లవ శిబిరంపై జరుగుతున్న యుద్ధ చర్యలను ఆపాలని దేశవ్యాప్తంగా ప్రజా సంఘాలు, ప్రజలు, మేధావులు, సంఘాలు, ప్రముఖులు విజ్ఞప్తులు చేశారు. తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాల్లోనూ 'కగార' యుద్ధ కాండను నిలుపుదల చేయాలని ఒత్తిడి చేస్తున్నారు.2025 మార్చిలో కొంతమంది ప్రజాస్వామిక మేధావులు ‘పీస్ డైలాగ్ కమిటీ’గా ఏర్పడి, ప్రభుత్వానికి, మావోయిస్ట్ పార్టీకి మధ్య శాంతి చర్చలు జరగాలని ప్రతిపాదన చేశారు. దీనికి జవాబుగా కేంద్ర కమిటీ స్పందిస్తూ కూంబింగ్‌లు, హత్యకాండను ఆపాలని, కొత్త క్యాంపుల నిర్మాణం నిలుపుదల చేసి శాంతియుత వాతావరణంలోనే చర్చలు జరపాలని స్పష్టంగా ప్రకటించింది. అని లేఖలో పేర్కొన్నారు.
అయితే, కేంద్ర ప్రభుత్వం ఈ డిమాండ్‌లను పట్టించుకోకుండా, ఎటువంటి సడలింపులూ లేకుండా యుద్ధ చర్యలను కొనసాగిస్తూనే ఉంది. బీజేపీ నాయకులు అయితే, తాము మావోయిస్టులతో చర్చించేది లేదని, ఆయుధాలు విడిచిపెట్టి సరెండర్ కావాలని పదే పదే ప్రకటిస్తున్నారని జగన్ పత్రికా ప్రకటనలో పేర్కొన్నారు. ఫాసిస్ట్ భావజాలంతో, రాజ్యాంగ వ్యతిరేకంగా, చట్ట వ్యతిరేకంగా నిర్మూలన కార్యక్రమాన్ని కొనసాగించి తీరుతామని బీజేపీ నాయకత్వం ప్రకటిస్తోందని ఆరోపించారు.
పార్టీలో గందరగోళం: కామ్రేడ్ సోను ప్రకటనపై ఖండన
ఈ ప్రతికూల వాతావరణంలోనే, కీలకమైన అంతర్గత సంక్షోభం తెరపైకి వచ్చింది. కేంద్ర కమిటీ సభ్యుడైన కామ్రేడ్ సోను, సాయుధ పోరాటాన్ని విరమిస్తున్నామని ప్రకటిస్తూ, తమ అభిప్రాయాలను తెలుసుకోవడానికి నెల రోజులు సమయం ఇవ్వాలని కోరారు. సుదీర్ఘంగా వివిధ ప్రాంతాల్లో ఉన్న పార్టీ నాయకులు, కార్యకర్తలు తమ అభిప్రాయాలను తాను ఇచ్చిన ఇమెయిల్ అడ్రస్‌కు పంపాలని ఆయన కోరారు. ఇది సరైన పద్ధతి కాదని అని లేఖలో అభ్యంతరం వ్యక్తం చేశారు జగన్.
ఒక సీనియర్ నాయకుడు, అదీ తీవ్ర దమనకాండ జరుగుతున్న సమయంలో, ఇంటర్నెట్ మాధ్యమంగా పార్టీ మౌలిక సిద్ధాంతమైన సాయుధ పోరాట విరమణ గురించి బహిరంగంగా ప్రకటించడం ఈ మొత్తం వ్యవహారంలో ప్రత్యేకతను సంతరించుకుంది. దీంతో పార్టీ శ్రేణులలో తలెత్తిన గందరగోళాన్ని తగ్గించడానికి జగన్ ఈ కీలక ప్రకటన చేశారు.
బహిరంగ ప్రకటనకు ఖండన
కామ్రేడ్ సోను పద్ధతిపై అధికారిక ప్రతినిధి జగన్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు, ఇది పార్టీ ముఖ్య ఉద్దేశాన్ని దెబ్బతీస్ుతందని అన్నారు. సోను అనుసరించిన పద్ధతి అర్థం కావటం లేదని తెలిపారు. ఒకవేళ ఎవరైనా ఉద్యమాన్ని విడిచిపెట్టాలని భావిస్తే పార్టీ కమిటీలో చర్చించి అనుమతి పొందవచ్చని చెప్పారు. తన అభిప్రాయాన్ని పార్టీ విభాగాలకు పంపించి ఉంటే జవాబులు దొరికేవి అన్నారు.
అది చేయకుండా, ఈ విధంగా బహిరంగంగా ప్రకటిస్తే పార్టీ శ్రేణుల్లోనూ, విప్లవ శిబిరంలోనూ గందరగోళం తలెత్తుతుందని, ఈ పద్ధతి ఉద్యమానికి నష్టమే తప్ప ఉపయోగపడదని పార్టీ తేల్చి చెప్పింది. "దేశంలోని ఏ పార్టీ అయినా ఇటువంటి నిర్ణయాలను ఇంటర్నెట్ ద్వారా బహిరంగ చర్చకు పెట్టి పరిష్కరించాలని చూస్తారా." అని జగన్ ప్రశ్నించారు. అటువంటిది, రహస్య పార్టీ, కేంద్రీకృత ప్రజాస్వామ్య సూత్రాలకు కట్టుబడిన పార్టీ, తీవ్రమైన యుద్ధ చర్యలు అమలు అవుతున్న వేళ మంచిగా ఆలోచించేవారు ఇలా చేయరని స్పష్టం చేశారు.
ప్రస్తుతం ఎదుర్కొంటున్న సమస్యపై పార్టీలోపై స్థాయి నుంచి కింది స్థాయి వరకు అందరూ తీవ్రంగానే ఆలోచిస్తున్నారని, అనవసరంగా నష్టపోవాలని ఎవరూ అనుకోవడం లేదని పార్టీ తెలిపింది. అయితే, ఈ సమస్యకు పరిష్కారం బహిరంగ ప్రకటనలతో అయ్యేది కాదని, భయంకరమైన దమనకాండలో ఇటువంటి నష్టాలు సహజంగానే జరుగుతాయని అర్థం చేసుకోవాలని సూచించింది.
కామ్రేడ్ సోను ప్రకటన పార్టీ అధికారిక ప్రకటన కాదని, విప్లవ శిబిరం, మిగిలిన రాజకీయ పార్టీలు దీనిని అధికారిక ప్రకటనగా గుర్తించాల్సిన అవసరం లేదని, దీనితో గందరగోళ పడాల్సిన అవసరం లేదని అధికార ప్రతినిధి తేల్చిచెప్పారు.
2024లో పొలిట్ బ్యూరో విడుదల చేసిన సర్క్యులర్‌ను అమలు జరపటమే తక్షణ కర్తవ్యం అన్నారు. ఫాసిస్ట్ బీజేపీ ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా పోరాటాలను మరింత తీవ్రతరం చేయాలి అని పార్టీ తన శ్రేణులకు, విప్లవ అభిమానులకు పిలుపునిచ్చింది.





















